
ఆహారభద్రతకు మరింత ఊపు
7 పథకాలకు కేంద్రం ఆమోదం
రూ.14,000 కోట్ల వ్యయం
రూ.2,817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి ఊతమివ్వడంతో పాటు ఆహార భద్రతను మరింత పెంచే లక్ష్యంతో రూ.14 వేల కోట్లతో ఏడు నూతన సాగు పథకాలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సోమవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచడమే వీటి లక్ష్యమని కేంద్ర ఐటీ, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. తాజా పథకాలు సాగులో మరిన్ని పరిశోధనలతో పాటు సహజ వనరుల నిర్వహణ, వ్యవసాయ రంగంలో డిజిటైజేషన్ తదితరాలకు మరింత దోహదపడతాయని తెలిపారు.
ఆ ఏడు పథకాలివే...
1. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (రూ.2,817 కోట్లు). 2. ఆహార, పౌష్టిక భద్రత (రూ.3,979 కోట్లు). 3. వ్యవసాయ విద్య, నిర్వహణ (రూ.2,291 కోట్లు). 4. ఉద్యాన ప్రణాళిక (రూ.860 కోట్లు). 5. పశు ఆరోగ్య నిర్వహణ, ఉత్పాదకత (రూ.1,702 కోట్లు). 6. కృషీ విజ్ఞాన కేంద్రాల బలోపేతం (రూ.1,202 కోట్లు). 7. సహజ వనరుల నిర్వహణ (రూ.1,115 కోట్లు).
ప్రతి రైతుకూ డిజిటల్ ఐడీ!
వ్యవసాయ రంగంలో డిజిటల్ ఇన్నొవేషన్లకు మరింత మద్దతిచ్చేందుకు ఉద్దేశించిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌కు రూ.2,817 కోట్లను కేటాయించారు. దీనికి మొత్తమ్మీద రూ.20,817 కోట్లు కేటాయించాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా డిజిటల్ మౌలిక సదుపాయాల (డీపీఐ) మెరుగుదల, డిజిటల్ విధానంలో సాధారణ సాగు అంచనాల సర్వే (డీజీసీఈఎస్) అమలుతో వంటి ఐటీ ఆధారిత చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడతాయి.
దీని కింద అగ్రిస్టాక్, కృషీ డెసిషన్ సపోర్ట్ సిస్టం, సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ పేరిట మూడు డీపీఐలను రూపొందించనున్నారు. ‘‘వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్నిరకాల సమాచారాన్నీ విశ్వసనీయమైన రీతిలో నిరంతరం రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఇవి తోడ్పడతాయి. వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవమే దీని లక్ష్యం’’ అని కేంద్రం వెల్లడించింది. ‘అగ్రిస్టాక్‌లో భాగంగా ప్రతి రైతుకూ ఆధార్ మాదిరిగా ఒక డిజిటల్ ఐడీ కేటాయిస్తారు.
దీన్ని రైతు గుర్తింపు (కిసాన్ కీ పెహచాన్)గా పేర్కొంటారు. అందులోకి లాగిన్ అయిన మీదట సాగుకు సంబంధించిన సమస్త సమాచారమూ అందుబాటులో ఉంటుంది. రాష్ట్ర భూ రికార్డులు, పంట సాగుతో పాటు పథకాలు, భూములు, కుటుంబం తదితర వివరాలన్నింటినీ చూడవచ్చు. ప్రతి సీజన్‌లోనూ రైతులు సాగు చేసిన పంటల వివరాలను మొబైల్ ఆధారిత భూసర్వేల ద్వారా ఇందులో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. అంటే ఇది డిజిటల్ పంట సర్వే లాంటిది’’ అని వివరించింది. దీనికోసం ఇప్పటిదాకా కేంద్ర వ్యవసాయ శాఖతో 19 రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది.
రూ.26 వేల కోట్లతో వాయుసేనకు 240 ఏరో ఇంజన్లు
వైమానిక దళానికి సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాల కోసం రూ.26 వేల కోట్లతో హెచ్‌ఏఎల్ నుంచి 240 ఏరో ఇంజన్లు సమకూర్చుకునేందుకు కూడా భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది మొదలై ఎనిమిదేళ్లలో హెచ్‌ఏఎల్ వీటిని పూర్తిస్థాయిలో అందజేస్తుందని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.
కేంద్ర కేబినెట్ ఇతర నిర్ణయాలు:
→ గుజరాత్‌లోని సనంద్‌లో రోజుకు 63 లక్షల చిప్స్ తయారీ సామర్థ్యంతో కూడిన సెమీకండక్టర్ల యూనిట్ ఏర్పాటుకు కైన్స్ సెమీకాన్ చేసిన ప్రతిపాదనకు ఆమోదం. దీని అంచనా వ్యయం రూ.3,307 కోట్లు.
→ 309 కిలోమీటర్ల ముంబై–ఇండోర్ నూతన రైల్వే లైన్‌కు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
→ స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థ లక్ష్యసాధనకు 14 సభ్య దేశాలతో కూడిన ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పరిటీ (ఐపీఈఎఫ్) భేటీలో చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment