మోదీపై లాలు సంచలన వ్యాఖ్యలు
పట్నా: బిహార్ మొత్తం దసరా పండుగ మూడ్లో ఉన్నప్పటికీ, ఆయా పార్టీల నేతలు తమ రాజకీయ ప్రత్యర్ధులపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. తాజాగా ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీని రాజకీయ రావణుడంటూ లాలు విమర్శించారు. 'విజయదశమి నాడు రావణుడు నాశనం అయినట్లు, బిహార్ ప్రజలు రాజకీయ రావణుడైన మోదీని నాశనం చేయాలి' అని పిలుపునిచ్చారు. మత రాజకీయాలను నామరూపాలు లేకుండా చేయాలన్నది తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు.
లాలూ వ్యాఖ్యలపై ఎన్డీఏ నేతలు కూడా అదే రీతిలో స్పందించారు. 'జంగల్ రాజా'ను ప్రజలే ఓడిస్తారంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. రావణ దహనం చేసి జేడీయూ చీఫ్ నితీశ్, లాలులను నాశనం చేసినట్లుగా ప్రజలు భావిస్తారని కేంద్ర మంత్రి రామకృపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. తనను విభీషణుడిగా సంబోధించిన నితీష్ కుమారే అసలైన రావణుడని మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ అన్నారు.