రెండోదశలో 55% పోలింగ్‌బిహార్
ఎన్నికలు ప్రశాంతం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శుక్రవారం జరిగిన రెండోదశలో 55 శాతం పోలింగ్ నమోదైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఆరు జిల్లాల్లోని 32 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ఒకటి, రెండు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రెండోదశలో మహిళా ఓటర్లే అధికంగా పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారని ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. మహిళల్లో 57.5 శాతం మంది పోలింగ్‌లో పాల్గొనగా... పురుషుల్లో 52.5 శాతం మంది ఓట్లేశారని ఆయన చెప్పారు.
గయ జిల్లాలోని ఇమామ్‌గంజ్ నియోజకవర్గ పరిధిలో రెండు బాంబులను సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గుర్తించి నిర్వీర్యం చేశారని ఎన్నికల అధికారి తెలిపారు. రెండోదశలో కైమూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 57.86 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా ఔరంగాబాద్‌లో 52.5 శాతం పోలింగ్ జరిగింది. ఇమామ్‌గంజ్ నియోజకవర్గం నుంచి స్పీకర్ చౌదరీతో తలపడుతున్న మాంఝీ శుక్రవారం ఓటేశారు.
ఎన్డీఏ గెలుపు అభివృద్ధికి ఊతం:
బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏకి అనుకూలంగా తీర్పిస్తే అభివృద్ధికి ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఎన్డీఏ గెలిస్తే రాజ్యసభలో బలం పెరిగి కీలక బిల్లుల ఆమోదం సాధ్యమవుతుందని, దేశ అభివృద్ధిలో ముందుకు సాతుందని శుక్రవారమిక్కడ విలేకర్లతో పేర్కొన్నారు. కాగా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుడి చేతిపై ఫ్యాన్ పడటంతో స్వల్పంగా గాయపడ్డారు. తూర్పు చంపారన్ల్ లో ఎన్నికల సభా వేదికపై టీ తాగుతుండగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
మహాకూటమికి స్వల్ప ఆధిక్యం!
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిపై.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహాకూటమి స్వల్ప ఆధిక్యం చూపే అవకాశముందని ఇండియా టుడే-సిసిరో గ్రూపు తాజా సర్వేలో తేలింది. తొలిదశ ఎన్నికలు జరిగిన ఈ నెల 12కు కొన్ని రోజుల ముందు ఈ గ్రూపు నిర్వహించిన రెండో సర్వేలో మొత్తం 243 సీట్లకు గాను మహాకూటమికి 122 సీట్లు, ఎన్డీఏకు 111 సీట్లు దక్కొచ్చని వెల్లడైంది.
అయితే ఇదే గ్రూపు నెల కిందట నిర్వహించిన తొలి సర్వేలో ఎన్డీఏకు 125, మహాకూటమికి 106 సీట్లు వస్తాయని తేలడం గమనార్హం. తొలి సర్వేలో యువ ఓటర్లలో 46 శాతం మంది బీజేపీపై మొగ్గు చూపగా రెండో సర్వేలో వారి శాతం 36కు పడిపోయింది. తొలి సర్వేలో సీఎం పదవికి నితీశ్‌పై 28 శాతం మంది, రెండో సర్వేలో 38 శాతం మొగ్గుచూపారు.