
జ్యోతిష్కుడితో భవిష్యత్తు చెప్పించుకున్న మోదీ!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రముఖ జోతిష్యుడు బెజాన్ దరువాలాను కలిసినట్టు వెలుగుచూడడం బీజేపీని తీవ్ర ఇరకాటంలో పడేసింది.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రముఖ జ్యోతిష్కుడు బెజాన్ దరువాలాను కలిసినట్టు వెలుగుచూడడం బీజేపీని తీవ్ర ఇరకాటంలో పడేసింది. గతంలో ఓసారి మోదీ తనను కలిశారని, ఆయన చేతుల్లో దేశ భవిష్యత్తు, ప్రగతి ఎలా ఉంటుందో తాను జోస్యం చెప్పానని దరువాలా ఆదివారం తెలిపారు. జోస్యం చెప్పించుకునేందుకు మోదీ తన చేతిని ఆయనకు చూపిస్తున్న ఫొటోలను కొన్ని మీడియా చానెళ్లు ప్రసారం చేశాయి.
మోదీ జ్యోతిష్కుడిని కలువడం వివాదాస్పదమయ్యే అవకాశం కనిపిస్తున్నది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఓ తాంత్రికుడిని కలిసిన వీడియోను బీజేపీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. బిహార్ ఎన్నికల ప్రచారంలో ఈ విషయమై ప్రధాని మోదీ నితీశ్‌పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే నితీశ్ తాంత్రికుడిని కలిశారని దుయ్యబట్టారు. బిహార్‌కు తాంత్రికులు-మాంత్రికులు అవసరం లేదని పేర్కొన్నారు. 18వ శతాబ్దపు దృక్పథమున్న ఈ నేతలతో బిహార్ అభివృద్ధి చెందుతుందా? అని మోదీ ప్రశ్నించారు.