
బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే..?
విద్వేష రాజకీయాలు పనికిరావని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
న్యూఢిల్లీ: మనదేశంలో విద్వేష రాజకీయాలు పనికిరావని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఈ విషయం ఆ పార్టీకి తెలిసివస్తుందని పేర్కొన్నారు. 'బిహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ముఖ్యం. బిహార్ లో ఓడితే దేశంలో విద్వేష రాజకీయాలు పనికిరావన్న విషయం బీజేపీకి తెలుస్తుంది' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రజలు ఆత్మీయత, శాంతి కోరుకుంటున్నారని.. విద్వేషాలు కాదని అన్నారు.
జేడీ(యూ)కు ఓటు వేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. 'నితీశ్ కుమార్ కు ఓటు వేయాలని మీ బంధువులు, స్నేహితులకు చెప్పండి' అని ఢిల్లీలోని బిహారీలను కేజ్రీవాల్ కోరారు. బిహార్ లో చివరి విడత ఎన్నికలు ఈనెల 5న జరగనున్నాయి. 8న ఫలితాలు రానున్నాయి.
కాగా, దేశంలో మత అసహనం పెరిగిపోతోందని బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ స్వాగతించారు. షారూఖ్ వ్యాఖ్యలతోనైనా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
It is imp that BJP lose Bihar so that they know that hate politics will not work in this country. People want love n peace, not hate
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 4, 2015