ఇరాన్ అధ్యక్షునిగా సంస్కరణవాది పెజెష్కియాన్
అతివాద జలిలిపై ఘనవిజయం
ఖమేనీకి మింగుడుపడని ఫలితం
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాదులదే పైచేయి అయింది. కరడుగట్టిన మతవాది సయీద్ జలిలిపై మితవాది, సంస్కరణాభిలాషి మసూద్ పెజెష్కియాన్ ఘనవిజయం సాధించారు. జూన్ 28న జరిగిన తొలి విడత ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థుల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు. దాంతో విజేతను తేల్చేందుకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జలిలి, పెజెష్కియాన్ మధ్య శుక్రవారం తిరిగి ఎన్నిక అనివార్యమైంది.
శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. పోలైన దాదాపు 3 కోట్ల ఓట్లలో పెజెష్కియాన్‌కు 1.64 కోట్లు వచ్చాయి. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అనుచరునిగా పేరుబడ్డ జలిలి 1.35 కోట్ల ఓట్లు మాత్రమే సాధించారు. దేశ తొమ్మిదో అధ్యక్షునిగా పెజెష్కియాన్ ఎన్నికైనట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌పై దశాబ్దాలుగా ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్న మతవాద కూటమికి ఈ ఫలితాలు గట్టి షాకివ్వడమే గాక సంస్కరణవాదుల్లో జోష్ నింపాయి.
నిజానికి ఈసారి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియనే బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ప్రజలు శుక్రవారం రాత్రి దాకా జరిగిన ఓటింగ్‌లో అనూహ్యంగా భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. దాంతో 53 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. తద్వారా ఖమేనీ ఏకపక్ష పోకడలపై ప్రజలు స్పష్టమైన వ్యతిరేకత వ్యక్తం చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఫలితాల వెల్లడి మొదలవుతూనే రాజధాని టెహ్రాన్, పశి్చమ ఇరాన్‌లోని పెజెష్కియాన్ సొంత నగరం తబ్రీజ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు, అభిమానులు భారీగా వీధుల్లోకి వచ్చి డ్యాన్సుల సంబరాలు చేసుకున్నారు. దేశాన్ని కాపాడేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో బూత్‌లకు తరలారంటూ నినాదాలు చేశారు. పెజెష్కియాన్ ఎన్నికల నినాదమైన ‘సేవ్ ఇరాన్’ సందేశాలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది.
దేశంలో మెజారిటీలపై మైనారిటీల పెత్తనానికి మొత్తానికి తెర పడ్డట్టేనంటూ సంస్కరణవాదులు సంబరపడుతున్నారు. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మేలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల ఫలితాలను ఖమేనీ లాంఛనంగా ఆమోదముద్ర వేశాక 30 రోజుల్లో పెజెష్కియాన్ బాధ్యతలు స్వీకరిస్తారు. నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు.
పోలింగ్ శాతం పెరగడం వెనక...
→ నిజానికి ఏళ్లుగా తామెదుర్కొంటున్న పలు కీలక సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఇరానీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
→ ఖమేనీ యంత్రాంగం తీరుకు నిరసనగా ఈసారి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మూకుమ్మడిగా బహిష్కరించారు. దాంతో తొలి రౌండ్‌లో దేశ చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 40 శాతం పోలింగ్ నమోదైంది.
→ అత్యంత మితవాదిగా పేరొందిన పెజెష్కియాన్ అనూహ్యంగా తుది పోరులో బరిలో నిలవడంతో ఆయనకు మద్దతుగా వారంతా భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు తరలారు.
→ పోలింగ్‌కు ముందు నుంచీ పెజెష్కియాన్ ప్రచార సరళికి, ‘సేవ్ ఇరాన్’ నినాదానికి దేశ యువత బాగా ఆకర్షితులయ్యారు. దాంతో ఆయన ర్యాలీలకు, సభలకు జనం పోటెత్తారు.
→ ఇస్లామిక్ పాలనకు తెర పడాల్సిందేనని యువతతో పాటు విద్యావంతులు కూడా తొలిసారిగా బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కరడుగట్టిన మతవాది అయిన జలిలి ఇరాన్‌ను ఎప్పటికీ ఏకం చేయలేరని మైకుల సాక్షిగా చెప్పుకొచ్చారు.
