రిజర్వేషన్ల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మతాలను వాడుకుంటున్నారని ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ఆరోపించారు.
పట్నా: రిజర్వేషన్ల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మతాలను వాడుకుంటున్నారని ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ఆరోపించారు. బిహార్ అసెంబ్లీ మూడో విడత ఎన్నికల ర్యాలీలో సోమవారం, మంగళవారం ప్రధాని చేసిన వ్యాఖ్యలు వాటికి ఊతమిస్తున్నాయని బుధవారం లాలు వ్యాఖ్యానించారు. ఓటేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, లాలు ప్రసాద్, నితీష్ల కూటమి అధికారంలోకి వస్తే భవిష్యత్తులో రిజర్వేషన్లు ప్రమాదకరస్థితిలో ఉంటాయని దేశ ప్రధాని స్థాయికి ఇది తగదన్నారు. మతాల పరంగా రిజర్వేషన్లు కల్పిస్తారంటూ ప్రధానిగా ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీలకు ఇవ్వాల్సిన 5 శాతం రిజర్వేషన్ వారికి దూరం చేసి, ఇతర మతాల వారికి ఇస్తారని మోదీ తన ర్యాలీలో పేర్కొనడంపై లాలు మండిపడ్డారు. దళితులు, ఓబీసీల రిజర్వేషన్లను దేశంలో ఎవరూ తొలగించలేరని, బిహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమిని దిగ్భ్రాంతికి గురిచేస్తాయని చెప్పారు. మహాకూటమి కచ్చితంగా ఈ ఎన్నికలలో విజయం సాధిస్తుందని, తమకు కావలసిన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.