జెండా ఊపిన అనంతరం సిటీ బస్సెక్కిన సీఎం నితీశ్ కుమార్, పక్కనే ఆయనకు టికెట్ ఇచ్చిన మహిళా కండక్టర్
పచ్చజెండా ఊపి సిటీ బస్సులను ప్రారంభించిన ముఖ్యమంత్రి.. సరదాగా బస్సులో ప్రయాణించారు. తెలివైన మహిళా కండక్టర్ టికెట్ కొట్టి చేతిలో పెట్టేవరకు.. సీఎంగారు కాస్త కంగారుపడ్డారు. ఎందుకంటే అప్పుడాయన దగ్గర చిల్లిగవ్వా లేదుమరి! చివరికి ఓ అధికారి దగ్గర ఐదు రూపాయలు అప్పుతీసుకోక తప్పని ఆ ముఖ్యమంత్రి మరెవరోకాదు బిహార్ 'వికాస్ పురుష్' నితీశ్ కుమార్!
పాట్నా సిటీలో బుధవారం లోకల్ బస్సు సేవలను ప్రారంభించిన సీఎం నితీశ్ గాంధీ మైదాన్ నుంచి పాట్నా స్నేషన్ వరకు వెళ్లే బస్సులో ఎక్కి కూర్చున్నారు. మొదటి ప్రయాణికుడు ముఖ్యమంత్రే కావడంతో ఆ బస్సు కండక్టర్ ఉత్సాహంగా టికెట్ కొట్టింది. జేబులో డబ్బులు లేకపోవడంతో సీఎం నితీశ్.. అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత్ లాల్ మీనా దగ్గర ఐదు రూపాయలు అడిగి తీసుకున్నారు.
ఈ తంతంగం అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ'ఇవాళ ఓ అధికారి నా జీవితాన్ని కాపాడాడు' అంటూ బస్సులో జరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకటో తారీకున జీతం పడగానే ఐదురూపాయలు తిరిగిచ్చేస్తానని సరదాగా అన్నారు. ఇలా కచ్చితంగా అవసరమైనప్పుడు జేబులు తడుముకోవడం నితిశ్ కుమార్ కు కొత్తేమీకాదు. గతంలో ఓ సారి ఆయన పార్టీ సభ్యత్వం రెన్యూవల్ డబ్బును పార్టీ సభ్యుడొకరు చెల్లించారు.