తమాంగ్ పార్టీ క్లీన్‌స్వీప్
32 స్థానాలకు 31 కైవసం
ఎస్‌డీఎఫ్‌కు 1, బీజేపీ, కాంగ్రెస్ 0
మాజీ సీఎం చామ్లింగ్ ఓటమి
గాంగ్‌టక్: సిక్కిం శాసనసభ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) సంచలన విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో 32 స్థానాలకు గాను ఏకంగా 31 తన ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది. ఎస్‌కేఎం అధినేత, ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీకి దిగి రెండింటా విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకున్న ఎస్‌కేఎం ఈసారి క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. పోలైన మొత్తం ఓట్లలో 58.28 శాతం సాధించింది! 2019 దాకా 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన విపక్ష సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డీఎఫ్) ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ఎస్‌డీఎఫ్ అధ్యక్షుడు, మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ అనూహ్య ఓటమి చవిచూశారు.
బీజేపీ, కాంగ్రెస్ అయితే ఖాతాయే తెరవలేదు! 31 సీట్లలో పోటీ చేసిన బీజేపీకి కేవలం 5.18 శాతం ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌కైతే 0.32 శాతం ఓట్లే వచ్చాయి. భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెపె్టన్, ఎస్‌డీఎఫ్ ఉపాధ్యక్షుడు బైచుంగ్ భూటియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే దిల్లీరామ్ థాపా కూడా ఓటమి చవిచూశారు. నామ్చీ జిల్లా బర్‌ఫుంగ్ నుంచి పోటీ చేసిన భూటియా ఎస్‌కేఎం అభ్యర్థి డోర్జీ భూటియా చేతిలో ఓటమి చవిచూశారు. డోర్జీకి 8,358 ఓట్లు, భూటియాకు 4,012 ఓట్లు లభించాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే భూటియా ఎస్‌డీఎఫ్‌లో చేరారు.
మోదీ అభినందనలు
ఎస్‌కేఎంకు, సీఎం తమాంగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పని చేస్తామన్నారు. బీజేపీకి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రధానికి తమాంగ్ కృతజ్ఞతలు తెలిపారు.
టీచర్ నుంచి సీఎం దాకా
తమాంగ్ ఆసక్తికర ప్రస్థానం
ప్రేమ్‌సింగ్ తమాంగ్. సిక్కింలో ఎస్‌కేఎం క్లీన్‌స్వీప్ వెనుక ఉన్న శక్తి. 56 ఏళ్ల తమాంగ్ వ్యక్తిగత చరిష్మాతోపాటు పరిపాలనాదక్షుడిగా ఆయనకున్న పేరు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఈ ఘన విజయానికి కారణమయ్యాయి. తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న జన్మించారు. తల్లిదండ్రులు కాలూసింగ్ తమాంగ్, ధన్‌మాయ తమాంగ్. పశి్చమబెంగాల్‌లోని డార్జీలింగ్‌లో కాలేజీ విద్య పూర్తిచేశారు.
1990లో ప్రభుత్వ ఉపాధ్యయుడిగా ఉద్యోగంలో చేరారు. మూడేళ్ల తర్వాత రాజీనామా చేసి ఎస్‌డీఎఫ్‌లో చేరారు. 15 ఏళ్లపాటు మంత్రిగా చేశారు. 2009లో నాటి సీఎం పవన్ కుమార్ చామ్లింగ్‌తో విభేదించి ఎస్‌డీఎఫ్ నుంచి బయటకొచ్చారు. 2013లో ఎస్‌కేఎం ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో పార్టీ 10 సీట్లు సాధించింది. అవినీతికి కేసుల్లో అరెస్టయిన తమాంగ్ ఏడాదిపాటు జైల్లో ఉండి 2017లో బయటికొచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 17 సీట్లు గెలిచి రెండేళ్లకే సీఎం అయ్యారు. అనంతరం పార్టీని మరింత పటిష్టపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment