
మా అబ్బాయి సీఎం అవుతాడని చెప్పలేదు
పట్నా: బిహార్ ప్రజలు కోరుకుంటే తన కొడుకు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించిన మాజీ సీఎం రబ్రీదేవి యూ టర్న్ తీసుకున్నారు. సీఎం పోస్టు ఖాళీగా లేదని, ముఖ్యమంత్రి పదవిలో నితీష్ కుమార్ పూర్తికాలం కొనసాగుతారని చెప్పారు.
బిహార్‌లో ప్రస్తుతం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం మేరకు జేడీయూ నేత నితీష్ సీఎం అయ్యారు. గురువారం రబ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ సీఎం కావాలని ఆర్జేడీ ఎమ్మెల్యేలు కోరుతున్నారని చెప్పారు. దీనిపై విమర్శలు వచ్చాయి. రబ్రీదేవి పొత్తు ధర్మాన్ని విస్మరించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె మాట మార్చారు.
గత ఫిబ్రవరిలో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కూడా తన కొడుకు తేజస్వి భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యలు చేసి తర్వాత మాట మార్చారు. బిహార్ తర్వాతి ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పుడే చెప్పడం తొందరపాటని, 2020లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. బిహార్ ముఖ్యమంత్రులుగా లాలు, ఆయన భార్య రబ్రీ దేవి పనిచేశారు. ప్రస్తుతం వీరి చిన్న కొడుకు తేజస్వి డిప్యూటీ సీఎంగా, మరో కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రిగా ఉన్నారు.