సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో తిరిగి రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం మోదీ సర్కార్ తొలి 50 రోజుల్లో సుపరిపాలనను పరుగులు పెట్టించేలా పునాదులు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సోమవారం మీడియా ప్రతినిధుల ఎదుట ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరిస్తూ రిపోర్ట్ కార్డ్‌ను సమర్పించారు. సబ్‌కా సాథ్..సబ్‌కా వికాస్..సబ్‌కా విశ్వాస్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమం..సమన్యాయం అందేలా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
దేశంలో పెట్టుబడులను ముమ్మరం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ 100 లక్షల కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా మలిచేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను ఈ 50 రోజుల్లో రూపొందించామని అన్నారు. 50 రోజుల పాలనలో ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతం కోసం వాటికి మూలధనం కింద రూ 70,000 కోట్లు కేటాయించడం ప్రభుత్వ విజయంగా చెప్పుకొచ్చారు.
జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదుల ప్రభావాన్ని తగ్గించగలిగామని తెలిపారు. బిమ్స్‌టెక్, జీ-20 సదస్సుల ద్వారా భారత్ గ్లోబల్ లీడర్‌గా అవతరించిందని అన్నారు. అధికార యంత్రాగంలో అవినీతిపై, ఆర్థిక నేరగాళ్లపై చర్యలు, పోక్సో చట్టానికి సవరణలు వంటి పలు విజయాలు సాధించామని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment