న్యూఢిల్లీ: సెక్యులర్ శక్తులతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది. బీహార్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ కూటమి సానుకూల ఫలితాలు సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ ప్రకటన చేసింది. సెక్యులర్ శక్తులతో కలసి పనిచేస్తామని కాంగ్రెస్ 2003లో సిమ్లా సంకల్ప సదస్సులో ప్రకటించిందని, అదే విధానం ఇకపై కూడా కొనసాగుతుందని, అవసరమైన చోటల్లా ఇతర సెక్యులర్ శక్తులతో కలుస్తామని కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ గౌడ ఢిల్లీలో చెప్పారు. బీహార్ ఉప ఎన్నికల్లో మహాకూటమి పదిసీట్లలో ఆరింటిని గెలిచిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో కూడా పొత్తులుంటాయా? అన్న ప్రశ్నకు ఆయన సానుకూలంగా స్పందించారు.