'ప్రధాని మోదీ నకిలీ ఓబీసీ'
పట్నా : బిహార్ను అభివృద్ధి చేస్తామని ధీమా ఉంటే స్కూటీలు, టీవీలు, ల్యాప్టాప్స్ ఇస్తామంటూ బీజేపీ ఎందుకు ప్రచారం చేస్తోందంటూ ప్రధాని నరేంద్రమోదీని ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం లాలు మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లకు ఆయన వ్యతిరేకమా, అనుకూలమా అన్న విషయాన్ని మోదీ స్పష్టం చేయాలన్నారు. ఒకవేళ ఆయన వ్యతిరేకిస్తే.. 'ప్రధాని నకిలీ ఓబీసీ' అవుతాడంటూ లాలు పేర్కొన్నారు.
ఆరెస్సెస్పై కూడా విమర్శలు గుప్పించారు. దళితులు, ఓబీసీలను బానిసలుగా ఉంచటమే వారి ప్రధాన ఎజెండా అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. మోదీని గద్దెదింపి తాను ప్రధాని అవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలలు కంటున్నారని ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు. దళితులు, ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పన అంశాన్ని సమీక్షించాలంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని లాలు ఈ సందర్భంగా ప్రశ్నించారు.