రూ.లక్ష కోట్లకుపైగా నిధులతో పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజన
రూ.10,103 కోట్లతో ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ సీడ్స్’
మరో 5 భాషలకు ప్రాచీన హోదా
11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత అనుసంధానిత బోనస్
ఆమోద ముద్ర వేసిన కేంద్ర మంత్రివర్గం
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను రెండు పథకాలు... పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజనగా హేతుబద్దీకరించాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రతకు మరింత ప్రోత్సాహం ఇవ్వడమే లక్ష్యంగా ఈ రెండు భారీ పథకాలకు ఆమోద ముద్ర వేసింది. రూ.లక్ష కోట్లకుపైగా నిధులతో పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(పీఎం–ఆర్‌కేవీవై), కృషోన్నతి యోజన(కేవై)ను అమలు చేసేందుకు అంగీకారం తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుస్థిర వ్యవసాయానికి ఊతం ఇవ్వడానికి, పీఎం–ఆర్‌కేవైవీ, ఆహార భద్రతలో స్వయం సమృద్ధి కోసం కృషోన్నతి యోజనను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ రెండు పథకాల మొత్తం వ్యయం రూ.1,01,321 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.69,088 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.32,232 కోట్లు. పీఎం–ఆర్‌కేవీవైకి రూ.57,074 కోట్లు, కృషోన్నతి యోజనకు రూ.44,246 కోట్లు ఖర్చు చేస్తారు. దాదాపు 18 పథకాలను ఈ రెండు పథకాలుగా హేతుబద్దీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వీటిని అమలు చేస్తారు.
» వంట నూనెల ఉత్పత్తిని భారీగా పెంచి, స్వయం సమద్ధి సాధించడానికి ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ సీడ్స్’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. రూ.10,103 కోట్లతో 2024–25 నుంచి 2030–31 వరకు ఈ కార్యక్రమం అమలు చేస్తారు. 2030–31 నాటికి దేశంలో నూనె గింజల ఉత్పత్తిని 69.7 మిలియన్ టన్నులకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నూనె గింజల సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లు పెంచాలని నిర్ణయించింది.
» మరాఠి, పాళీ, ప్రాకతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఈ చరిత్రాత్మక నిర్ణయమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. భారతీయ భాషలకు ప్రాచీన హోదా ఇచ్చే విధానాన్ని 2004 అక్టోబర్ 12న కేంద్ర ప్రారంభించింది. ఇప్పటివరకు తమిళం, సంస్కతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ఈ హోదా లభించింది.
»11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఉత్పాదక అనుసంధానిత బోనస్ చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 78 రోజులకు గాను మొత్తం రూ.2,028.57 కోట్లు చెల్లించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే శాఖ పనితీరును మరింత మెరుగుపర్చడానికి ప్రోత్సాహకంగా ఉద్యోగులకు ఈ బోనస్ చెల్లిస్తుంటారు.
» చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
Comments
Please login to add a commentAdd a comment