సోనియా కూడా ‘బాహరీ’నా? | Nitish Modi's counter-claims made by outsiders | Sakshi
Sakshi News home page

సోనియా కూడా ‘బాహరీ’నా?

Published Sat, Oct 31 2015 3:43 AM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

సోనియా కూడా ‘బాహరీ’నా? - Sakshi

సోనియా కూడా ‘బాహరీ’నా?

బయటివాడని నితీశ్ చేసిన వ్యాఖ్యలకు మోదీ కౌంటర్
♦ 25 ఏళ్ల పాలనలో బిహార్‌ను లూటీ చేశారని నితీశ్, లాలూలపై ధ్వజం
♦ ముగిసిన 4వ దశ ఎన్నికల ప్రచారం; 55 స్థానాలకు రేపు పోలింగ్
 
 ముజఫర్‌పూర్/గోపాల్‌గంజ్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. 4వ దశ ఎన్నికల ప్రచారం చివరిరోజైన శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్ సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్ చేస్తున్న ‘బిహారీ వర్సెస్ బాహరీ(బిహార్ వ్యక్తి వర్సెస్ బయటి వ్యక్తి)’ ప్రచారంపై మోదీ మరోసారి మండిపడ్డారు. తాను పాకిస్తాన్‌కో, శ్రీలంకకో, బంగ్లాదేశ్‌కో ప్రధానిని కానని.. బిహార్‌తో కూడిన భారత్‌కు ప్రధానినని స్పష్టం చేశారు.

‘ఢిల్లీలో నివసిస్తున్న సోనియాగాంధీని కూడా నితీశ్ బయటి వ్యక్తి అనే అంటారా? ఆమె బిహారీనా? లేక బాహరీనా?.. చెప్పండి నితీశ్ బాబూ.. పనితీరు పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేని వారే ఇలా అంటుంటారు’ అని అన్నారు.  ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ సొంతగడ్డ గోపాల్‌గంజ్ సభలో మాట్లాడుతూ.. దోపిడీలతో ఈ ప్రాంతాన్ని మరో చంబల్‌గా మార్చాడంటూ లాలూపై ధ్వజమెత్తారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన అచ్చే దిన్ హామీని నెరవేర్చలేకపోతే పాత రోజులను మోదీ తిరిగితెస్తారా?’ అన్న  నితీశ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘నాటి ఆటవిక పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారా?’ అని  నితీశ్‌ను ప్రశ్నించారు.

గత ప్రభుత్వాల హయాంలో రాష్టంలో వెల్లువెత్తిన 30 కుంభకోణాల జాబితాను మోదీ వరుసబెట్టి చెప్పారు. ‘ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ల కూటమిని గెలిపిస్తే మరిన్ని స్కామ్‌లు తెరపైకి వస్తాయి. బిహార్‌ను లూటీ చేసిన వారంతా కలసి ఏర్పాటు చేసుకున్న కూటమిని శాశ్వతంగా తిరస్కరించండి. వారిని కఠినంగా శిక్షించండి’ అని పిలుపునిచ్చారు. అన్ని విషయాల్లో తనపై విమర్శలు గుప్పించే తన శత్రువులు సైతం.. ప్రధానిగా తన 16 నెలల పాలనపై అవినీతి ఆరోపణలు చేయలేదని గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తనపై  విశ్వాసం ఉంచినట్లే.. ఈ ఎన్నికల్లోనూ తనను నమ్మాలని బిహారీలను కోరారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం మంచిదని చెబుతూ.. ‘వెనకబాటుతనం అనే ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని పైకి లాగడానికి కేంద్రం, రాష్ట్రం అనే రెండు ఇంజిన్లు అవసరమవుతాయ’ని వ్యాఖ్యానించారు. 4వ దశ ఎన్నికల్లో 55 స్థానాలకు నవంబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి.

 రిజర్వేషన్ల కుట్ర... ముస్లిం రిజర్వేషన్లను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటా నుంచి కొంత శాతాన్ని ఓ ప్రత్యేక వర్గాన్ని కేటాయించేందుకు మహా కూటమి కుట్ర చేస్తోందని మోదీ మళ్లీ ఆరోపించారు. దీన్ని రాజ్యాంగ నిర్మాతలు కూడా వ్యతిరేకించారన్నారు. దీనికి సంబంధించి నితీశ్ కుమార్ 2005, ఆగస్ట్ 24న పార్లమెంట్లో చేసిన ప్రసంగాన్ని మోదీ ప్రస్తావించారు.

 బడే భాయి.. చోటే భాయి..
 ‘గత 25 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలిన బడే భాయి(లాలూ), చోటే భాయి(నితీశ్) రాష్ట్రాన్ని నాశనం చేశారు. వారు మళ్లీ అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగాలు రావు. ఉపాధి దొరకదు. బడా భాయికి తన కుటుంబం బావుంటే చాలు. గతంలో దాణా కుంభకోణంలో జైలుకు వెళ్లినప్పుడు భార్యను సీఎం చేశాడు. ఇప్పుడు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు కొడుకును సిద్ధం చేస్తున్నాడు’ అని లాలు, నితీశ్‌లను ఎద్దేవా చేశారు.

 అభివృద్ధి మంత్రం నుంచి పక్కకు..
 బిహార్లో ఎన్డీయే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ ప్రచార దిశ అభివృద్ధి మంత్రం నుంచి ఓబీసీలను ఆకర్షించే వైపునకు మారింది. ఓ ఓబీసీ కుమారుడికి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదా? అంటూ మోదీ ఈ ప్రచారంలో ఓబీసీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

 దేశాన్నీ కోల్పోతారు: నితీశ్
 బిహార్‌ను సాధించుకోవాలనే ఆరాటంతో ఉన్న ప్రధాని మోదీ తన విభజనవాద వ్యాఖ్యలతో దేశాన్నీ కోల్పోతారని నితీశ్ అన్నారు. కోటాపై మోదీ చేసిన వ్యాఖ్యలకు ఇలా స్పందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement