న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి ఖాళీ లేదని కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధినేత రామ్‌విలాశ్ పాశ్వాన్ తెలిపారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి ఖాళీ లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా పనిచేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలకే పరిమితం కావడానికి గల కారణాలపై రాహుల్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని మోదీ చెప్పలేదు.
కోర్టు తీర్పుకోసం వేచి ఉండాలనే చెప్పారు. దేశంలో 18,000 గ్రామాలను నిర్ణీత గడువులోగా విద్యుదీకరణ చేశాం. అలాగే గడువులోపలే మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తిచేశాం. ఇండియన్ జ్యుడీషియల్ సర్వీసెస్‌ను కేంద్రం తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తోంది. ఈ మాట పార్లమెంటులో చెప్పాను కాబట్టి సరిపోయింది కానీ బయట చెప్పిఉంటే కోర్టు ధిక్కారం అయ్యేది. కోలీజియం వ్యవస్థలో సైతం పారదర్శకత లేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భర్తీలాగే జడ్జీల నియామకంలోనూ పారదర్శకత రావాలి’ అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment