అనూహ్యం.. బీఎస్పీకి అఖిలేశ్ పిలుపునిచ్చాడా?
లక్నో: ఉత్తరప్రదేశ్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? బిహార్లో మాదిరిగా జాతీయ పార్టీని వెళ్లగొట్టేందుకు రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక్కటైనట్లుగానే ఇప్పుడు యూపీలో కూడా ఎడమొహంపెడమొహంలాగా ఉండే పార్టీలు ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయా? లౌకికవాదం పేరుతో బీజేపీకి యూపీ నుంచి తిరుగుటపా కట్టే చర్యకు దిగబోతున్నారా? అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తాజాగా చేసిన ప్రకటన అదే ఆలోచనకు ఊపిరిపోస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద పార్టీగా అవతరించనుందని, అధికారం చేపట్టనుందని తేలడంతో అఖిలేశ్ యాదవ్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాషాయవర్ణ పార్టీ(బీజేపీ)ని యూపీలోకి అడుగుపెట్టనివ్వకుండా చేయాలంటే లౌకిక వాద శక్తులు(ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ, తదితరపార్టీలు) ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ కూటమిగా అయ్యాయి. ఇక మిగిలిన మరో పెద్ద లౌకికవాద పార్టీ బీఎస్పీ. అఖిలేశ్ తాజా ప్రకటన ప్రకారం బీఎస్పీని కూడా తమతో పెట్టుకునేందుకు, చేయికలిపేందుకు కలిసి రావాలని ఆహ్వానం పంపించినట్లేనని రాజకీయ పండితులు అనుకుంటున్నారు.
‘సమాజంలోని అన్ని రకాల వ్యవస్థలకు, వ్యక్తులకు రక్షణ కల్పించాలంటే కాషాయ పార్టీని ఎదుర్కోవాలి. ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రజాస్వామ్య బద్ధ ప్రభుత్వాన్ని అందించేందుకు లౌకికవాద శక్తులంతా ఒక బాధ్యతగా భావించి ఏకం కావాలి’ అంటూ అఖిలేశ్ ఓ మీడియాకు చెప్పారు. అయితే, లౌకిక అనే పదం తప్ప ఆయన నేరుగా బీఎస్పీ కూడా రావాలని ప్రత్యక్షంగా మాత్రం చెప్పలేదు. అయితే, ఒక వేళ రాష్ట్రంలో హంగ్ పరిస్థితి తలెత్తితే తాము కానీ, ఇతరులు కానీ రాష్ట్రపతి పాలనకు అంగీకరించబోమని, అలా జరిగితే యూపీపై కేంద్రం పెత్తనం పెరిగిపోతుందని అన్నారు. అయితే, మరోసారి తమకు పూర్తి మెజార్టీ వస్తుందని నమ్మకం ఉందని, ఏదేమైనా ఫలితాలు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందేనని అఖిలేశ్ చెప్పారు.
అయితే, లౌకిక శక్తులు మాత్రం కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని హింట్ మాత్రం ఇచ్చారు. అయితే, 1995 జూన్లో జరిగిన సంఘటనను బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం ఎప్పటికీ మర్చిపోదని, ఆ సమయంలో సమాజ్వాది పార్టీ కార్యకర్తలు ఆమెపై దాడి చేసి తీవ్రంగా వేధించారని, ఆ ఆగ్రహం ఆమెను ఇప్పటికీ వెంటాడుతునే ఉందని అంటున్నారు. అయితే, 1993లో మాత్రం మాత్రం బీఎస్పీ, ఎస్పీలు పొత్తు పెట్టుకుని సమర్థంగా బీజేపీని అడ్డుకున్నాయి. అయితే, 1995నాటికే ఆ బంధం బద్దలైంది. ఎన్నికల ఫలితాలను బట్టి ఎలాంటి పరిణామాలైన జరిగే అవకాశం ఉందని మాత్రం అఖిలేశ్ పరోక్షంగా చెప్పారు.