Jan Adhikar Party
-
హస్తం గూటికి ‘బిహార్ బాహుబలి’.. కాంగ్రెస్‌లో ఆ పార్టీ విలీనం
బిహార్‌కు చెందిన జేఏపీ నాయకుడు పప్పు యాదవ్ హస్తం గూటికి చేరారు. తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి న్యూఢిల్లీలో అధికారికంగా పార్టీలో చేరారు. తన కుమారుడు సార్థక్ రంజన్, ఇతర పార్టీ నాయకులతో కలిసి, యాదవ్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యాలయంలో ప్రకటన చేశారు. పప్పు యాదవ్ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌తో భేటీ అయిన తర్వాత విలీనంపై ఊహాగానాలు చెలరేగాయి. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా పప్పు యాదవ్ 2015లో జన్ అధికార్ పార్టీని స్థాపించారు. పప్పు యాదవ్‌ను బిహార్ బాహుబలిగా వ్యవహరిస్తారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఆశీస్సులతోనే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయశానని పప్పు యాదవ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన పప్పు యాదవ్ ఇప్పుడు దేశంలో రాహుల్ గాంధీని మించిన ప్రత్యామ్నాయం లేదన్నారు. లాలూ, కాంగ్రెస్‌తో కలిసి రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన జన్ అధికార్ పార్టీని ప్రారంభించడానికి ముందు, పప్పు యాదవ్ ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, లోక్ జనశక్తి పార్టీలో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆర్జేడీ నుంచి పప్పు యాదవ్ బహిష్కరణకు గురైన తర్వాత జన్ అధికార్ పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది. -
పప్పూ యాదవ్ పడిపోయారు!
పార్టీతో పనిలేదు.. క్యారెక్టర్ అంతకన్నా అవసరం లేదు.. చాంతాడంత కేసుల సంగతీ అక్కర్లేదు. కేవలం పాపులారిటీనే కొలమానంగా తీసుకుంటే ప్రముఖ నేతల జాబితాలో పప్పు యాదవ్ పేరు తప్పక ఉంటుంది. లాలూ ప్రసాద్ యాదవ్ సమీప బంధువుగా, ఆర్జేడీ కీలక నేతగా చాలాకాలంపాటు బిహార్ లో 'రాజ్ నీతి' లో ఆరితేరిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ అత్యంత వివాదాస్పద నాయకుడని తెలిసిందే. లాలూకు దూరమైన తర్వాత సొంతగా జన్ అధికార్ పార్టీ (జేఏపీ)ని స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు. సోమవారం సీతామర్తీ జిల్లాలోని పరిహార్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పప్పూ యాదవ్ వేదిక కూలి కిందపడిపోయారు. దీంతో ఆయన కాలికి స్వల్పగాయాలయ్యాయి. పలువురు నేతలు తీవ్రంగా గాయపడ్డారు. 'నారంగా గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రచార సభా వేదికపై జనం ఎక్కువ కావడంతో ఒక్కసారిగా కూలిపోయింది. పప్పూ యాదవ్ కాలికి గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న ఆయన.. పక్కగ్రామంలో మరో సభలో పాల్గొన్నారు' అని పప్పూ వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ లతో కలిసి మూడో ఫ్రంట్ ను ఏర్పాటుచేసిన పప్పూయాదవ్.. మహాకూటమి, ఎన్డీఏలను ఎదుర్కొంటున్నారు. అయితే, సమాజ్ వాదీ పార్టీ.. బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తోందని పవార్ ధర్డ్ ఫ్రంట్ కు దూరమయ్యారు. సమాజ్ వాదీ పార్టీకి బిహార్ లో ఆదరణలేదు. దీంతో థర్డ్ ఫ్రంట్ కు.. ఫ్రెంటు, బ్యాకూ తానే అయి పోరాడుతున్నారు పప్పూ యాదవ్.