→ జలిలిని ఓడించడం ద్వారా నిరంకుశ మతవాద పాలనకు వ్యతిరేకంగా ఇరానీలు స్పష్టమైన తీర్పు వెలువరించారు.
→ ఖమేనీ మతవాద పాలన, హిజాబ్‌ను తప్పనిసరి వంటి కఠినతరమైన సామాజిక నిబంధనలు, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను ఎత్తేసేలా అంతర్జాతీయ సమాజంతో చర్చలకు ముందుకు రాని పోకడలపైనా ప్రజలు తమ వ్యతిరేకతను ఓటు రూపంలో స్పష్టంగా వ్యక్తం చేశారంటున్నారు.
హార్ట్ సర్జన్‌పై ఆశలెన్నో...!
69 ఏళ్ల పెజెష్కియాన్‌కు హార్ట్ సర్జన్‌గా దేశవ్యాప్తంగా అపారమైన పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆయన ఇరాక్–ఇరాన్ యుద్ధంలో పాల్గొన్న వార్ వెటరన్ కూడా. 16 ఏళ్లుగా పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా, నాలుగేళ్ల పాటు ఆరోగ్య మంత్రిగా కూడా చేశారు. ఆయన భార్య కారు ప్రమాదంలో చనిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ పేరెంట్‌గా పిల్లలను అన్నీ తానై పెంచారు.
మతపరమైన మైనారిటీ అయిన అజెరీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం ఈ ఎన్నికల్లో పెజెష్కియాన్‌కు మరింత కలిసొచి్చంది. ప్రచారం పొడవునా కూతురిని వెంట ఉంచుకోవడం ద్వారా మహిళలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. దాంతో పార్టీలకు అతీతంగా ప్రజలు ఆయనకు భారీగా ఓటేశారు.
సవాళ్ల స్వాగతం...
లెక్కలేనన్ని సమస్యలు పెజెష్కియాన్‌కు స్వాగతం పలుకుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయంగా ఉంది. ఇరుగుపొరుగుతో సంబంధాలు దారుణంగా దిగజారాయి. యెమన్, లెబనాన్ గుండా ఇజ్రాయెల్‌పై సాయుధ పోరుకు ఇరాన్ అన్నివిధాలా సాయపడుతూ అంతర్జాతీయ సమాజం నుంచి మరింత ఆగ్రహం చవిచూస్తోంది.
ఆ క్రమంలో గత ఫిబ్రవరిలో అమెరికాతో, అనంతరం ఏప్రిల్లో ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ముంగిటి దాకా వెళ్లొచి్చంది. ఈ రుగ్మతలకు పెజెష్కియాన్ ఎలాంటి వైద్యం చేస్తారో చూడాలి. అయితే ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నట్టు ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. దేశ ప్రగతి కోసం ప్రత్యర్థులతో కూడా కలిసి పని చేస్తానని ఫలితాల అనంతరం ప్రకటించారు. ‘‘ఎన్నికలు ముగిశాయి. ఇది మనమంతా సహకరించుకుంటూ ముందుకు సాగాల్సిన సమయం.
నేను మిమ్మల్ని ఏకాకులను చేయను. మీరూ నన్ను ఏకాకిని చేయొద్దు’’ అంటూ పిలుపునిచ్చారు. తద్వారా అందరినీ కలుపుకుని పోతానంటూ అతివాద వర్గానికి స్పష్టమైన సందేశమిచ్చారు. అదే సమయంలో, ‘ఇరాన్ ఇరానీలందరిదీ’ అంటూ పునరుద్ఘాటించడం ద్వారా ప్రజల సంక్షేమానికే ప్రథమ తాంబూలమని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు సర్వం సహా చక్రవర్తి అయిన ఖమేనీతో అధ్యక్షునిగా ఆయన సంబంధాలు ఏ మేరకు సజావుగా సాగుతాయన్నది ఆసక్తికరం.
ప్రజల తీర్పును అంగీకరిస్తున్నా. దేశ ప్రగతి కోసం పెజెష్కియాన్‌కు మనమంతా దన్నుగా నిలవాల్సిన అవసరముంది.
– ఫలితాల అనంతరం సయీద్ జలిలి
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment