
అగ్రవర్ణ పేదల కోటా అమలుకు సిద్ధమన్న నితీష్
పట్నా : అగ్రవర్ణ పేదలకు జనరల్ కోటాలో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అవసరమైన న్యాయ సలహా తీసుకుంటున్నామని, త్వరలోనే దీని అమలుకు పూనుకుంటామని బిహార్ సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. అగ్రవర్ణ పేదలకు జనరల్ కోటాలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యాంగ సవరణను చేపట్టిన సంగతి తెలిసిందే.
అత్యంత వెనుకబడిన కులాల వారికి జాతీయ స్దాయిలో ప్రత్యేక రిజర్వేషన్‌ను కల్పించాలని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. కాగా తమ పార్టీ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకమని ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. బిహార్‌లో ఇటీవల చోటుచేసుకున్న మూక హత్యలను ప్రస్తావిస్తూ ఇవి శాంతి భద్రతల సమస్యకు సంబంధించినవి కావని, వీటిని నియంత్రించేందుకు సామాజిక చైతన్యం పెరిగేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు.