మోదీజీ క్షమాపణలు చెప్పండి: లాలు తనయ
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనయ మిసా భారతి.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలపై ఫైర్ అయ్యారు. బిహార్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందంటూ తప్పుడు ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిన మోదీ, బీజేపీ నాయకులు.. 11 కోట్ల మంది బిహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
2014-15లో జీఎస్డీపీలో బిహార్ 17.6 శాతం నమోదు చేసిందని, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొన్నట్టు మిసా భారతి చెప్పారు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమిని ఓడించడం కోసం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. బీజేపీ నేతల ఆరోపణలు తప్పని నీతి ఆయోగ్ నివేదిక నిరూపించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో మహాకూటమి పార్టీలు ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ల తరపున స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిగా మిసా విస్తృతంగా పర్యటించారు. బిహార్లో ఆర్జేడీ మద్దతుతో నితీశ్ కుమార్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.