
పట్నా: దేశంలో ఎస్సీ, ఎస్టీలు తప్ప ఇతర కులాల జనాభాను లెక్కించే ప్రసక్తే లేదంటూ పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై బిహార్ ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ భిన్నస్వరం వినిపించారు. దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనగణన చేపట్టాలని శనివారం డిమాండ్ చేశారు. సంక్షేమ ఫథకాలకు రూపకల్పన చేయడానికి ఈ గణాంకాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. దేశంలో దళితేతర పేదలు ఎంతమంది ఉన్నారో తేల్చడానికి కుల ఆధారిత జనగణనే మార్గమని పేర్కొన్నారు. 2010లో కులాలవారీగా జనాభా లెక్కింపు ప్రారంభించారని, 2013లో నివేదిక సిద్ధమయ్యిందని, దాన్ని విడుదల చేయలేదని ఆక్షేపించారు. ఒక్కసారైనా కులాలవారీగా జనాభాను లెక్కించాలని కోరారు.