Iran presidential election 2024: సంస్కరణవాదా ? అతివాదా? | Iran presidential election 2024: Iranians are voting in a presidential runoff | Sakshi
Sakshi News home page

Iran presidential election 2024: సంస్కరణవాదా ? అతివాదా?

Published Fri, Jul 5 2024 5:31 AM | Last Updated on Fri, Jul 5 2024 5:31 AM

Iran presidential election 2024: Iranians are voting in a presidential runoff


మసూద్‌ పెజెష్కియన్, సయీద్‌ జలిలి మధ్య హోరాహోరీ పోరు  

నేడు రెండో దఫా ఎన్నికలకు సిద్ధమైన ఇరాన్‌ 

ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్‌తో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో నేడు రెండో దఫా ఎన్నికలకు ఓటర్లు సిద్ధమయ్యారు. జూన్‌ 28న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులందరినీ తిరస్కరిస్తూ, ఎవరికీ కీలక 50 శాతం ఓటింగ్‌ను ఓటర్లు కట్టబెట్టకపోవడంతో రన్‌ఆఫ్‌(రెండోసారి ఎన్నికలు)కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. 

మతబోధకుడి పాలనను జనం ఎంతగా తిరస్కరిస్తున్నారనేది జూన్‌ 28నాటి అత్యల్ప ఓటింగ్‌ సరళి కళ్లకు కట్టింది. కునారిల్లిన ఆర్థికవ్యవస్థ, యువతలో అసహనం, మతఛాందసవాదం, ఉద్యమాలు, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్, అమెరికాలతో కయ్యంతో ఇంటాబయటా ఇబ్బందులు పడుతున్న దేశాన్ని ఎవరు ఏలుతారన్న విషయం నేటి ఎన్నికలతో తేలిపోనుంది. 

తొలి రౌండ్‌లో ఏం జరిగింది? 
మే 19న హెలికాప్టర్‌ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ మరణించడంతో అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి. సుప్రీం లీడర్‌ అయాతొల్లా అలీ ఖమేనీ ఆజ్ఞలు పాటిస్తూ దేశాధ్యక్షునిగా పాలించేందుకు ముగ్గురు అతివాద నేతలు, ఒక సంస్కరణవాది ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చారు. తొలి రౌండ్‌లో సంస్కరణవాది డాక్టర్‌ మసూద్‌ పెజెష్కియన్‌ అందరికంటే ఎక్కువగా 42.5 శాతం ఓట్లు సాధించారు. అతివాది సయీద్‌ జలిలి 38.6 శాతం ఓట్లు ఒడిసిపట్టారు. దేశంలో 6 కోట్ల మంది ఓటర్లుంటే కేవలం 2.5 కోట్ల మంది ఓటేశారు. దేశ చరిత్రలోనే అత్యల్పంగా 40 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎవరికీ 50 శాతం ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండోదశ పోలింగ్‌కు అర్హత సాధిస్తారు. ఈ లెక్కన మసూద్, జలిలి మాత్రమే ఈరోజు జరిగే ఎన్నికల్లో పోటీపడుతున్నారు. 

పిడివాదుల్లో పొరపొచ్చాలు? 
అతివాద నేతల మధ్య అభిప్రాయభేదాలు పొడచూపాయి. అతివాదం నుంచి దేశాన్ని సంస్కరణల బాట పట్టిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌ సీనియర్‌ సభ్యుడు, అతివాది సర్దార్‌ మొహసీన్‌ రషీద్‌ తన మద్దతు మసూద్‌కే అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తొలి రౌండ్‌లో పోటీపడి ఓడిన గలీబాఫ్‌కు ప్రచారసారథ్యంవహించిన సమీ నజారీ తర్కరానీ సైతం మసూద్‌కే తన ఓటు అని ప్రకటించారు. 

మసూద్‌ గెలిస్తే? 
తొలి రౌండ్‌లో పోలింగ్‌ కేంద్రందాకా రాని 60 శాతం ఓటర్లపైనే ఈ ఇద్దరు అభ్యర్థులు దృష్టిసారించారు. తొలి రౌండ్‌లో సమీప అభ్యర్థి జలిలి కంటే 3.9 శాతం ఓట్లు ఎక్కువ సాధించడం ద్వారా జనాల్లో తనకు ప్రజాదరణ ఎక్కువ ఉందని మసూద్‌ పెజెష్కియన్‌ ఇప్పటికే నిరూపించుకున్నారు. కొన్ని అంశాల్లో మసూద్‌ను సమరి్థస్తున్నట్లు ఎన్నికలపర్వం మొదలవడానికి ముందు జలిలి కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మైనారిటీలు, యువత, మహిళల సమస్యలను ప్రచారం సందర్భంగా ప్రస్తావిస్తూ జనాన్ని మసూద్‌ తనవైపునకు తిప్పుకుంటున్నారు. మసూద్‌ గెలిచి దేశాధ్యక్షుడైతే నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయంతో మరుగునపడిన 2015నాటి అమెరికా–ఇరాన్‌ అణుఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు కృషిచేయొచ్చు. పశి్చమదేశాలతో దోస్తీకి ప్రయతి్నంచవచ్చు. దీంతో ఆంక్షలు తొలగి, విదేశీ పెట్టుబడులు పెరిగి దేశారి్థకం బాగుపడే అవకాశముంది.

జలిలి గెలిస్తే? 
సయీద్‌ జలిలి గెలిస్తే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. దేశాభివృద్ధి కోసం పశి్చమదేశాలపై ఆధారపడాల్సిన పనిలేదని సుప్రీంలీడర్‌ ఖమేనీ అన్న మాటలనే జలిలి వల్లెవేస్తున్నారు. ‘‘ అసలు ఇరాన్‌పై ఎందుకు ఆంక్షలు విధించాం? అని పశి్చమ దేశాలే బాధపడాలి. ఆంక్షలను సైతం మనం అవకాశంగా మలచుకోవాలి’ అన్న జలిలి మాటలు చూస్తుంటే ఈయన గెలిస్తే దేశంలో మతచాంధస పాలనను కొనసాగిస్తారని అర్థమవుతోంది.

స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే మార్గముందా? 
దేశ కీలక అంతర్గత వ్యవహారాలు అన్నీ సుప్రీంలీడర్‌ ఖమేనీ కనుసన్నల్లో జరుగుతాయి. అలాంటపుడు అధ్యక్షుడిగా ఉండి కూడా మసూద్‌గానీ, జలిలిగానీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరా? అనేది భేతాళ ప్రశ్నగా మిగిలిపోనుందని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే విదేశీవ్యవహారాల్లో అధ్యక్షుడు, మంత్రివర్గం నిర్ణయాలే ఎక్కువగా చెల్లుబాటు అవుతాయని తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాలతో శతృత్వం విషయం పక్కనబెడితే ఇతర పశి్చమ దేశాలతో మైత్రికి నూతన అధ్యక్షుడు ప్రయతి్నస్తే దేశంలో ప్రగతి సాధ్యమే. మసూద్‌ అధ్యక్షుడైతే ఈ మార్పుకు బాటలు పడొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ‘మార్పు’కు ఖమేనీ ఒప్పుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement