'ఆ అధికారం ఆయనకే'
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షాలతో సంప్రదింపులు జరిపే అధికారాన్ని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) తమ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ కు కట్టబెట్టింది. మాజీ సీఎం రబ్రీదేవి అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆర్జేడీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అభ్యర్థులను ఎంపికపై చర్చించేందుకు పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు ఈ నెల 17న సమావేశం కానుంది. అధికార జేడీ(యూ) ప్రాతినిథ్యం వహిస్తున్న చాలా స్థానాలు ఆర్జేడీ ఆశిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను లాలూకు అప్పజెప్పింది. లాలూ ఇద్దరు తనయులు తేజ్ ప్రతాప్, తేజస్వి వైశాలి జిల్లాలోని మాహువా, రాఘొపూర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు స్థానాలకు ప్రస్తుతం జేడీ(యూ) ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఐదు విడతల్లో జరగనున్నాయి. 243 శాసనసభ స్థానాలకు అక్టోబర్ 12, 16, 28, నవంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.