భోపాల్: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్‌లో దూకుడును పెంచింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన గరీబ్ కళ్యాణ్ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2003 నుండి 2023 వరకు పరిపాలనకు సంబంధించి రిపోర్టు కార్డును విడుదల చేశారు. ధైర్యముంటే కాంగ్రెస్ పార్టీ కూడా తమ 53 ఏళ్ల పరిపాలన తాలూకు ప్రగతి నివేదిక సమర్పించాలని సవాల్ విసిరారు.
గరీబ్ కళ్యాణ్ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్, బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ సమక్షంలో 20 ఏళ్ల ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాటలాడుతూ మధ్యప్రదేశ్ ప్రజలు 2003లో కాంగ్రెస్ పార్టీని, వేర్పాటుదారుడు దిగ్విజయ్ సింగ్ ను సాగనంపి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. గడిచిన 20 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ధైర్యముంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఐదు దశాబ్దాల పరిపాలనలో మధ్య ప్రదేశ్ కు ఏమి చేసిందో నివేదిక విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.
1956లో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2003 వరకు ఐదారేళ్లు మినహాయిస్తే మిగతా సమయమంతా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని ఆ సమయంలో ఇక్కడ అభివృద్ధి కరువై BIMARU(ఆరోగ్యం నశించి)గా మారిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాభివవృద్ధికి కృషి చేసిందని.. మధ్యలో డిసెంబరు 2018 నుండి మార్చి 2002 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేసి అభివృద్ధిని కుంటుపడేలా చేసిందని అన్నారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం అన్ని విభాగాల్లోనూ దూసుకుపోతోందని.. 45 శాతంతో గోధుమల ఎగుమతిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని.. ప్రభుత్వ ఆరోగ్య పథకానికి సంబంధించి ఆయుష్మాన్ కార్డులు జారీ చేయడంలోనూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్డులను మెరుగుపరచడంలోనూ దేశానికే తలమానికంగా నిలిచిందని అన్నారు.
వ్యవసాయ రంగానికి మౌలిక నిధుల పథకం కింద రూ. 4300 కోట్ల నిధులు సమకూర్చి దేశంలో నెంబర్ వన్ స్థానంలోనూ.. స్వచ్ఛతలో ఇండోర్ ఎప్పటినుంచో మొదటి స్థానంలోనూ కొనసాగుతున్నాయని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేదలకు ఇల్లు కట్టించడంలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచిందని.. సుమారు 44 లక్షల పేద కుటుంబాలు ఈ పథకం కింద గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పక్కా ఇళ్లు సొంతం చేసుకున్నారని అన్నారు.
రాష్ట్రంలో జరిగిన సంక్షేమాభివృద్ధి గురించి వివరిస్తూ రాష్ట్రంలోని సుమారు 1.36 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని 2003లో రూ.12000 గా ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు రూ.1.4 లక్షలకు చేరిందని అన్నారు. ఒకప్పుడు విభజనలు పాలైన రాష్ట్రంగా పిలవబడిన మధ్య ప్రదేశ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు, రోడ్లు, మంచినీరు, విద్య విభాగాల్లో ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు.
చివరిగా ఆయన మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తూ 2014లో 29 ఎంపీ సీట్లకు గాను 27 సీట్లలో బీజేపీ పార్టీని గెలిపించగా 2019లో 28 సీట్లలోనూ గెలిపించారని.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మిగిలిన ఆ ఒక్క సీట్లో కూడా ప్రజలు గెలిపిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు మొండిచేయి
Comments
Please login to add a commentAdd a comment