సీఎం వైఫల్యాలపై ప్రోగ్రెస్ కార్డు
సీఎం వైఫల్యాలపై ప్రోగ్రెస్ కార్డు
Published Sat, Nov 19 2016 6:57 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
నితీష్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఏడాది నిండటంతో.. ముఖ్యమంత్రి వైఫల్యాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టును ఎన్డీయే విడుదల చేసింది. రాష్ట్రంలో పాలన అన్ని రకాలుగా విఫలమైందని, ముఖ్యంగా శాంతిభద్రతలు మంటగలిశాయని చెప్పింది. 'ఏక్ సాల్.. బురా హాల్' అనే పేరుతో బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ ఈ ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేశారు. గడిచిన ఏడాది కాలంలో వీళ్లు చేసిన తప్పుల కారణంగానే వార్తల్లో నిలిచారని ఆయన మండిపడ్డారు. ఒకరోజు ముందుగానే తాము ఈ ప్రోగ్రెస్ కార్డును విడుదల చేస్తున్నామని, ఇది చూసి ముఖ్యమంత్రి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సుశీల్ మోదీ అన్నారు.
నితీష్ సర్కారులో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కూడా భాగస్వాములే. ఈ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆదివారంతో ఏడాది పూర్తవుతుంది. 2005 నవంబర్‌లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006 నుంచి ప్రతియేటా ఇలా ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడాన్ని ఆయనే మొదలుపెట్టారు. కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్, కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా, హిందూస్థాన్ ఆవామీ మోర్చా (ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళ్ పాండే తదితరులు కూడా ఈ ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. మహ్మద్ షహాబుద్దీన్, రాజ్ వల్లభ్ యాదవ్, రాకీ యాదవ్ తదితరులకు బెయిల్ మంజూరుచేయడంపై ప్రతిపక్షం గట్టిగా ప్రశ్నించి ఉండకపోతే నితీష్ సర్కారు వాటిపై సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండేది కాదని సుశీల్ మోదీ అన్నారు. 1.52 లక్షల కోట్ల వ్యవసాయ రోడ్ మ్యాప్ పేమైందని, మిషన్ మానవ్ వికాస్, మహాదళిత్ వికాస్ మిషన్, విజన్ డాక్యుమెంట్ 2025 అన్నీ ఎక్కడకు పోయాయని నిలదీశారు.
Advertisement