ఛాందసవాదానికి ఛీత్కారం
ఈసారి ఇరాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నిక అందరినీ కలవరపెట్టింది. దేశ పౌరులు ఛాందసవాదం వైపు మొగ్గు చూపుతారేమోనన్న ఆందోళన ఏర్పడింది. కానీ అందరి అంచనాలకూ భిన్నంగా ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. పోలైన ఓట్లలో రౌహానికి 57 శాతం ఓట్లు లభిస్తే, ఆయన ప్రత్యర్థి, ఛాందసవాద ప్రతినిధి ఇబ్రహీం రెయిసీకి 38.5 శాతం వచ్చాయి. దేశ జనాభా 8 కోట్లు కాగా అందులో 5 కోట్ల 64 లక్షలమంది ఓటర్లు. సాధారణంగా ఇరాన్ పౌరులు మితవాదులు లేదా సంస్కరణవాదులవైపు మొగ్గు చూపుతారు.
పాలనా వ్యవస్థపైనా, అంతర్గత భద్రతపైనా ఛాందసవాదులకే పట్టున్నా, ఇరాన్ సమాజం మొగ్గు స్వేచ్ఛా స్వాతంత్య్రాలవైపే. నిజానికి ఈ ధోరణుల కారణంగానే ఛాందస వాదులు ఈ ప్రాంతంలో ఉన్న ఇతర దేశాల్లోని పాలకుల మాదిరి ఇష్టానుసారం వ్యవహరించలేకపోతున్నారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవంలో పాశ్చాత్య దేశాలకు అనుకూలంగా ఉండే షా ప్రభుత్వాన్ని గద్దె దించాక మతాచార్యులతో ఉండే గార్డియన్ కౌన్సిల్ హవా మొదలైంది. ఆ కౌన్సిల్‌కు మొదట్లో ఆయతుల్లా ఖొమైనీ నాయకత్వం వహించగా ఆయన మరణానంతరం ఖమేనీకి ఆ పీఠం దక్కింది.
దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరిగినా, పార్లమెంటు ఎన్నికలు జరిగినా... ఎవరు అధికా రానికొచ్చినా నిర్ణయాధికారమంతా గార్డియన్ కౌన్సిల్ గుప్పెట్లోనే ఉంటుంది. అసలు అధ్యక్ష పీఠానికి ఎవరు పోటీ చేయాలో నిర్ణయించేది కూడా వారే. ఈసారి 1,200మంది అభ్యర్థులు పోటీ పడగా కౌన్సిల్ రౌహానీతోపాటు ఆరుగురిని ఎంపిక చేసింది. తమ అభీష్టానికి భిన్నంగా అమెరికా తదితర దేశాలతో అణు ఒప్పందం కుదుర్చుకున్న రౌహానీ గెలవకూడదని మతాచార్యులు గాఢంగా కోరుకున్నారు. కానీ ఇరాన్ ప్రజానీకం వారి ఆశలను వమ్ము చేసింది. ఇందుకు వారిని అభినందించాలి.
గార్డియన్ కౌన్సిల్ విధించే పరిమితుల్లోనే దేశాధ్యక్షుడు మెరుగైన పాలన అందించాల్సి ఉంటుంది. మౌలిక మార్పులు తీసుకురావడం దాదాపు అసాధ్యం. ఆ పరిమితులకు లోబడే రౌహానీ అణు ఒప్పందానికి రాగలిగారు. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమాజం ఆయనకు అండగా నిల బడటం వల్ల ఇది సాధ్యమైంది. అయితే, రౌహానీ గెలుపుపై అపనమ్మకం ఏర్పడటా నికి రెండు కారణాలున్నాయి. ఆయన నాలుగేళ్ల పాలన సంస్కరణలు కోరుకున్న వారికి పెద్దగా సంతృప్తినీయలేదు. రౌహానీ గెలిస్తే దేశంలో ప్రజాస్వామిక ధోరణు లకు కాస్తయినా ఊతం లభిస్తుందని ఎదురుచూసినవారికి నిరాశే మిగిలింది.
ఛాంద సవాదులను బలంగా వ్యతిరేకించిన సామాజిక కార్యకర్తలు, బ్లాగర్లు ఇంకా కట కటాల వెనకే మగ్గుతున్నారు. దీనికితోడు దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేద రికం అధికం. అణు ఒప్పందం తర్వాత యూరప్ దేశాలకు చమురు ఎగుమ తులు మొదలై పరిస్థితి మెరుగవుతున్న సూచనలు కనిపిస్తున్నా అది మందకొడిగా సాగు తోంది. అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మళ్లీ కత్తులు నూరుతుం డటంతో పాశ్చాత్య దేశాల్లో అయోమయ స్థితి ఏర్పడింది. ఇరాన్‌పై అపనమ్మకంతో పాటు మళ్లీ అమెరికా పాత విధానాలవైపు మొగ్గు చూపితే తమ గతేమిటని చాలా సంస్థలు భావిస్తున్నాయి.
ఛాందసవాద ప్రతినిధిగా బరిలోకి దిగిన ఇబ్రహీం రెయిసీ స్వయానా గార్డియన్ కౌన్సిల్ సభ్యుడు. ఆయనకు ఖమేనీ అండదండలున్నాయన్నది బహిరంగ రహస్యం. ఖమేనీ మునుపటిలా పాలనా వ్యవహారాలపై దృష్టి సారించలేకపోతున్నారని, అనారోగ్యం కారణంగా త్వరలోనే ఆయన నిష్క్రమించక తప్పదని వార్తలొస్తు న్నాయి. ఆయనకంటూ బలమైన వారసుడెవరూ లేరు. ఖమేనీ స్థానంలో తాత్కాలి కంగా ముగ్గురు సభ్యుల పాలనా సంఘం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెయిసీని అధ్యక్షుణ్ణి చేస్తే పగ్గాలు తమ చేతుల్లోనే ఉంటాయని ఛాంద సవాదులు భావించారు. రెయిసీ సైతం ఓటర్లకు వాగ్దానాలు ఎడాపెడా చేశారు. నిరుపేద వర్గాలకు అమలవుతున్న నగదు బదిలీని మరింత మెరుగ్గా అమలు చేస్తామన్నది అందులో ఒకటి.
ఛాందసవాద అధ్యక్షుడు అహ్మదినేజాద్ పాలనా సమయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశం ఆర్ధిక ఒడిదుడుకుల్లో ఉన్నది గనుక ఈ పథకానికి కోత పెట్టి అభివృద్ధి పనులకు ఆ నిధులను వెచ్చిస్తామని రౌహానీ ప్రకటించారు. నగదు బదిలీకింద ఇచ్చే మొత్తాన్ని మరింత పెంచుతామనే రెయిసీని కాదని రౌహానీకి నిరుపేద వర్గాలు ఎలా ఓటేస్తాయని మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందాయి. కానీ పాశ్చాత్య దేశాలతో సమర్ధవంతంగా చర్చలు జరిపి దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేసిన రౌహానీయే దేశ సమస్యల పరిష్కారానికి కృషి చేయగలరని ఓటర్లు భావించారు.
అయితే రౌహానీ ముందున్న సవాళ్లు సామాన్యమైనవి కాదు. ట్రంప్ రాకతో అమెరికా ఆలోచనా ధోరణి పాత పద్ధతుల్లోకి మారిపోయింది. గతంలో మాదిరే అటు నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. రౌహానీ ఎన్నికైన మర్నాడే సౌదీలో అడుగుపెట్టిన ట్రంప్ ఇరాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని 50 ముస్లిం దేశాల నుంచి హాజరైన నేతలనుద్దేశించి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ఇరాన్ శత్రువుగా ఉన్న సౌదీతో ఆయన భారీయెత్తున ఆయుధ ఒప్పందం కుదుర్చు కున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకున్న ఇరాన్ కంటే నియం తృత్వ పాలన ఉండే సౌదీయే ట్రంప్‌కు నచ్చింది!
దానికితోడు ఈ ప్రాంతంలో టర్కీ మొదలుకొని సౌదీ వరకూ ప్రతి దేశమూ హద్దులుమీరుతోంది. ఇజ్రాయెల్ సరేసరి. ఐఎస్ ఉగ్రవాదుల వీరంగం అందరినీ కలవరపెడుతోంది. వీటన్నిటినుంచీ వచ్చే సవాళ్లను ఎదుర్కొనడంతోపాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి పెంచడం, మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరం. మధ్యతరగతికి మేలు చేసే విదేశీ పెట్టుబడులపైన మాత్రమే పూర్తిగా దృష్టి నిలిపితే కొన్ని పాశ్చాత్య దేశాల తరహాలోనే నిరుపేదలు ఛాందసవాదంవైపు మొగ్గు చూపుతారు. అప్పుడు ఇరాన్ లోనూ ట్రంప్, లీపెన్ లాంటి నేతలు పుట్టుకొస్తారు. ఆ ప్రమాదాన్ని నివారిస్తేనే రౌహాని నిజమైన విజేత అవుతారు.