అలా అమ్మితే.. ఇక జైలుకే
మామూలు దుకాణాల్లో తప్ప బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, థియేటర్లు.. ఇలా ఎక్కడకు వెళ్లినా వాటర్ బాటిళ్ల దగ్గర నుంచి కూల్ డ్రింకుల వరకు ఏవీ ఎంఆర్‌పీ ధరకు అమ్మరు. దానికంటే ఎంతో కొంత ఎక్కువ ధర పెడితే తప్ప దాహం తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ, ఇక ముందు ఇలా అమ్మితే భారీ జరిమానాతో పాటు జైలుకు కూడా పంపుతామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఎక్కడ చూసినా మంచినీళ్ల బాటిళ్లను గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పి) కంటే 10-20 శాతం అధిక ధరలకు అమ్ముతున్నారని పాశ్వాన్ అన్నారు. అసలు కొన్ని బాటిళ్ల మీద అయితే దాని ధర ఎంతో కూడా ముద్రించడం లేదని మండిపడ్డారు. 47వ ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తూనికలు కొలతల చట్టంలోని సెక్షన్ 36 ప్రకారం.. ముందుగానే ప్యాక్ చేసిన వస్తువులో ప్రమాణాలు దాని మీద పేర్కొన్నట్లు లేకపోతే.. రూ. 25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. రెండోసారి కూడా అలాంటి నేరం చేస్తే.. విధించే జరిమానాను ఇప్పుడు రూ. 50 వేలకు పెంచుతున్నారు. ఇంకా పదే పదే అలాగే చేస్తుంటే లక్ష రూపాయల వరకు జరిమానా, లేదా ఏడాది జైలుశిక్ష లేదా రెండూ కూడా విధిస్తారు. 2009 నుంచే ఈ చట్టం అమలులోకి వచ్చినా.. దాని గురించిన పరిజ్ఞానం పౌరులకు పెద్దగా లేదు. ఎంఆర్‌పి కూడా లేబుల్ మీద ముద్రించే ఉంటుంది కాబట్టి దాన్ని ఉల్లంఘించినా కూడా జైలుశిక్ష, జరిమానా విధిస్తారని పాశ్వాన్ ఈ సందర్భంగా చెప్పారు. వినియోగదారులు అవగాహన పెంచుకుని ఫిర్యాదులు చేయాలని, ఫిర్యాదు అన్నదే లేకపోతే చర్యలు ఎలా తీసుకుంటామని ఆయన అడిగారు. ఈ విషయంలో 2007లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. గత ఫిబ్రవరి నెలలో ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్సులో నీళ్ల బాటిల్‌ను ఎంఆర్‌పి కంటే ఎక్కువ ధరకు అమ్మినందుకు జాతీయ వినియోగదారుల కమిషన్ రూ. 5 లక్షల జరిమానా విధించింది.