
ఇదో 'నకిలీ' రాజకీయ దగా..
ప్రస్తుత విధానాలకు కాస్త అడ్వాన్స్డ్ వెర్షన్ గా.. సరికొత్త తరహాలో ఓటర్లను దగా చేయడానికి పూనుకున్నారు గుర్తుతెలియని బిహార్ నేతలు.
ఎన్నికల హడావిడి మొదలైన దగ్గర నుంచి ఓటర్లు పోలింగ్ ప్రక్రియ ముగిసేంతవరకు రకరకాల స్థాయిల్లో నగదు పట్టుబడుతూ ఉండటం తెలిసిందే. ఈవీఎంపై మీట నొక్కేంతవరకు ఆయా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమూ విన్నదే. ఈ రెండు విధానాలకు కాస్త అడ్వాన్స్డ్ వెర్షన్ గా.. ఓటర్లను దగా చేయడానికి పూనుకున్నారు గుర్తు తెలియని బిహార్ నేతలు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి పక్కా ఆధారాలు కూడా లభించాయి.
ఐదంచెల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వేల కోట్ల డబ్బు చేతులు మారి ఉంటుందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులకు చిక్కింది మాత్రం రూ.19.72 కోట్లే. ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. ఆ 19.72 కోట్లలో భారీగా నకిలీ నోట్ల కట్టలున్నాయి. నకిలీ నోట్లేకాక, దాదాపు రూ. 70 లక్షలు విలువగల నేపాల్ కరెన్సీ, మరో 70 లక్షల విదేశీ కరెన్సీ కూడా ఉండటం ఎన్నికల అధికారులను కలవరపాటుకు గురి చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను నకిలీ కరెన్సీని అంటగట్టి, ప్రయోజనం పొందేందుకు కొన్ని రాజకీయపార్టీలు ఎత్తుగడలు వేసినట్లు తెలిసింది. కేవలం ఓటు వేసేందుకు వచ్చే ఎన్నారైలను ప్రలోభపెట్టేందుకే విదేశీ కరెన్సీని తెచ్చినట్లు అనుమానాలున్నాయి. ఇంత మొత్తంలో నకిలీ, విదేశీ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా హవాలా కోణంలో కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటివరకు ఎన్నికల్లో నల్లధనం మాత్రమే పంపిణీ అవుతుండగా, ఇప్పుడు నకిలీ నోట్లతోనూ ప్రజాస్వామ్య ప్రక్రియకు చీడపట్టిస్తున్నాయి రాజకీయపార్టీలు!