
నేను బయటి వ్యక్తిని అయితే ఆమె ఎవరు?
నేను బయటి వ్యక్తిని అయితే సోనియా గాంధీ ఎవరని ప్రధాని మోదీ ప్రశ్నించారు.
గోపాల్ గంజ్: బిహార్ ను దోచుకున్న వారిని శిక్షించాలని ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపాల్ గంజ్ లో జరిగిన ర్యాలీలో మోదీ ప్రసంగించారు.
'బిహార్ ఓటర్లకు ఒక విషయం చెప్పడానికి నేను ఇక్కడకు వచ్చాను. మీరు నన్ను నమ్మండి. లోక్ సభ ఎన్నికల్లో నాపై విశ్వాసం ఉంచారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ నామీద నమ్మకం ఉంచండి. రాష్ట్రంలో అవినీతిని అంతంచేసి చూపిస్తా' అని మోదీ పేర్కొన్నారు. ముజాఫర్పూర్ నిర్వహించిన ర్యాలీలోనూ మోదీ ప్రసంగించారు.
నితీశ్ కుమార్ చేసిన 'బిహార్ వర్సెస్ బాహారి' కామెంట్ పై మోదీ స్పందించారు. నేను బయటి వ్యక్తిని అయితే సోనియా గాంధీ ఎవరని ఆయన ప్రశ్నించారు. 'సోనియా గాంధీ ఢిల్లీలో నివసిస్తున్నారు. ఆమెను బాహారి అంటారా లేదా బిహారి అంటారా? దేశానికి నేను ప్రధానమంత్రిని కాదా, బిహార్ రాష్ట్రం ఇండియాలో లేదా, నేను ఎలా బయటి వ్యక్తిని అవుతాను' అని మోదీ ప్రశ్నించారు.