పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదుగుతారనే వాదనల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్జేడీ నేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. విపక్షాలు పరిగణనలోకి తీసుకుంటే జేడీయూ నేత నితీశ్ కుమార్ తన సద్భావనతో బలమైన ప్రధాని అభ్యర్థిగా ఎదగగలరని పేర్కొన్నారు. బిహార్‌లో మహాకూటమి అధికారంలోకి రావటాన్ని జంగిల్ రాజ్యం తిరిగి వచ్చిందనే బీజేపీ వాదనలను తిప్పికొట్టారు తేజస్వీ యాదవ్. అలసిపోయి, నక్క ఏడుపులు ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేయటం ఐక్యతకు నిదర్శనమన్నారు.
‘చాలా ప్రతిపక్ష పార్టీలు దేశం ముందున్న పెద్ద సవాలును గుర్తించాయి. అది బీజెపీ ఆధిపత్యం. డబ్బు, మీడియా, ప్రభుత్వ ఏజెన్సీల బలంతో చలాయించే ఆధిపత్యాన్ని భారతీయ సమాజం, రాజకీయాల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నారు. వారు సహకార సమాఖ్య విధానంపై మాట్లాడుతున్నారు. ప్రాంతీయ అసమానతలను బీజేపీ విస్మరిస్తోంది. ఈ విషయంపై బీహార్ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ’ అని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా నితీశ్ సరైన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారా? అని అడగగా తనదైన శైలీలో సమాధానమిచ్చారు తేజస్వీ యాదవ్. ‘ఈ ప్రశ్నను గౌరవ నితీశ్ జీకే వదిలేస్తున్నాను. మొత్తం విపక్షాల తరఫున నేను మాట్లాడలేను. కానీ, వారు పరిగణనలోకి తీసుకుంటే నితీశ్ జీ కచ్చితంగా బలమైన అభ‍్యర్థి అవుతారు. ఆయనకు 37ఏళ్ల పార్లమెంటరీ, పరిపాలన అనుభవం ఉంది. క్షేత్రస్థాయిలో మంచి పేరు ఉంది.’ అని తెలిపారు.
ఇదీ చదవండి: ‘2014లో మాదిరిగా 2024లో గెలుస్తారా?’.. ప్రధాని మోదీకి నితీశ్ సవాల్!
Comments
Please login to add a commentAdd a comment