పప్పూ యాదవ్ పడిపోయారు!
పార్టీతో పనిలేదు.. క్యారెక్టర్ అంతకన్నా అవసరం లేదు.. చాంతాడంత కేసుల సంగతీ అక్కర్లేదు. కేవలం పాపులారిటీనే కొలమానంగా తీసుకుంటే ప్రముఖ నేతల జాబితాలో పప్పు యాదవ్ పేరు తప్పక ఉంటుంది.
లాలూ ప్రసాద్ యాదవ్ సమీప బంధువుగా, ఆర్జేడీ కీలక నేతగా చాలాకాలంపాటు బిహార్ లో 'రాజ్ నీతి' లో ఆరితేరిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ అత్యంత వివాదాస్పద నాయకుడని తెలిసిందే. లాలూకు దూరమైన తర్వాత సొంతగా జన్ అధికార్ పార్టీ (జేఏపీ)ని స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు.
సోమవారం సీతామర్తీ జిల్లాలోని పరిహార్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పప్పూ యాదవ్ వేదిక కూలి కిందపడిపోయారు. దీంతో ఆయన కాలికి స్వల్పగాయాలయ్యాయి. పలువురు నేతలు తీవ్రంగా గాయపడ్డారు.
'నారంగా గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రచార సభా వేదికపై జనం ఎక్కువ కావడంతో ఒక్కసారిగా కూలిపోయింది. పప్పూ యాదవ్ కాలికి గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న ఆయన.. పక్కగ్రామంలో మరో సభలో పాల్గొన్నారు' అని పప్పూ వ్యక్తిగత సహాయకుడు తెలిపారు.
ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ లతో కలిసి మూడో ఫ్రంట్ ను ఏర్పాటుచేసిన పప్పూయాదవ్.. మహాకూటమి, ఎన్డీఏలను ఎదుర్కొంటున్నారు. అయితే, సమాజ్ వాదీ పార్టీ.. బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తోందని పవార్ ధర్డ్ ఫ్రంట్ కు దూరమయ్యారు. సమాజ్ వాదీ పార్టీకి బిహార్ లో ఆదరణలేదు. దీంతో థర్డ్ ఫ్రంట్ కు.. ఫ్రెంటు, బ్యాకూ తానే అయి పోరాడుతున్నారు పప్పూ యాదవ్.