పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్ కుమార్‌కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని బిహార్ ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో జతకట్టి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ఇండియాటుడే సర్వే నిర్వహించింది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 46 శాతం మంది మద్దతు ప్రకటించారు. బీజేపీతో కలవడం వల్ల ఆయన విశ్వసనీయత కోల్పోలేదని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.
నితీశ్ ప్రభుత్వం నుంచి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను వెళ్లగొట్టిన తర్వాత రాష్ట్రంలో అవినీతి తగ్గిందా? అని ప్రశ్నించగా 49 శాతం మంది అవునని సమాధానం ఇచ్చారు. 40 శాతం కాదని చెప్పారు. 11 శాతం మంది తటస్థంగా ఉండిపోయారు. ఈనెల 22 నుంచి 26 వరకు 40 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా సర్వే నిర్వహించినట్టు ఇండియా టుడే వెల్లడించింది. 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
2017, జూలైలో మహాకూటమి నుంచి నితీశ్ కుమార్ బయటకు వచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి 2015 ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత.. నితీశ్ ఈ రెండు పార్టీలను వదిలేసి బీజేపీతో జత కట్టడాన్ని అప్పట్లో చాలా మంది తప్పుబట్టారు. కమలం పార్టీతో పొత్తు అనైతికమని దుయ్యబట్టారు. అయితే తాజా సర్వేలో నితీశ్‌కు ప్రజలు జై కొట్టడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment