పిల్లల మార్కులు నేరుగా తల్లిదండ్రులకే | Childrens marks directly to parents | Sakshi
Sakshi News home page

పిల్లల మార్కులు నేరుగా తల్లిదండ్రులకే

Published Wed, May 29 2024 5:33 AM | Last Updated on Wed, May 29 2024 5:33 AM

Childrens marks directly to parents

రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి హోలిస్టిక్‌ రిపోర్టు కార్డు 

తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపుతున్న పాఠశాల విద్యాశాఖ 

1 నుంచి 9 తరగతుల విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులకు వివరణ 

61.81 లక్షల మందికి ఎస్‌ఎంఎస్‌లు.. 100 శాతం పూర్తి చేసిన ప్రభుత్వ స్కూల్స్‌ 

89 శాతంతో వెనుకబడ్డ ప్రైవేట్‌ స్కూల్స్‌

సాక్షి, అమరావతి: విద్యార్థి ఒక్క రోజు బడికి రాకపోతే తల్లిదండ్రులకు మెసేజ్‌  (ఎస్‌ఎంఎస్‌లు)ల ద్వారా తెలియజేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. మరో వినూత్న ప్రక్రియను చేపట్టింది. విద్యార్థులు వివిధ పరీక్షల్లో సాధించిన మార్కులను, నెలలో ఎన్నిరోజులు బడికి వచ్చారో చెబుతూ ‘హోలిస్టిక్‌ రిపోర్టు కార్డు’ లను తల్లిదండ్రులకు పంపిస్తోంది. ఫార్మేటివ్‌ (యూనిట్‌), సమ్మేటివ్‌ (అర్ధ, వార్షిక) అసెస్‌మెంట్స్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను నేరుగా తల్లిదండ్రులకే చేరవేస్తోంది.

గతంలో వార్షిక పరీక్షల ఫలితాలను మాత్రమే ప్రోగ్రెస్‌ కార్డుల్లో ఇవ్వగా, ఈ ఏడాది అందుకు భిన్నంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్లకు హోలిస్టిక్‌ రిపోర్టు కార్డులను ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 9 తరగతుల పిల్లలకు ఈ నూతన విధానం ప్రవేశపెట్టింది. 

ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఐటీ విభాగం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అన్ని మేనేజ్‌మెంట్స్‌లోని బడుల్లో 9వ తరగతి వరకు చదువుతున్న సుమారు 61.81 లక్షల మంది విద్యార్థుల మార్కులు, బడికి హాజరైన రోజుల సమాచారాన్ని తల్లిదండ్రులకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 55,71,173 మందికి (90.13 శాతం) ఎస్‌ఎంఎస్‌లు పంపారు. 

పిల్లల ప్రగతి తల్లితండ్రులకు తెలిసేలా.. 
గతంలో విద్యార్థులు వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులను ప్రోగ్రెస్‌ రిపోర్టుగా ఏప్రిల్‌/ మే నెలల్లో పంపించేవారు. అయితే 2023–24 విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్‌ఏ పరీక్షలు, రెండు ఎస్‌ఏ పరీక్షల్లో సాధించిన మార్కులు, ఎన్ని రోజులు బడికి హాజరయ్యారో కూడా వివరిస్తూ తల్లిదండ్రులకు హోలిస్టిక్‌ రిపోర్టు కార్డులను వారి ఫోన్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపిస్తున్నారు. కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకుని చూసుకోవచ్చు. 

దీనిద్వారా తమ పిల్లలు ఏ పరీక్షలో ఎన్ని మార్కులు సాధించారు, ఎన్ని రోజులు బడికి వెళ్లారో తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చాయో గుర్తించి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, మేనేజ్‌మెంట్లను అడిగేందుకు అవకాశముంటుంది. దీనిద్వారా తల్లిదండ్రుల్లో బాధ్యత పెరుగుతుందని పాఠశాల విద్యా­శాఖ కమిషనర్‌ సురే‹Ùకుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు.

100 శాతం పూర్తిచేసిన ప్రభుత్వ బడులు 
విద్యార్థుల మార్కులు, హాజరు వివరాలను పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి పాఠశాల (ప్రాథమిక, ఉన్నత) ప్రధా­నోపా­ధ్యా­యులకు ప్రత్యేక లాగిన్‌ ఇచ్చారు. 

ప్రతి విద్యార్థి వ్యక్తిగత హాజరు, ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షల్లో సాధించిన మార్కులను ఇందులో నమోదు చేయాలి. ఈ ప్రక్రియను ప్రభుత్వ పాఠశాలలు నూరు శాతం పూర్తి చేయగా, ప్రైవేటు పాఠశాలలు 89 శాతం మాత్రమే నమోదు చేశాయి. బడులు తెరిచేలోగా అన్ని స్కూళ్లూ ఈ వివరాలను నమోదు చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

డిజీ లాకర్‌లో 8, 9 తరగతుల మార్కులు 
ఇప్పటికే డిగ్రీ, ఇంటర్మీడియట్‌తో పాటు పదో తరగతి మార్కుల జాబితాలను ‘డిజీ లాకర్‌’లో నమోదు చేస్తుండగా.. 2023–24 విద్యా సంవత్సరంలో 8, 9 తరగతుల మార్కుల జాబితాలను సైతం డిజీ లాకర్‌లో అందుబాటులో ఉంచారు. బడులు తెరిచాక పేరెంట్స్‌ కమిటీ సమావేశాల్లో డిజీ లాకర్‌పై అవగాహన కల్పించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement