report card
-
పిల్లల మార్కులు నేరుగా తల్లిదండ్రులకే
సాక్షి, అమరావతి: విద్యార్థి ఒక్క రోజు బడికి రాకపోతే తల్లిదండ్రులకు మెసేజ్ (ఎస్ఎంఎస్లు)ల ద్వారా తెలియజేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. మరో వినూత్న ప్రక్రియను చేపట్టింది. విద్యార్థులు వివిధ పరీక్షల్లో సాధించిన మార్కులను, నెలలో ఎన్నిరోజులు బడికి వచ్చారో చెబుతూ ‘హోలిస్టిక్ రిపోర్టు కార్డు’ లను తల్లిదండ్రులకు పంపిస్తోంది. ఫార్మేటివ్ (యూనిట్), సమ్మేటివ్ (అర్ధ, వార్షిక) అసెస్‌మెంట్స్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను నేరుగా తల్లిదండ్రులకే చేరవేస్తోంది.గతంలో వార్షిక పరీక్షల ఫలితాలను మాత్రమే ప్రోగ్రెస్ కార్డుల్లో ఇవ్వగా, ఈ ఏడాది అందుకు భిన్నంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్లకు హోలిస్టిక్ రిపోర్టు కార్డులను ఎస్ఎంఎస్ రూపంలో పంపించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 9 తరగతుల పిల్లలకు ఈ నూతన విధానం ప్రవేశపెట్టింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఐటీ విభాగం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అన్ని మేనేజ్మెంట్స్లోని బడుల్లో 9వ తరగతి వరకు చదువుతున్న సుమారు 61.81 లక్షల మంది విద్యార్థుల మార్కులు, బడికి హాజరైన రోజుల సమాచారాన్ని తల్లిదండ్రులకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 55,71,173 మందికి (90.13 శాతం) ఎస్ఎంఎస్లు పంపారు. పిల్లల ప్రగతి తల్లితండ్రులకు తెలిసేలా.. గతంలో విద్యార్థులు వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులను ప్రోగ్రెస్ రిపోర్టుగా ఏప్రిల్/ మే నెలల్లో పంపించేవారు. అయితే 2023–24 విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్ఏ పరీక్షలు, రెండు ఎస్ఏ పరీక్షల్లో సాధించిన మార్కులు, ఎన్ని రోజులు బడికి హాజరయ్యారో కూడా వివరిస్తూ తల్లిదండ్రులకు హోలిస్టిక్ రిపోర్టు కార్డులను వారి ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తున్నారు. కార్డులను డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. దీనిద్వారా తమ పిల్లలు ఏ పరీక్షలో ఎన్ని మార్కులు సాధించారు, ఎన్ని రోజులు బడికి వెళ్లారో తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చాయో గుర్తించి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్లను అడిగేందుకు అవకాశముంటుంది. దీనిద్వారా తల్లిదండ్రుల్లో బాధ్యత పెరుగుతుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురే‹Ùకుమార్ ‘సాక్షి’కి తెలిపారు.100 శాతం పూర్తిచేసిన ప్రభుత్వ బడులు విద్యార్థుల మార్కులు, హాజరు వివరాలను పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్ వెబ్సైట్లో నమోదు చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి పాఠశాల (ప్రాథమిక, ఉన్నత) ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక లాగిన్ ఇచ్చారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత హాజరు, ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల్లో సాధించిన మార్కులను ఇందులో నమోదు చేయాలి. ఈ ప్రక్రియను ప్రభుత్వ పాఠశాలలు నూరు శాతం పూర్తి చేయగా, ప్రైవేటు పాఠశాలలు 89 శాతం మాత్రమే నమోదు చేశాయి. బడులు తెరిచేలోగా అన్ని స్కూళ్లూ ఈ వివరాలను నమోదు చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.డిజీ లాకర్లో 8, 9 తరగతుల మార్కులు ఇప్పటికే డిగ్రీ, ఇంటర్మీడియట్‌తో పాటు పదో తరగతి మార్కుల జాబితాలను ‘డిజీ లాకర్’లో నమోదు చేస్తుండగా.. 2023–24 విద్యా సంవత్సరంలో 8, 9 తరగతుల మార్కుల జాబితాలను సైతం డిజీ లాకర్లో అందుబాటులో ఉంచారు. బడులు తెరిచాక పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో డిజీ లాకర్‌పై అవగాహన కల్పించనున్నారు. -
ధైర్యముంటే రిపోర్టు కార్డు విడుదల చెయ్యండి.. అమిత్ షా
భోపాల్: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్‌లో దూకుడును పెంచింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన గరీబ్ కళ్యాణ్ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2003 నుండి 2023 వరకు పరిపాలనకు సంబంధించి రిపోర్టు కార్డును విడుదల చేశారు. ధైర్యముంటే కాంగ్రెస్ పార్టీ కూడా తమ 53 ఏళ్ల పరిపాలన తాలూకు ప్రగతి నివేదిక సమర్పించాలని సవాల్ విసిరారు. గరీబ్ కళ్యాణ్ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్, బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ సమక్షంలో 20 ఏళ్ల ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాటలాడుతూ మధ్యప్రదేశ్ ప్రజలు 2003లో కాంగ్రెస్ పార్టీని, వేర్పాటుదారుడు దిగ్విజయ్ సింగ్ ను సాగనంపి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. గడిచిన 20 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ధైర్యముంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఐదు దశాబ్దాల పరిపాలనలో మధ్య ప్రదేశ్ కు ఏమి చేసిందో నివేదిక విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. 1956లో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2003 వరకు ఐదారేళ్లు మినహాయిస్తే మిగతా సమయమంతా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని ఆ సమయంలో ఇక్కడ అభివృద్ధి కరువై BIMARU(ఆరోగ్యం నశించి)గా మారిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాభివవృద్ధికి కృషి చేసిందని.. మధ్యలో డిసెంబరు 2018 నుండి మార్చి 2002 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేసి అభివృద్ధిని కుంటుపడేలా చేసిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం అన్ని విభాగాల్లోనూ దూసుకుపోతోందని.. 45 శాతంతో గోధుమల ఎగుమతిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని.. ప్రభుత్వ ఆరోగ్య పథకానికి సంబంధించి ఆయుష్మాన్ కార్డులు జారీ చేయడంలోనూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్డులను మెరుగుపరచడంలోనూ దేశానికే తలమానికంగా నిలిచిందని అన్నారు. వ్యవసాయ రంగానికి మౌలిక నిధుల పథకం కింద రూ. 4300 కోట్ల నిధులు సమకూర్చి దేశంలో నెంబర్ వన్ స్థానంలోనూ.. స్వచ్ఛతలో ఇండోర్ ఎప్పటినుంచో మొదటి స్థానంలోనూ కొనసాగుతున్నాయని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేదలకు ఇల్లు కట్టించడంలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచిందని.. సుమారు 44 లక్షల పేద కుటుంబాలు ఈ పథకం కింద గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పక్కా ఇళ్లు సొంతం చేసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన సంక్షేమాభివృద్ధి గురించి వివరిస్తూ రాష్ట్రంలోని సుమారు 1.36 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని 2003లో రూ.12000 గా ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు రూ.1.4 లక్షలకు చేరిందని అన్నారు. ఒకప్పుడు విభజనలు పాలైన రాష్ట్రంగా పిలవబడిన మధ్య ప్రదేశ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు, రోడ్లు, మంచినీరు, విద్య విభాగాల్లో ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. చివరిగా ఆయన మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తూ 2014లో 29 ఎంపీ సీట్లకు గాను 27 సీట్లలో బీజేపీ పార్టీని గెలిపించగా 2019లో 28 సీట్లలోనూ గెలిపించారని.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మిగిలిన ఆ ఒక్క సీట్లో కూడా ప్రజలు గెలిపిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు మొండిచేయి -
