బీహార్ ముఖ్యమంత్రి ఎవరు?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే అంశంపై ఆ రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చ మొదలైంది. అనుభవజ్ఞుడైన మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఎన్నికలకు ముందు వినిపించింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సీఎం పదవికి రేసులో ఉన్న నాయకుల్లో ఆయన పేరు మచ్చుకు కూడా వినిపించడం లేదు. దీనికి కారణం ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే కావచ్చు. రొహతాస్ జిల్లా దినార అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రాజేంద్రసింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
రాజేంద్ర సింగ్ ఆరెస్సెస్‌లో పూర్తికాల కార్యకర్త. ఆయన్ని అప్పుడే 'బిహార్ మనోహర్ లాల్ ఖట్టర్' అని కూడా అనుచరవర్గం పిలుస్తోంది. ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ అయిన మనోహర్ లాల్ ప్రస్తుతం హర్యానా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆరెస్సెస్‌లో పూర్తికాల కార్యకర్తగా రాజేంద్రసింగ్ పనిచేసినా ఆయన బిహార్ రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా లేరు. ఏబీవీపీ నుంచి పార్టీలోకి వచ్చినా.. ఆయన ఎక్కువకాలం ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నారు. జార్ఖండ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా 2013లో ఆయన ఎన్నికయ్యారు. అయితే ఆయనకున్న అడ్డంకి ఒక్కటే. ఆయన తాను పోటీచేసిన దినార నియోజకవర్గం నుంచి గెలుస్తారా అన్నదే. ఎందుకంటే అక్కడ ఆయనపై నితీష్ ప్రభుత్వంలో సహకార శాఖ మంత్రిగా పనిచేస్తున్న జయ్‌కుమార్ సింగ్ జేడీయూ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా.
రాజేంద్రసింగ్ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు బీజేపీ గయ ఎమ్మెల్యే ప్రేమ్‌కుమార్. ఆయన బిహార్ అసెంబ్లీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఎమ్మెల్యే కావడంతో పాటు 1990 నుంచి ఇప్పటివరకు విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నడూ ఓడిపోలేదు. బలహీనవర్గాలకు చెందిన ఆయనే కాబోయే ముఖ్యమంత్రంటూ గయ పోలింగ్‌కు రెండు రోజుల ముందు బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ప్రకటించారు. ఆయనది కూడా రాజేంద్రసింగ్ లాంటి సమస్యే. ఆయనపై కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి ప్రియరంజన్ పోటీచేశారు.
బిహార్ ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న నందకిషోర్ యాదవ్ కూడా రేస్‌లో ఉన్నారు. ప్రేమ్‌కుమార్‌లాగే ఆయన కూడా ఓటమి ఎరుగని ధీరుడు. పైగా ఆరెస్సెస్ కార్యకర్త. నరేంద్ర మోదీకి కాస్త సన్నిహితులు. అలాగే మోదీకి సన్నిహితులు, బలహీనవర్గానికి చెందిన రామేశ్వర్ ప్రసాద్ చౌరాసియా పేరు కూడా వినిపిస్తోంది.