న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలేమీ ఉండకపోవచ్చని ప్రధాని మోదీ సంకేతాలిచ్చారు. ప్రజలు ఉచితాలను కోరుకుంటారన్నది ఒక భ్రమ అని, వారు నిజాయితీతో కూడిన పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అన్నదాతను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలున్న వేళ.. గత మూడున్నరేళ్ల తన పాలనపై రిపోర్ట్ కార్డును, భవిష్యత్ పాలన ప్రాథమ్యాలను ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. జీఎస్టీ, ఉద్యోగ కల్పన, కాంగ్రెస్ ముక్త భారత్, నోట్ల రద్దు, న్యాయవ్యవస్థ, వ్యవసాయ సంక్షోభం, విదేశాంగ విధానం.. తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. ‘ఆంగ్ల న్యూస్ చానెల్ ‘టైమ్స్ నౌ’ మోదీ ఇంటర్వ్యూను ఆదివారం ప్రసారం చేసింది. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక అం శాలపై ప్రధాని స్పందించారు. ఇంటర్వ్యూ సారాంశం ప్రధాని మాటల్లోనే..
జీఎస్టీ...
జీఎస్టీ.. పన్నుల సంస్కరణలో ఓ కీలక ముందడుగు. దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ ఉండాలన్న ఈ విధానంలోని లోపాలను సరిదిద్దే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉ న్నాం. ఈ చట్టాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తాం. దీర్ఘకాలంలో జీఎస్టీ వల్ల దేశ ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కొత్త మార్పు వస్తున్నప్పుడు ఆర్నెల్లు, ఏడాది, రెండేళ్లు సమయం పడుతుండవచ్చు. కానీ అన్నీ అడ్డంకులూ తొలగిపోతాయి. ఇందుకు అందరూ కలిసి పనిచేయాలి. స్వార్థ రాజకీయాలు చేయటం మంచిది కాదు. జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలకూ ప్రాతినిధ్యముంది. కౌన్సిల్ భేటీలో సానుకూలంగా మాట్లాడి.. బయటికొచ్చాక విమర్శలు చేస్తున్నారు. పార్లమెంటులోనూ అంతే.. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. దీనిపై మేమేమీ మాట్లాడబోం. నోట్ల రద్దు కూడా ఒక విజయగాధ.
ఉద్యోగకల్పన..
ఉపాధి గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. దేశంలో ఓ స్వతంత్ర సంస్థ జరిపిన విచారణలో.. ఏడాదిలో 18–25 ఏళ్ల లోపున్న యువకులతో 70 లక్షల కొత్త ఈపీఎఫ్ అకౌంట్లు వచ్చినట్లు తేలింది. ఇది ఉపాధి కల్పన కాదా? రోడ్లు, రైలుపట్టాల నిర్మాణంలోనూ ఉపాధి పెరిగింది. ముద్ర పథకం ద్వారా 10 కోట్ల మందికి రూ.4లక్షల కోట్ల రుణాలిచ్చాం.
ట్రిపుల్ తలాక్..
ఏ రాజకీయ పార్టీయైనా దేశం కన్నా గొప్పది కాదు. అన్నింటికన్నా ముందు దేశమే. అలాంటి దేశంలో బాధిత వర్గానికి మేలు చేసే చట్టం వస్తున్నప్పడు దీన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవటం బాధాకరమే. రాజీవ్ గాంధీ చేసిన పొరపాటు (1985లో షాబానో కేసులో)ను కాంగ్రెస్ మళ్లీ మళ్లీ చేస్తోంది. ట్రిపుల్ తలాక్ బాధితుల కథనాలు బాధాకరం. అలాంటి బాధితులకు సరైన గౌరవం కల్పించటం మా బాధ్యత. కాంగ్రెస్ దీన్ని రాజకీయం చేద్దామనుకుంటోంది. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు. బాధితురాలి ఆక్రందనను అర్థం చేసుకోవాల్సిన సమయమిది.
సుప్రీం సంక్షోభం..
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్ న్యాయమూర్తుల మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా వారి అంతర్గత విషయం. ఈ వివాదానికి రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలి. మన దేశ న్యాయవ్యవస్థ చాలా గొప్పది. దీనిలో భాగస్వాములైన వారంతా చాలా గొప్పవారు, సమర్థులు. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకముంది. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. జమిలీ ఎన్నికలు జరపాలని మేం కోరుకుంటున్నాం. అయితే ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలి. బడ్జెట్‌కు ఓ తేదీ ఉన్నట్లే.. ఎన్నికలకూ ఐదేళ్లకోసారి ఓ తేదీని ఫిక్స్‌చేయాలి. దీని ద్వారా ఖర్చులు తగ్గుతాయి. చాలా మేలు జరుగుతుంది.
రానున్న బడ్జెట్..
మొదటినుంచీ పాపులిజం (ప్రజాకర్షక విధానాలు)కు వ్యతిరేకం. బడ్జెట్ విషయంలో ఆర్థిక మంత్రి, దీనికో బృందం పనిచేస్తుంది. ఇందులో నేను జోక్యం చేసుకోను. సామాన్యప్రజలు ఏవీ ఉచితంగా కోరుకోరు. వారలా కోరుకుంటారనుకోవడం భ్రమ. ప్రజలు నిజాయితీతో కూడిన పాలనను కోరుకుంటారు.
వ్యవసాయ సంక్షోభం..
అన్నదాతను ఆదుకోవటం మనందరి బాధ్యత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా మరింత కృషిచేయాల్సిన అసవరముంది. మా ప్రభుత్వం తీసుకొస్తున్న పలు పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌పై దృష్టిపెట్టాం. రైతు ఉత్పత్తులకు వాల్యూ అడిషన్ చేస్తాం.
ఎన్నికల వేళ భవిష్యత్ లక్ష్యాలు..
ఎన్నికలు ఎన్నటికీ నా లక్ష్యం కాదు. ఎన్నికల కోసం నా టైంటేబుల్‌ను మార్చుకోను. దేశ ప్రజలకు సేవ చేయటం, ఇందుకోసం ముందుగా నిర్ణయించుకున్న పనులు పూర్తి చేయటమే నా లక్ష్యం. సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన మాత్రం అనుకున్నంత స్థాయిలో జరగలేదు.
కాంగ్రెస్ ముక్త భారత్
కాంగ్రెస్ ముక్త భారత్ అంటే రాజకీయంగా ఆ పార్టీని అంతం చేయడం కాదు. అవినీతి, కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, ప్రజలను మోసం చేయటం వంటి లక్షణాలున్న కాంగ్రెస్ సంస్కృతిని అంతం చేయడం ఆ నినాదం ఉద్దేశం. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ సంస్కృతి వేరు. ఆ తర్వాతే వారి ఆలోచనా ధోరణి, సంస్కృతిలో చాలా మార్పు వచ్చింది. కాస్త అటుఇటుగా అన్ని పార్టీలకూ ఈ ఆలోచన అలవడింది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నానంటే.. అది ఒకపార్టీని ఉద్దేశించినట్లు కాదు. ఆ పార్టీ ఆలోచనలతో నిండిన సంస్కృతిని విమర్శించినట్లు.
పాకిస్తాన్‌తో మన తీరు
ప్రపంచ నేతలతో బలమైన సంబంధాలను ఏర్పర్చుకుంటున్నది.. పాకిస్తాన్‌ను ఏకాకిచేయటానికి కాదు. అసలు మాకు ఆ ఉద్దేశమే లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేస్తున్నాం. మానవాళికి ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదంపై పోరాటానికి మానవతావాద శక్తులను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. నా దేశం 40 ఏళ్లుగా ఉగ్రవాద బాధిత దేశంగా ఉంది. ఇప్పుడు ప్రపంచానికి ఉగ్ర సెగ తగిలింది. అందుకే కలిసొచ్చే శక్తులను కలుపుకుని ముందుకెళ్తున్నాం. ఇకనైనా భారత్–పాక్‌లు కలిసి పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలపై పోరాటం చేయాలి. కలిసి పోరాడితే మరింత త్వరగా విజయం సాధిస్తామని పాక్ ప్రజలకు చెబుతున్నా.
ప్రజాకర్షక బడ్జెట్ కాదు..!
Published Mon, Jan 22 2018 2:26 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment