
'వారిద్దరినీ నిందించడం సరికాదు'
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను నిందించడం సరికాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను నిందించడం సరికాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాజపేయి, ఎల్ కే అద్వానీ హయాంలోనూ బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీ కుటుంబ పార్టీ కాదని, గెలుపోటములకు సమిష్టి బాధ్యత తీసుకోవాలని అన్నారు.
కాగా, బిహార్ లో పార్టీ ఓటమికి మోదీ, అమిత్ షాలదే బాధ్యతని సీనియర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీతో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సమావేశమయ్యారు. మోదీ-షా ద్వయానికి వ్యతిరేకంగా తమ గళాన్ని గట్టిగా వినిపించేందుకు సీనియర్లు సన్నద్ధమవుతున్నట్టు ఈ పరిణామాలను బట్టి తెలుస్తోంది.