కాశీకి పోదాము... అంటున్న సీఎం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ ఇద్దరూ కలిసి 'కాశీకి పోదాం' అనుకుంటున్నారట. యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి వారిద్దరూ వెళ్తుండటం విశేషం. మోదీ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించేందుకు లాలుప్రసాద్ ఈనెల 17న వారణాసి వస్తారని ఆర్జేడీ యూపీశాఖ అధ్యక్షుడు రామ్ చంద్ర పుర్వే తెలిపారు. త్వరలోనే లాలు పశ్చిమబెంగాల్ కూడా వెళ్తారని ఆయన చిన్నకొడుకు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ చెప్పారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కూడగట్టడమే ఆయన లక్ష్యమన్నారు.
త్వరలోనే బిహార్ సీఎం నితీష్ కుమార్ కూడా వారణాసి వెళ్లి, అక్కడ ర్యాలీ నిర్వహిస్తారని జేడీ(యూ) యూపీ అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ తెలిపారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా జేడీ(యూ) పోటీ చేస్తుందని ఆయన అన్నారు.