మోదీ 2.0 : యాభై రోజుల పాలన ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో తిరిగి రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం మోదీ సర్కార్ తొలి 50 రోజుల్లో సుపరిపాలనను పరుగులు పెట్టించేలా పునాదులు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సోమవారం మీడియా ప్రతినిధుల ఎదుట ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరిస్తూ రిపోర్ట్ కార్డ్‌ను సమర్పించారు. సబ్కా సాథ్..సబ్కా వికాస్..సబ్కా విశ్వాస్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమం..సమన్యాయం అందేలా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులను ముమ్మరం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ 100 లక్షల కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా మలిచేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను ఈ 50 రోజుల్లో రూపొందించామని అన్నారు. 50 రోజుల పాలనలో ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతం కోసం వాటికి మూలధనం కింద రూ 70,000 కోట్లు కేటాయించడం ప్రభుత్వ విజయంగా చెప్పుకొచ్చారు. జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదుల ప్రభావాన్ని తగ్గించగలిగామని తెలిపారు. బిమ్స్టెక్, జీ-20 సదస్సుల ద్వారా భారత్ గ్లోబల్ లీడర్‌గా అవతరించిందని అన్నారు. అధికార యంత్రాగంలో అవినీతిపై, ఆర్థిక నేరగాళ్లపై చర్యలు, పోక్సో చట్టానికి సవరణలు వంటి పలు విజయాలు సాధించామని మంత్రి చెప్పారు. -
విజిటింగ్ కార్డుల్లా చూడొద్దు
న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలలను పిల్లలపై రుద్దవద్దని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించే రీతిలో తల్లిదండ్రులు వ్యవహరించాలన్నారు. పిల్లల రిపోర్టు కార్డులను తమ విజిటింగ్ కార్డుల్లా పరిగణించవద్దని పేర్కొన్నారు. ‘పరీక్షా పే చర్చ’లో భాగంగా మంగళవారం ఢిల్లీలోని థాల్కాటోరా స్టేడియంలో దేశవ్యాప్తంగా ఎంపికైన దాదాపు 2 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. పరీక్షల గురించి ఒత్తిడికి గురికావద్దని, పరీక్షలే జీవితం కాదని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు ముఖ్యమైనవే.. కానీ ఇవి జీవితానికి సంబంధించినవా? లేక 10వ తరగతికో, 12వ తరగతికో పరిమితమైనవా? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలన్నారు. దీనికి సమాధానం వస్తే ఒత్తిడిని అధిగమించగలిగినట్లే అని పేర్కొన్నారు. చిన్నారులను పోత్సహించి, ప్రేరణనిచ్చే శక్తి తల్లిదండ్రులకు మాత్రమే ఉందని మోదీ స్పష్టం చేశారు. ఏ విషయంలోనూ చిన్నారులను ఇతరులతో పోల్చవద్దని దీనివల్ల వారి ఆత్యస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రధాని హెచ్చరించారు. పిల్లలు సాధించిన చిన్న చిన్న విజయాలను కూడా తల్లిదండ్రులు అభినందిస్తూ ఉంటే వారు మరింత మెరుగ్గా రాణించగలరని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ ర్యాంకులకు మాత్రమే పరిమితమైందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా దీనికి తగ్గట్టే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిన్నారులకు తగినంత స్వేచ్ఛ ఇవ్వాలని.. ర్యాంకుల కోసం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న విషయాలను చూసి నేర్చుకునేలా వారిని ప్రోత్సహించాలని మోదీ సూచించారు. నేర్చుకోవడాన్ని పరీక్షల వరకే పరిమితం చేయవద్దని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే రీతిలో చిన్నారులను సన్నద్ధం చేయా లని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, దానిని అధిగమించే దిశగా కృషిచేయాలని విద్యార్థులకు సూచించారు. దేశమే నా కుటుంబం.. మీరు రోజులో 17 గంటలు ఎలా పనిచేయగలుగుతున్నారని ఓ విద్యార్థి ప్రధానిని ప్రశ్నించగా.. ‘ఓ తల్లి తన కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. అయినా అలసిపోదు. అలాగే నేను దేశాన్ని నా కుటుంబంగా భావిస్తాను. వారి కోసం ఎంతవరకైనా శ్రమిస్తూనే ఉంటాను’ అని మోదీ బదులిచ్చారు. మాకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునేలా తల్లిదండ్రులను ఎలా ఒప్పించాలని ఓ విద్యార్థి ప్రశ్నించగా.. ‘మీ ప్యాషన్ గురించి వారికి చెప్పండి. అది సాధించడానికి మీ వద్ద ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించండి. అవసరమైతే మీ టీచర్ల సాయం తీసుకోండి. వారి సాయం తో మీ తల్లిదండ్రులను ఒప్పించండి’ అని మోదీ సలహా ఇచ్చారు. -
ప్రజా సమస్యలకు ‘ఎఫ్’ గ్రేడ్
న్యూఢిల్లీ: గత నాలుగేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గ్రేడ్లు కేటాయించారు. ఎన్డీఏ పాలనను ట్విట్టలో ఆయన ఎగతాళి చేస్తూ అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యవసాయం, విదేశాంగ విధానం, ఉద్యోగ కల్పనలో ‘ఎఫ్ ’ గ్రేడ్, నినాదాల రూపకల్పన, సొంత ప్రచారంలో రాహుల్ ‘ఏ+’ గ్రేడ్ ఇచ్చారు. ‘ఇది ఎన్డీఏ సర్కారు నాలుగేళ్ల రిపోర్టు కార్డు. వ్యవసాయం ‘ఎఫ్’, విదేశాంగ విధానం ‘ఎఫ్’, పెట్రో ధరలు ‘ఎఫ్’, ఉద్యోగ కల్పన ‘ఎఫ్’, నినాదాల రూపకల్పన ‘ఏ+’, సొంత ప్రచారం ‘ఎ+’, యోగా ‘బీ–’ అని గ్రేడ్లు ఇచ్చారు. అనర్గళంగా మాట్లాడటంలో దిట్ట, వ్యక్తిత్వ సమస్యలతో బాధపడే వ్యక్తి, ఏకాగ్రత లేని మనస్తత్వం అని మోదీ అంటూ రిమార్క్స్ ఇచ్చారు. మోదీ–షా ద్వయం ప్రమాదకరం మోదీ– అమిత్ షా ద్వయం దేశానికి ప్రమాదకరమని ప్రజలు గ్రహించారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ‘భారత్ మోసపోయింది’ పేరిట బుక్‌లెట్‌ను విడుదల చేస్తూ.. ఈ నాలుగేళ్లు నమ్మకద్రోహం, మోసం, ప్రతీకారం, అసత్యాలతో కూడిన పాలన కొనసాగిందని అందులో పేర్కొంది. ఇంగ్లిష్, హిందీలో విడుదల చేసిన ఈ పుస్తకంలో ప్రధాని మోదీకి 40 ప్రశ్నల్ని సంధించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల పేరిట లఘు చిత్రాన్ని కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, సూర్జేవాలాలు శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్డీఏ హాయంలో దేశంలో భయం, విద్వేషపూరిత వాతావరణం సృష్టించారని ఆరోపించారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్ పేర్కొన్నారు. సాధించిందేమీ లేదు: వామపక్షాలు న్యూఢిల్లీ: అపజయాలు, అబద్ధాలు, ఒట్టి ప్రచారాలు తప్ప నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించినవి మరేమీ లేవని వామపక్షాలు విమర్శించాయి. దేశ సామాజిక వ్యవస్థలు, ప్రజల జీవనాధారాలపై గతంలో ఎన్నడూ లేనంతగా ఈ నాలుగేళ్లలో దాడులు జరిగాయనీ, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజలకు రక్షణ ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వెళ్తోందనీ, ప్రజలు భయంతో, అభద్రతా భావంతో జీవిస్తుండగా వారి రాజ్యాంగ బద్ధమైన, ప్రజాస్వామ్య హక్కులు ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థలను మోదీ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. -
నాలుగేళ్ల పాలనపై బీజేపీ ప్రచారం
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ అధిష్టానం 15 రోజుల కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వివిధ రంగాలకు చెందిన లక్షమంది ప్రముఖులను కలిసి మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలకు పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వం వహిస్తారని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులతోపాటు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, పార్టీ ఆఫీసు బేరర్లు పాల్గొంటారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులు, మేథావులతో సదస్సులు, గ్రామసభలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. -
రానున్న బడ్జెట్‌పై ప్రధాని మోదీ సంకేతాలు
న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలేమీ ఉండకపోవచ్చని ప్రధాని మోదీ సంకేతాలిచ్చారు. ప్రజలు ఉచితాలను కోరుకుంటారన్నది ఒక భ్రమ అని, వారు నిజాయితీతో కూడిన పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అన్నదాతను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలున్న వేళ.. గత మూడున్నరేళ్ల తన పాలనపై రిపోర్ట్ కార్డును, భవిష్యత్ పాలన ప్రాథమ్యాలను ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. జీఎస్టీ, ఉద్యోగ కల్పన, కాంగ్రెస్ ముక్త భారత్, నోట్ల రద్దు, న్యాయవ్యవస్థ, వ్యవసాయ సంక్షోభం, విదేశాంగ విధానం.. తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. ‘ఆంగ్ల న్యూస్ చానెల్ ‘టైమ్స్ నౌ’ మోదీ ఇంటర్వ్యూను ఆదివారం ప్రసారం చేసింది. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక అం శాలపై ప్రధాని స్పందించారు. ఇంటర్వ్యూ సారాంశం ప్రధాని మాటల్లోనే.. జీఎస్టీ... జీఎస్టీ.. పన్నుల సంస్కరణలో ఓ కీలక ముందడుగు. దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ ఉండాలన్న ఈ విధానంలోని లోపాలను సరిదిద్దే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉ న్నాం. ఈ చట్టాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తాం. దీర్ఘకాలంలో జీఎస్టీ వల్ల దేశ ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కొత్త మార్పు వస్తున్నప్పుడు ఆర్నెల్లు, ఏడాది, రెండేళ్లు సమయం పడుతుండవచ్చు. కానీ అన్నీ అడ్డంకులూ తొలగిపోతాయి. ఇందుకు అందరూ కలిసి పనిచేయాలి. స్వార్థ రాజకీయాలు చేయటం మంచిది కాదు. జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాలకూ ప్రాతినిధ్యముంది. కౌన్సిల్ భేటీలో సానుకూలంగా మాట్లాడి.. బయటికొచ్చాక విమర్శలు చేస్తున్నారు. పార్లమెంటులోనూ అంతే.. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. దీనిపై మేమేమీ మాట్లాడబోం. నోట్ల రద్దు కూడా ఒక విజయగాధ. ఉద్యోగకల్పన.. ఉపాధి గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. దేశంలో ఓ స్వతంత్ర సంస్థ జరిపిన విచారణలో.. ఏడాదిలో 18–25 ఏళ్ల లోపున్న యువకులతో 70 లక్షల కొత్త ఈపీఎఫ్ అకౌంట్లు వచ్చినట్లు తేలింది. ఇది ఉపాధి కల్పన కాదా? రోడ్లు, రైలుపట్టాల నిర్మాణంలోనూ ఉపాధి పెరిగింది. ముద్ర పథకం ద్వారా 10 కోట్ల మందికి రూ.4లక్షల కోట్ల రుణాలిచ్చాం. ట్రిపుల్ తలాక్.. ఏ రాజకీయ పార్టీయైనా దేశం కన్నా గొప్పది కాదు. అన్నింటికన్నా ముందు దేశమే. అలాంటి దేశంలో బాధిత వర్గానికి మేలు చేసే చట్టం వస్తున్నప్పడు దీన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవటం బాధాకరమే. రాజీవ్ గాంధీ చేసిన పొరపాటు (1985లో షాబానో కేసులో)ను కాంగ్రెస్ మళ్లీ మళ్లీ చేస్తోంది. ట్రిపుల్ తలాక్ బాధితుల కథనాలు బాధాకరం. అలాంటి బాధితులకు సరైన గౌరవం కల్పించటం మా బాధ్యత. కాంగ్రెస్ దీన్ని రాజకీయం చేద్దామనుకుంటోంది. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు. బాధితురాలి ఆక్రందనను అర్థం చేసుకోవాల్సిన సమయమిది. సుప్రీం సంక్షోభం.. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్ న్యాయమూర్తుల మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా వారి అంతర్గత విషయం. ఈ వివాదానికి రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలి. మన దేశ న్యాయవ్యవస్థ చాలా గొప్పది. దీనిలో భాగస్వాములైన వారంతా చాలా గొప్పవారు, సమర్థులు. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకముంది. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. జమిలీ ఎన్నికలు జరపాలని మేం కోరుకుంటున్నాం. అయితే ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలి. బడ్జెట్‌కు ఓ తేదీ ఉన్నట్లే.. ఎన్నికలకూ ఐదేళ్లకోసారి ఓ తేదీని ఫిక్స్చేయాలి. దీని ద్వారా ఖర్చులు తగ్గుతాయి. చాలా మేలు జరుగుతుంది. రానున్న బడ్జెట్.. మొదటినుంచీ పాపులిజం (ప్రజాకర్షక విధానాలు)కు వ్యతిరేకం. బడ్జెట్ విషయంలో ఆర్థిక మంత్రి, దీనికో బృందం పనిచేస్తుంది. ఇందులో నేను జోక్యం చేసుకోను. సామాన్యప్రజలు ఏవీ ఉచితంగా కోరుకోరు. వారలా కోరుకుంటారనుకోవడం భ్రమ. ప్రజలు నిజాయితీతో కూడిన పాలనను కోరుకుంటారు. వ్యవసాయ సంక్షోభం.. అన్నదాతను ఆదుకోవటం మనందరి బాధ్యత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా మరింత కృషిచేయాల్సిన అసవరముంది. మా ప్రభుత్వం తీసుకొస్తున్న పలు పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌పై దృష్టిపెట్టాం. రైతు ఉత్పత్తులకు వాల్యూ అడిషన్ చేస్తాం. ఎన్నికల వేళ భవిష్యత్ లక్ష్యాలు.. ఎన్నికలు ఎన్నటికీ నా లక్ష్యం కాదు. ఎన్నికల కోసం నా టైంటేబుల్‌ను మార్చుకోను. దేశ ప్రజలకు సేవ చేయటం, ఇందుకోసం ముందుగా నిర్ణయించుకున్న పనులు పూర్తి చేయటమే నా లక్ష్యం. సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన మాత్రం అనుకున్నంత స్థాయిలో జరగలేదు. కాంగ్రెస్ ముక్త భారత్ కాంగ్రెస్ ముక్త భారత్ అంటే రాజకీయంగా ఆ పార్టీని అంతం చేయడం కాదు. అవినీతి, కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, ప్రజలను మోసం చేయటం వంటి లక్షణాలున్న కాంగ్రెస్ సంస్కృతిని అంతం చేయడం ఆ నినాదం ఉద్దేశం. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ సంస్కృతి వేరు. ఆ తర్వాతే వారి ఆలోచనా ధోరణి, సంస్కృతిలో చాలా మార్పు వచ్చింది. కాస్త అటుఇటుగా అన్ని పార్టీలకూ ఈ ఆలోచన అలవడింది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నానంటే.. అది ఒకపార్టీని ఉద్దేశించినట్లు కాదు. ఆ పార్టీ ఆలోచనలతో నిండిన సంస్కృతిని విమర్శించినట్లు. పాకిస్తాన్‌తో మన తీరు ప్రపంచ నేతలతో బలమైన సంబంధాలను ఏర్పర్చుకుంటున్నది.. పాకిస్తాన్‌ను ఏకాకిచేయటానికి కాదు. అసలు మాకు ఆ ఉద్దేశమే లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేస్తున్నాం. మానవాళికి ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదంపై పోరాటానికి మానవతావాద శక్తులను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. నా దేశం 40 ఏళ్లుగా ఉగ్రవాద బాధిత దేశంగా ఉంది. ఇప్పుడు ప్రపంచానికి ఉగ్ర సెగ తగిలింది. అందుకే కలిసొచ్చే శక్తులను కలుపుకుని ముందుకెళ్తున్నాం. ఇకనైనా భారత్–పాక్‌లు కలిసి పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలపై పోరాటం చేయాలి. కలిసి పోరాడితే మరింత త్వరగా విజయం సాధిస్తామని పాక్ ప్రజలకు చెబుతున్నా. -
ఎంపీలు.. మీ ప్రోగ్రెస్ చెప్పండి?!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పుడే 2019 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గాల్లో సాధించిన ప్రగతిని వివరించాలంటూ ప్రధాని మోదీ పార్టీలకు సూచించారు. ప్రజలకు అందించిన మౌలిక సదుపాయాల కల్పన, కీలకమైన విజయాలు, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చేసిన కృషిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆయన ఎంపీలకు తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులపై ప్రజలనుంచి అభిప్రాయాలను సేకరించాలని సహచర మంత్రులకు మోదీ సూచించారు. ఇదిలావుండగా.. ఇప్పటికే 250 మంది బీజేపీ ఎంపీల నమో యాప్‌ను తమ స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్నట్లు తెలిసింది. -
సీఎం వైఫల్యాలపై ప్రోగ్రెస్ కార్డు
నితీష్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఏడాది నిండటంతో.. ముఖ్యమంత్రి వైఫల్యాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టును ఎన్డీయే విడుదల చేసింది. రాష్ట్రంలో పాలన అన్ని రకాలుగా విఫలమైందని, ముఖ్యంగా శాంతిభద్రతలు మంటగలిశాయని చెప్పింది. 'ఏక్ సాల్.. బురా హాల్' అనే పేరుతో బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ ఈ ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేశారు. గడిచిన ఏడాది కాలంలో వీళ్లు చేసిన తప్పుల కారణంగానే వార్తల్లో నిలిచారని ఆయన మండిపడ్డారు. ఒకరోజు ముందుగానే తాము ఈ ప్రోగ్రెస్ కార్డును విడుదల చేస్తున్నామని, ఇది చూసి ముఖ్యమంత్రి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సుశీల్ మోదీ అన్నారు. నితీష్ సర్కారులో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కూడా భాగస్వాములే. ఈ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆదివారంతో ఏడాది పూర్తవుతుంది. 2005 నవంబర్‌లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006 నుంచి ప్రతియేటా ఇలా ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడాన్ని ఆయనే మొదలుపెట్టారు. కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్, కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా, హిందూస్థాన్ ఆవామీ మోర్చా (ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళ్ పాండే తదితరులు కూడా ఈ ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. మహ్మద్ షహాబుద్దీన్, రాజ్ వల్లభ్ యాదవ్, రాకీ యాదవ్ తదితరులకు బెయిల్ మంజూరుచేయడంపై ప్రతిపక్షం గట్టిగా ప్రశ్నించి ఉండకపోతే నితీష్ సర్కారు వాటిపై సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండేది కాదని సుశీల్ మోదీ అన్నారు. 1.52 లక్షల కోట్ల వ్యవసాయ రోడ్ మ్యాప్ పేమైందని, మిషన్ మానవ్ వికాస్, మహాదళిత్ వికాస్ మిషన్, విజన్ డాక్యుమెంట్ 2025 అన్నీ ఎక్కడకు పోయాయని నిలదీశారు.