గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేస్తున్న నితీశ్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్‌ని కలిశారు. తన మంత్రివర్గ రాజీనామాను సమర్పించి, అసెంబ్లీని రద్దుచేయాలని సిఫారసు చేశారు. దీంతో బిహార్‌లో నితీశ్ నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నితీశ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించి, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. అంతకుముందు సీఎం అధికార నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జేడీయూ, బీజేపీ, హెచ్‌ఏఎం, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీల నాయకులు భేటీ అయ్యారు.
కొత్త ఎన్నికైన ఎన్డీయే ఎమ్మెల్యేలంతా ఆదివారం మధ్యాహ్నం సమావేశమై నితీశ్‌ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. బిహార్‌లో జేడీయూ కన్నా బీజేపీ 31 స్థానాలు అధికంగా గెలుపొందినప్పటికీ, ప్రధాని, బీజేపీ అధిష్టానం నితీశ్ కుమార్‌నే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించడం విశేషం. ఉప ముఖ్యమంత్రిగా దళిత వర్గానికి చెందిన బీజేపీ నేత కామేశ్వర్ చౌపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనకు సంఘ్‌పరివార్‌తో అనుబంధం ఉంది. ఇలా ఉండగా, స్వతంత్ర ఎమ్మెల్యే చకాయ్ సుమిత్ సింగ్ ఎన్డీయేకి మద్దతు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment