
ఈటానగర్/గ్యాంగ్‌టక్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. 60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్‌కుమార్ సైన్ శనివారం చెప్పారు.
సిక్కింలోనూ..
సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్‌కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్‌డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పారీ్ట–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు.