రెండో దశ పోలింగ్.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. నేడు పోలింగ్ జరగనున్న ఆరు జిల్లాల్లో నిషేధిత మావోయిస్టు పార్టీకి గట్టి పట్టుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ప్రస్తుతం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలుస్తున్నది.
కైమూర్, రోహ్ తాస్, అర్వాల్, జహనాబాద్, ఔరంగాబాద్, గయా జిల్లాల్లోని మొత్తం 32 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన 456 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు కావడంతో 11 నియోజకవర్గాల్లో సాయంత్ర 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ నిలిపివేయనున్నట్లు అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆర్. లక్ష్మణణ్ తెలిపారు. మరో 12 నియోజకవర్గాల్లో సాయంత్ర 4 గంటల వరకు, కేవలం 9 నియోజవర్గాల్లో మాత్రమే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. మొత్తం 86, 13, 870 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు 9, 119 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి.
10 జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో ఈ నెల 12 న జరిగిన మొదటి దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మూడో దశ 28న, నాలుగో దశ నవంబర్ 1న, ఐదో దశ నవంబర్ 5న పోలింగ్ జరగనుంది.