second term
-
మళ్లీ హౌడీ.. అంటారా?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక విజయంతో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో విడత శ్వేతసౌధంలోకి కాలు మోపుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక భాగస్వామి భారత్‌తో వాణిజ్య, దౌత్య సంబంధాలు ఇకపై ఎలా ఉంటాయి? ‘‘హౌడీ.. మోదీ!’’ ‘‘నమస్తే ట్రంప్..!’’ స్నేహ బంధం కొనసాగుతుందా? మరి మనకు అనుకూలతలు – ప్రతికూలతలు ఏమిటన్నవి ఆసక్తికరంగా మారాయి. ‘అమెరికా ఫస్ట్’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ విదేశాంగ విధానాన్ని సంస్కరించనున్నట్లు ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అందువల్ల సహజంగానే ఆయన విధానాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి. భారత్–రష్యా సంబంధాల విషయంలో చూసీ చూడనట్లు ఉన్నా వాణిజ్యం, ఇమిగ్రేషన్ నిబంధనలు, సుంకాల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారు. మిత్రుడంటూనే..2017 నుంచి 2021 వరకు ట్రంప్ తొలిసారి అధ్యక్షు డిగా ఉన్నప్పుడు అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. భారత్, చైనా సహా పలు దేశాల ఎగుమతులపై భారీ సుంకాలను విధించారు. అమెరికా ఉత్పత్తులు, సేవలపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై కఠిన వైఖరి అనుసరించారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ పలు సందర్భాల్లో తన స్నేహితుడిగా అభివర్ణించినా అదే సమయంలో భారత విధానాలను గట్టిగా వ్యతిరేకించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలను విధించటాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. వాణిజ్య నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోందని, అత్యధికంగా సుంకాలను విధిస్తోందని.. టారిఫ్ కింగ్ అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ కోరిన విధంగా సుంకాల తగ్గింపు నిబంధనలను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 2028 నాటికి 0.1 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ సంబంధాలు..గతంలో ట్రంప్ హయాంలో అమెరికా – చైనా మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. చైనాను ఆయన గట్టి ప్రత్యర్థిగా పరిగణిస్తారు. ఇది కొంతవరకు భారత్ – అమెరికా మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం కావటానికి దోహదం చేసింది. చైనాకు దీటుగా ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ కూటమి బలంగా ఎదగాలని ట్రంప్ భావించారు. ఇప్పుడు ఆయన రెండోసారి అధ్యక్షుడు అవుతున్నందున అమెరికా – భారత్ మధ్య ఆయుధ సంపత్తి, సంయుక్త సైనిక విన్యాసాలు, సాంకేతిక మార్పిడి విషయంలో మెరుగైన సమన్వయం ఉండవచ్చు.వీసా విధానం..ట్రంప్ విధానాలు వలసదారులకు ఇబ్బందికరమే! స్థానికుల ఉద్యోగాలను వారు లాక్కుంటున్నారని గుర్రుగా ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేస్తే ఐటీ సంస్థలకు, నిపుణులకు కష్టకాలమే!! -
Iran presidential election 2024: సంస్కరణవాదా ? అతివాదా?
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్‌తో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో నేడు రెండో దఫా ఎన్నికలకు ఓటర్లు సిద్ధమయ్యారు. జూన్ 28న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులందరినీ తిరస్కరిస్తూ, ఎవరికీ కీలక 50 శాతం ఓటింగ్‌ను ఓటర్లు కట్టబెట్టకపోవడంతో రన్ఆఫ్(రెండోసారి ఎన్నికలు)కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. మతబోధకుడి పాలనను జనం ఎంతగా తిరస్కరిస్తున్నారనేది జూన్ 28నాటి అత్యల్ప ఓటింగ్ సరళి కళ్లకు కట్టింది. కునారిల్లిన ఆర్థికవ్యవస్థ, యువతలో అసహనం, మతఛాందసవాదం, ఉద్యమాలు, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్, అమెరికాలతో కయ్యంతో ఇంటాబయటా ఇబ్బందులు పడుతున్న దేశాన్ని ఎవరు ఏలుతారన్న విషయం నేటి ఎన్నికలతో తేలిపోనుంది. తొలి రౌండ్లో ఏం జరిగింది? మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ మరణించడంతో అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ ఆజ్ఞలు పాటిస్తూ దేశాధ్యక్షునిగా పాలించేందుకు ముగ్గురు అతివాద నేతలు, ఒక సంస్కరణవాది ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చారు. తొలి రౌండ్లో సంస్కరణవాది డాక్టర్ మసూద్ పెజెష్కియన్ అందరికంటే ఎక్కువగా 42.5 శాతం ఓట్లు సాధించారు. అతివాది సయీద్ జలిలి 38.6 శాతం ఓట్లు ఒడిసిపట్టారు. దేశంలో 6 కోట్ల మంది ఓటర్లుంటే కేవలం 2.5 కోట్ల మంది ఓటేశారు. దేశ చరిత్రలోనే అత్యల్పంగా 40 శాతం పోలింగ్ నమోదైంది. ఎవరికీ 50 శాతం ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండోదశ పోలింగ్‌కు అర్హత సాధిస్తారు. ఈ లెక్కన మసూద్, జలిలి మాత్రమే ఈరోజు జరిగే ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పిడివాదుల్లో పొరపొచ్చాలు? అతివాద నేతల మధ్య అభిప్రాయభేదాలు పొడచూపాయి. అతివాదం నుంచి దేశాన్ని సంస్కరణల బాట పట్టిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సీనియర్ సభ్యుడు, అతివాది సర్దార్ మొహసీన్ రషీద్ తన మద్దతు మసూద్‌కే అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తొలి రౌండ్లో పోటీపడి ఓడిన గలీబాఫ్కు ప్రచారసారథ్యంవహించిన సమీ నజారీ తర్కరానీ సైతం మసూద్‌కే తన ఓటు అని ప్రకటించారు. మసూద్ గెలిస్తే? తొలి రౌండ్లో పోలింగ్ కేంద్రందాకా రాని 60 శాతం ఓటర్లపైనే ఈ ఇద్దరు అభ్యర్థులు దృష్టిసారించారు. తొలి రౌండ్లో సమీప అభ్యర్థి జలిలి కంటే 3.9 శాతం ఓట్లు ఎక్కువ సాధించడం ద్వారా జనాల్లో తనకు ప్రజాదరణ ఎక్కువ ఉందని మసూద్ పెజెష్కియన్ ఇప్పటికే నిరూపించుకున్నారు. కొన్ని అంశాల్లో మసూద్‌ను సమరి్థస్తున్నట్లు ఎన్నికలపర్వం మొదలవడానికి ముందు జలిలి కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మైనారిటీలు, యువత, మహిళల సమస్యలను ప్రచారం సందర్భంగా ప్రస్తావిస్తూ జనాన్ని మసూద్ తనవైపునకు తిప్పుకుంటున్నారు. మసూద్ గెలిచి దేశాధ్యక్షుడైతే నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో మరుగునపడిన 2015నాటి అమెరికా–ఇరాన్ అణుఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు కృషిచేయొచ్చు. పశి్చమదేశాలతో దోస్తీకి ప్రయతి్నంచవచ్చు. దీంతో ఆంక్షలు తొలగి, విదేశీ పెట్టుబడులు పెరిగి దేశారి్థకం బాగుపడే అవకాశముంది.జలిలి గెలిస్తే? సయీద్ జలిలి గెలిస్తే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. దేశాభివృద్ధి కోసం పశి్చమదేశాలపై ఆధారపడాల్సిన పనిలేదని సుప్రీంలీడర్ ఖమేనీ అన్న మాటలనే జలిలి వల్లెవేస్తున్నారు. ‘‘ అసలు ఇరాన్‌పై ఎందుకు ఆంక్షలు విధించాం? అని పశి్చమ దేశాలే బాధపడాలి. ఆంక్షలను సైతం మనం అవకాశంగా మలచుకోవాలి’ అన్న జలిలి మాటలు చూస్తుంటే ఈయన గెలిస్తే దేశంలో మతచాంధస పాలనను కొనసాగిస్తారని అర్థమవుతోంది.స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే మార్గముందా? దేశ కీలక అంతర్గత వ్యవహారాలు అన్నీ సుప్రీంలీడర్ ఖమేనీ కనుసన్నల్లో జరుగుతాయి. అలాంటపుడు అధ్యక్షుడిగా ఉండి కూడా మసూద్గానీ, జలిలిగానీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరా? అనేది భేతాళ ప్రశ్నగా మిగిలిపోనుందని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే విదేశీవ్యవహారాల్లో అధ్యక్షుడు, మంత్రివర్గం నిర్ణయాలే ఎక్కువగా చెల్లుబాటు అవుతాయని తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాలతో శతృత్వం విషయం పక్కనబెడితే ఇతర పశి్చమ దేశాలతో మైత్రికి నూతన అధ్యక్షుడు ప్రయతి్నస్తే దేశంలో ప్రగతి సాధ్యమే. మసూద్ అధ్యక్షుడైతే ఈ మార్పుకు బాటలు పడొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ‘మార్పు’కు ఖమేనీ ఒప్పుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సిక్కింలో ఎస్కేఎం
గాంగ్టక్: సిక్కిం శాసనసభ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) సంచలన విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో 32 స్థానాలకు గాను ఏకంగా 31 తన ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది. ఎస్కేఎం అధినేత, ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీకి దిగి రెండింటా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకున్న ఎస్కేఎం ఈసారి క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. పోలైన మొత్తం ఓట్లలో 58.28 శాతం సాధించింది! 2019 దాకా 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన విపక్ష సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ఎస్డీఎఫ్ అధ్యక్షుడు, మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ అనూహ్య ఓటమి చవిచూశారు. బీజేపీ, కాంగ్రెస్ అయితే ఖాతాయే తెరవలేదు! 31 సీట్లలో పోటీ చేసిన బీజేపీకి కేవలం 5.18 శాతం ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌కైతే 0.32 శాతం ఓట్లే వచ్చాయి. భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెపె్టన్, ఎస్డీఎఫ్ ఉపాధ్యక్షుడు బైచుంగ్ భూటియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే దిల్లీరామ్ థాపా కూడా ఓటమి చవిచూశారు. నామ్చీ జిల్లా బర్ఫుంగ్ నుంచి పోటీ చేసిన భూటియా ఎస్కేఎం అభ్యర్థి డోర్జీ భూటియా చేతిలో ఓటమి చవిచూశారు. డోర్జీకి 8,358 ఓట్లు, భూటియాకు 4,012 ఓట్లు లభించాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే భూటియా ఎస్డీఎఫ్లో చేరారు.మోదీ అభినందనలు ఎస్‌కేఎంకు, సీఎం తమాంగ్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పని చేస్తామన్నారు. బీజేపీకి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రధానికి తమాంగ్ కృతజ్ఞతలు తెలిపారు.టీచర్ నుంచి సీఎం దాకా తమాంగ్ ఆసక్తికర ప్రస్థానం ప్రేమ్‌సింగ్ తమాంగ్. సిక్కింలో ఎస్కేఎం క్లీన్‌స్వీప్ వెనుక ఉన్న శక్తి. 56 ఏళ్ల తమాంగ్ వ్యక్తిగత చరిష్మాతోపాటు పరిపాలనాదక్షుడిగా ఆయనకున్న పేరు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఈ ఘన విజయానికి కారణమయ్యాయి. తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న జన్మించారు. తల్లిదండ్రులు కాలూసింగ్ తమాంగ్, ధన్మాయ తమాంగ్. పశి్చమబెంగాల్‌లోని డార్జీలింగ్లో కాలేజీ విద్య పూర్తిచేశారు. 1990లో ప్రభుత్వ ఉపాధ్యయుడిగా ఉద్యోగంలో చేరారు. మూడేళ్ల తర్వాత రాజీనామా చేసి ఎస్డీఎఫ్లో చేరారు. 15 ఏళ్లపాటు మంత్రిగా చేశారు. 2009లో నాటి సీఎం పవన్ కుమార్ చామ్లింగ్‌తో విభేదించి ఎస్డీఎఫ్ నుంచి బయటకొచ్చారు. 2013లో ఎస్కేఎం ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో పార్టీ 10 సీట్లు సాధించింది. అవినీతికి కేసుల్లో అరెస్టయిన తమాంగ్ ఏడాదిపాటు జైల్లో ఉండి 2017లో బయటికొచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 17 సీట్లు గెలిచి రెండేళ్లకే సీఎం అయ్యారు. అనంతరం పార్టీని మరింత పటిష్టపరిచారు. -
పాక్ ప్రధానిగా షహబాజ్ ప్రమాణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్(72) రెండోసారి ప్రమాణం చేశారు. అధ్యక్షభవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆయనతో ప్రమాణం చేయించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, సింధ్ సీఎం మురాద్ అలీ షాతోపాటు ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. గతంలో, 2022 ఏప్రిల్–2023 ఆగస్ట్ వరకు పార్లమెంట్ రద్దు కాకముందు షహబాజ్ దేశ ప్రధానిగా పనిచేశారు. ఆదివారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో షహబాజ్ సునాయాసంగా మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. -
Sovereign Gold : 22 నుంచి ఐదు రోజులు కొత్త గోల్డ్ బాండ్ స్కీమ్
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2022–23 రెండవ సిరీస్ సోమవారం ప్రారంభమవుతోంది. ఐదు రోజుల పాటు (ఆగస్టు 22 నుంచి 26 వరకూ) చందాదారులకు అందుబాటులో ఉండే ఈ స్కీమ్ బాండ్ ఇష్యూ ధర గ్రా ముకు రూ.5,197 అని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే, రూ.50 డిస్కౌంట్‌తో రూ.5,147కే బాండ్ లభిస్తుందని ప్రకటన పేర్కొంది. కేంద్రం తరఫుల ఆర్బీఐ చేసే ఈ బాండ్లు స్టాక్ ఎక్సే్చంజీలతోపాటు నిర్దిష్ట బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా లభ్యమవుతాయి. దేశంలో భౌతిక పసిడికి డిమాండ్ తగ్గించి, ఇందుకు సంబంధించిన డబ్బును పొదుపు పథకాల్లోకి మళ్లించడానికి 2015 నవంబర్‌లో కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. -
రెండోసారి సీఎంలుగా ప్రమోద్ సావంత్, బీరేన్ సింగ్
న్యూఢిల్లీ: గోవా, మణిపూర్ ముఖ్యమంత్రులుగా ప్రమోద్ సావంత్, ఎన్ బీరేన్ సింగ్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అంతేగాదు గోవా, మణిపూర్లలో ప్రస్తుత ముఖ్యమంత్రులు అయిన ప్రమోద్ సావంత్, ఎన్ బీరేన్ సింగ్‌లు మళ్లీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. హోలీ తర్వాత ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుందని వెల్లడించారు. ఇద్దరు నేతలు ఇవాళ ప్రధాని మోదీని కలిశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో నాయకత్వానికి ఎలాంటి సందేహం లేకపోయినా గోవా, మణిపూర్లలో ఉన్నత పదవులపై ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు గోవాలో 40 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 20 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌ను 11 సీట్లకు పరిమితం అయ్యింది. దాంతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే మణిపూర్‌లో ఇతర పార్టీలను సింగిల్ డిజిట్‌ను దక్కించుకోవడంతో బీజేపీ మెజారిటీ ఓట్లతో ఆధిక్యంలో నిలిచింది. అంతేగాదు మణిపూర్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 32 స్థానాల్లో విజయం సాధించింది. (చదవండి: రాజకీయాల్లో వారికి నా వల్లే టికెట్ రాలేదు.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు) -
నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో విడత సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం,, ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో వడ్డీ రేట్లు తగ్గింపు, రైతులకు కనీస మద్దతు ధర, రష్యా దాడులతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోద ముద్ర, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వం అజెండాలో ప్రధానమైనవి. సోమవారం లోక్‌సభ కార్యకలాపాలు మొదలు కాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కశ్మీర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత సమావేశాల్లో దానిపై చర్చ జరుగుతుంది. రాజ్యాంగ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆదేశాల (సవరణ) బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అదుపులోకి రావడంతో పార్లమెంటు ఉభయ సభలు యథావిధిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్నాయి. ఈ సారి సమావేశాలు ఏప్రిల్ ఎనిమిదో తేదీన పూర్తికానున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాలి : కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం ఉదయం పార్టీ పార్లమెంటు వ్యూహాల గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు. సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఒకే భావజాలం కలిగిన పార్టీలతో సమన్వయంతో పని చేయాలని నిర్ణయానికొచ్చారు. బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తి, వాటిపై చర్చ జరిగేలా చూస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. -
రేపు జగనన్న విద్యా దీవెన రెండో విడత.. 11 లక్షల మందికి లబ్ధి
సాక్షి, తాడేపల్లి: పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో రూపకల్పన చేసిన జగనన్న విద్యా దీవెన రెండో విడత కార్యక్రమాన్ని గురువారం ప్రభుత్వం అమలు చేయనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఎకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. రెండో విడతగా సుమారు 11 లక్షల మంది విద్యార్థులకు 693 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే మొదటి దశ కింద ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 671 కోట్లను జమ చేశారు. చంద్రబాబు పెట్టిన బకాయిలు రూ. 1,774 కోట్లతో సహా రేపు వేయబోయే విద్యా దీవెనతో మొత్తం రూ. 5573 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఇప్పటివరకూ విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్దలు, అమ్మ ఒడి, విద్యాకానుక, మనబడి, నాడు నేడు కింద మొత్తం 25,714 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మూడో దశ విద్యాదీవెన ఈ డిసెంబర్లో, నాలుగో విడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం అమలు చేయనుంది. -
క్యూ1కు సెకండ్ వేవ్ షాక్!
గతేడాది చివరి త్రైమాసికం (2020–21, జనవరి–మార్చి)లో కార్పొరేట్ దిగ్గజాలు ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. అయితే ఇది పరిశ్రమ వర్గాలకు జోష్‌నివ్వడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ మొదలు దేశీయంగా తలెత్తిన కోవిడ్–19 సెకండ్ వేవ్.. మరోసారి లాక్డౌన్లకు దారితీయడంతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం కనిపించనున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లో పలు కంపెనీలు మళ్లీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించవచ్చనేది విశ్లేషకుల అంచనా. ముంబై: కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా ఉధృత రూపం దాల్చడంతో జనజీవనం అస్తవ్యస్తంకావడంతోపాటు.. పారిశ్రామిక రంగాలకూ సెగ తగులుతోంది. ఇప్పటికే ఏప్రిల్ నెలలో పలు కంపెనీల అమ్మకాలు పడిపోగా.. మే నెలలో వైరస్ మరింత దెబ్బతీసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ఆటో, ఆతిథ్యం, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ట్రావెల్, టూరిజం, విచక్షణాధారిత వినియోగం తదితర రంగాలు కరోనా వైరస్ దెబ్బకు కుదేలవనున్నట్లు పేర్కొంటున్నారు. ఇది బ్యాంకింగ్ రంగంపై సైతం ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నట్లు ఆర్థిక రంగ నిపుణులు తెలియజేశారు. ఈ పరిస్థితులు అత్యధిక రిస్కులకు దారితీయవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. హెల్త్‌కేర్ ఓకే.... ఇటీవల ప్రజలు ఆరోగ్య పరిరక్షణ, గృహ పరిశుభ్రత, నిత్యావసరాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. పలు రాష్ట్రాలు లాక్డౌన్ పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆటో, వినియోగ వస్తువుల రంగ కంపెనీలు తయారీ ప్లాంట్లకు తాత్కాలికంగా బ్రేకులు వేస్తున్నాయి. నిల్వలను క్లియర్ చేసుకున్నాక తిరిగి ఉత్పత్తిని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సంబంధిత నిపుణులు తెలియజేశారు. వరుసగా రెండో ఏడాదిలోనూ జూన్ క్వార్టర్లో అప్లయెన్సెస్ మార్కెట్‌ను మహమ్మారి దెబ్బతీస్తున్నట్లు గోద్రెజ్ అప్లయెన్సెస్ వైస్‌ప్రెసిడెంట్ కమల్ నంది పేర్కొన్నారు. 40 శాతం డౌన్ ... ఈ ఏప్రిల్‌లో అమ్మకాలు 40 శాతం పడిపోయినట్లు నంది వెల్లడించారు. 2020 ఏప్రిల్‌లో అయితే లాక్డౌన్ కారణంగా మొత్తం అమ్మకాలు తుడిచిపెట్టుకు పోయినట్లు గుర్తు చేశారు. ఇక మే నెలలో సైతం ఇదే స్థాయిలో సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలియజేశారు. నిజానికి వేసవి కారణంగా జూన్ త్రైమాసికం బిజినెస్‌లకు కీలకమని వినియోగ వస్తు కంపెనీల సమాఖ్య అధ్యక్షుడైన నంది తెలియజేశారు. అమ్మకాలలో 33 శాతం వరకూ క్యూ1లో నమోదవుతుంటాయని వివరించారు. హోటళ్లు బేర్ కోవిడ్–19 కట్టడికి గతేడాది విధించిన లాక్డౌన్ నేపథ్యంలో 30–35 శాతం హోటళ్లు శాశ్వతంగా మూతపడినట్లు దేశీ హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వైస్‌ప్రెసిడెంట్ జీఎస్ కోహ్లి ప్రస్తావించారు. ప్రస్తుత లాక్డౌన్, ఆంక్షల ఫలితంగా మరో 30 శాతం కనుమరుగయ్యే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. కార్ల కొనుగోలు వంటి విచక్షణాధారిత వినియోగ రంగాలను సైతం వైరస్ దెబ్బతీస్తున్నట్లు మారుతీ సుజుకీ అమ్మకాలు, మార్కెటింగ్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. వివిధ పట్టణాలలో లాక్డౌన్ల కారణంగా అమ్మకాలు పడిపోతున్నట్లు తెలియజేశారు. ఇది మే నెల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు చెప్పారు. అయితే ఏప్రిల్‌లో పలు కంపెనీల ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పుంజుకున్నట్లు తెలియజేశారు. సుమారు 2,87,000 వాహనాలు అమ్ముడైనట్లు వెల్లడించారు. మే నెలలో తయారీ, సరఫరా వ్యవస్థలు నిలిచిపోవడం కూడా అమ్మకాలను దెబ్బతీయనున్నట్లు వివరించారు. దీనికితోడు ఇటీవల కొద్ది నెలలుగా ఆటో రంగం సెమీకండక్టర్ల కొరత సమస్యను ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇక ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో అమ్మకాలు ఏప్రిల్‌లో నీరసించగా.. మే నెల మొదట్లోనూ డిమాండ్ భారీగా క్షీణించినట్లు కంపెనీ ఈడీ రాకేష్ శర్మ తెలియజేశారు. -
మోదీ 2.0 : యాభై రోజుల పాలన ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో తిరిగి రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం మోదీ సర్కార్ తొలి 50 రోజుల్లో సుపరిపాలనను పరుగులు పెట్టించేలా పునాదులు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సోమవారం మీడియా ప్రతినిధుల ఎదుట ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరిస్తూ రిపోర్ట్ కార్డ్‌ను సమర్పించారు. సబ్కా సాథ్..సబ్కా వికాస్..సబ్కా విశ్వాస్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమం..సమన్యాయం అందేలా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులను ముమ్మరం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ 100 లక్షల కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా మలిచేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను ఈ 50 రోజుల్లో రూపొందించామని అన్నారు. 50 రోజుల పాలనలో ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతం కోసం వాటికి మూలధనం కింద రూ 70,000 కోట్లు కేటాయించడం ప్రభుత్వ విజయంగా చెప్పుకొచ్చారు. జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదుల ప్రభావాన్ని తగ్గించగలిగామని తెలిపారు. బిమ్స్టెక్, జీ-20 సదస్సుల ద్వారా భారత్ గ్లోబల్ లీడర్‌గా అవతరించిందని అన్నారు. అధికార యంత్రాగంలో అవినీతిపై, ఆర్థిక నేరగాళ్లపై చర్యలు, పోక్సో చట్టానికి సవరణలు వంటి పలు విజయాలు సాధించామని మంత్రి చెప్పారు. -
జీఎస్టీ 2.0 అమల్లోకి తేవాలి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) రెండో దశను (2.0) అమల్లోకి తేవాల్సిన సమయం వచ్చిందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. విద్యుత్, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్, ఆల్కహాల్‌ను కూడా దీని పరిధిలోకి తీసుకురావడం ద్వారా పన్ను సంస్కరణలకు మరింత ఊతమివ్వాల్సిన అవసరముందని పేర్కొన్నాయి. అలాగే పన్ను రేటును 2–3 శ్లాబులకు పరిమితం చేయాలని కోరాయి. ‘జీఎస్టీ అమల్లోకి వచ్చి రెండేళ్లయింది. ఇక జీఎస్టీ 2.0ని అమలు చేయాల్సిన తరుణం వచ్చింది. ఇది దేశ ఎకానమీని తదుపరి వృద్ధి స్థాయికి చేర్చగలదు‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. ప్రారంభ దశలో ఎదురైన పలు సవాళ్లను అధిగమించిన నేపథ్యంలో పరోక్ష పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేయాలన్న లక్ష్య సాధన దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ పేర్కొన్నారు. మరోవైపు రిటర్నుల ఫైలింగ్ల్లోనూ.. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ల్లోనూ వ్యత్యాసాలు ఉన్నా, పన్నులు ఎగవేసినా ఆయా సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్లు, ప్రొప్రైటర్లకు ఎస్ఎంఎస్లు పంపుతున్నట్లు జీఎస్టీ నెట్వర్క్ సీఈవో ప్రకాష్ కుమార్ తెలిపారు. దీనివల్ల తెలియక చేసిన తప్పులేమైనా ఉంటే వారు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని ఆయన వివరించారు. ఇందుకోసం ప్రత్యేక జీఎస్టీ వ్యవస్థను రూపొందించినట్లు కుమార్ చెప్పారు. ఐటీసీ క్లెయిమ్‌లు, రిటర్నుల్లో తేడాలున్న పక్షంలో ఆయా అసెసీలకు అలర్ట్‌లు పంపడంతో పాటు ఆదాయ పన్ను శాఖకు సమాచారం అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. మరోవైపు వరుసగా రెండు నెలల పాటు జీఎస్టీఆర్–3బి దాఖలు చేయని సంస్థలకు ఆగస్టు 22 నుంచి ఈ–వే బిల్లుల జారీ నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1.22 కోట్ల వ్యాపార సంస్థలు జీఎస్టీ కింద నమోదయ్యాయి. -
వెనెజులా అధ్యక్షుడిగా మళ్లీ మదురో
కారకస్: వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. దేశంలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, క్షీణిస్తున్న శాంతిభద్రతల నేపథ్యంలో అధికారం నుంచి దిగిపోవాలని అంతర్జాతీయ సమాజం సూచించినా పదవి చేపట్టడానికే ఆయన మొగ్గు చూపారు. రాజధాని కారకస్‌లో జరిగిన మదురో ప్రమాణస్వీకార కార్యక్రమానికి 94 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మదురో బాధ్యతలు చేపట్టడాన్ని అమెరికా, కెనడా సహా డజను లాటిన్ అమెరికా దేశాలు వ్యతిరేకించాయి. ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు. -
గుబులు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికలు ఈ ఏడాది చివర్లోనే జరుగుతాయనే ప్రచారంతో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్లతో మొదలుకుని.. విపక్షంలో ఉన్న అందరూ ఎన్నికలపైనే దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించడమే కాకుండా ఎలాగైనా గెలిచి తీరాలని తహతహలాడుతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాలను సెంటిమెంట్ పట్టి పీడిస్తోంది. వరుస ఎన్నికల్లో పోటీ చేసిన వారికి చేదు ఫలితాలు ఎదురయ్యే ఆనవాయితీ ఉండగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో కనీసం పార్టీ తరఫున టికెట్టు దక్కని పరిస్థితులు సైతం ఉన్నాయి. ఇంకొందరైతే రాజకీయంగా పలుకుబడినే కోల్పోవడం గమనార్హం. 2014 సాధారణ ఎన్నికల్లో ఎనిమిది మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే అధికారం అనుభవించిన, అనుభవిస్తున్న నేతలకు ఈ సెంటిమెంట్ భయం పట్టుకుంది. వరుస విజయం సాధించడం ద్వారా తమ సత్తా నిరూపించుకోవాలని భావిస్తున్న నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్‌ను అధిగమించి చరిత్రను తిరగరాయాలని ఆయా నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తుండడంతో కాళ్లకు చక్రాలు కట్టుకు ని మరీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతీరోజూ నియోజకవర్గాల్లోనే తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో ముగ్గురే.. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ఉన్న ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. రాజకీయంగా చైతన్యం కలిగిన పాలమూరు ప్రాంతంలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయి. ప్రతీ నేత ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తుంటారు. అలా అభ్యర్థుల వ్యూహాలను బట్టి గెలుపోటములు దక్కుతున్నాయి. అయితే చాలా వరకు ఉమ్మడి జిల్లాలో వరుసగా విజయకేతనం ఎగురవేసిన వారు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుసగా గెలిచిన వారు కేవలం ముగ్గురంటే ముగ్గురే ఎన్నికవడం గమనార్హం. వీరిలో కొల్లాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే.అరుణ, కొడంగల్ నుంచి ఎనుముల రేవంత్‌రెడ్డి మాత్రమే వరుస విజయాలు సాధించారు. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో మిగతా ఎనిమిది మంది మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ నియోజకవర్గాల చరిత్ర అంతేనా.. ఉమ్మడి జిల్లాలో ‘సెకండ్ సెంటిమెంట్’ పట్టి పీడిస్తున్న నియోజకవర్గాలు అర డజనుకు పైగా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఒకసారి ఎన్నికైన వారు తదుపరి ఎన్నికల్లో గెలిచిన దాఖాలు లేవు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి గడిచిన ఐదు ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్థి కూడా వరుసగా రెండో సారి గెలిచిన దాఖలాలు లేవు. 1994లో ఎడ్మ కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఆతర్వాత 1999 ఎన్నికల్లో జైపాల్‌యాదవ్ గెలుపొందారు. అనంతరం 2004లో ఎడ్మ కిష్టారెడ్డి గెలుపొందగా, 2009లో జైపాల్‌యాదవ్ గెలిచారు. ఇక 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన వంశీచంద్‌రెడ్డి అనూహ్యంగా గెలుపొందారు. అచ్చంపేట నియోజకవర్గం పరిస్థితి కూడా అలాగే ఉంది. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారో.. రాష్ట్రంలో అదే పార్టీ పరిపాలనలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది. ఇక వనపర్తి నియోజకవర్గంలో కాస్త భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. వనపర్తి నియోజకవర్గం నుంచి కూడా ఏ ఒక్క అభ్యర్థి వరుసగా రెండుసార్లు గెలిచిన దాఖాలు లేవు. కేవలం 1999తో పాటు 2004లో వరుసగా రెండు సార్లు మాత్రమే చిన్నారెడ్డి గెలవగలిగారు. అలాగే వనపర్తి నుంచి పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఒక్క 2004లో మినహా సదరు పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో అదో సెంటిమెంట్‌గా మారింది. చరిత్ర తిరగరాసే యోచన.. రాజకీయంగా పాలమూరు ప్రాంతాన్ని వెంటాడుతున్న ‘సెకండ్ సెంటిమెంట్‌ను ఈసారి ఎట్టి పరిస్థితిల్లో తిరగరాస్తామనే ధీమా పలువురు ఎమ్మె ల్యేలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈసారి ఎన్న డూ లేని విధంగా మొదటి సారి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఏకంగా ఎనిమిది మంది ఉండగా వారి లో చాలా మంది సులువుగా ప్రజల్లో కలిసిపోయా రు. అంతేకాదు మొదటిసారి గెలుపొందడంతో ఎమ్మెల్యేలు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితం గా గెలుస్తామని ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ పునావృతం అవుతుందా.. లే æదా చరిత్రను తిరగరాస్తారా అనేది వేచిచూడాల్సిందే. -
ఐటీఐలో ప్రవేశాలకు ఆహ్వానం
సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ. ప్రయివేట్ ఐటీఐలలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు గాను రెండో విడత దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఐటీఐల జిల్లా కన్వీనర్ కురుమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఫారాలు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ ఐటీఐలలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఏ ప్రాతంలో సీటు కావాలంటే అయా ఐటీఐలలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫారాలను ఈనెల 20వ తేదీలోగా అందజేయాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐలలో 24న ప్రయివేట్ ఐటీఐలలో 27 నుంచి 30 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, విద్యార్థులు అన్ని ఒరిజినల్ ధ్రువ పత్రాలతో హాజరుకావాలని తెలిపారు.