
పట్నా : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నాకొద్దీ బిహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కావడంతో సీట్ల పంపకాలపై చర్చలు షూరు అయ్యాయి. విపక్షాలైన కాంగ్రెస్-ఆర్జేడీ ఇదివరకే ఓ అవగాహన కుదుర్చుకోగా.. ఆ కూటమిలో మరికొన్ని పార్టీలు వచ్చిచేరే అవకాశం ఉంది. ఇక అధికార ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. బీజేపీ-జేడీయూ మధ్య చర్చలు సానుకూలంగా ఉన్నా.. కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని మూడో భాగస్వామ్యపక్షం లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)తో అసలు చిక్కొచ్చి పడుతోంది. జేడీయూ ప్రతిపాదిస్తున్న 50-50 ఫార్మాలాను తమకు వర్తింపచేయాలని పట్టుపడుతోంది. లేదంటే తమదారి తాము చేసుకుంటామని సవాలు విసురుతోంది. ఎల్‌జేపీ డిమాండ్స్‌పై అధికార జేడీయూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మీరు తమ కూటమిలో లేనేలేరని తాము భావిస్తున్నామని తేల్చిచెబుతోంది. ఈ నేపథ్యంలో ఎల్‌జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆదివారం ఓ లేఖరాశారు. (ఎన్నికల నగారా మోగింది.. ఇక సమరమే)
సీట్ల పంపకాలపై నాన్చుడు ధోరణి ఇక సాగదని, తమకు ఇచ్చేందేంటో వెంటనే చెప్పాలని ఆ లేఖలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. జేడీయూ తీరుతో తమ నాయకులు, కార్యకర్తలు విసిగిపోయారని భవిష్యత్‌లోనూ ఇలాగే కొనసాగితే కూటమిలో ప్రసక్తేలేదని వాపోయినట్లు సమచారం. తమనక నష్టం జరుగున్న కూటమిలో తాము ఇక ఉండలేని చెప్పిట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తమకు అపారమైన నమ్మకం, విశ్వాసం ఉందని చిరాక్ లేఖలో స్పష్టం చేశారు. ఇక ఇదే లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సైతం పంపించారు. కాగా మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ఇదివరకే విడుదలైన విషయం తెలిసిందే. ముడు విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు అక్టోబర్ 28న తొలివిడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3న రెండో విడత, మూడో విడత నవంబర్ 7న జరుగనుంది. నవంబర్ 10 ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. (వరుస ఎదురు దెబ్బలు: ఎన్డీయే విచ్ఛిన్నం..!)
Comments
Please login to add a commentAdd a comment