న్యూఢిల్లీ: బిస్కెట్ ప్యాకెట్‌పై బరువు ఎంత ఉందని చూస్తే.. 88 గ్రాములుగా కనిపిస్తుంది. అదే గోధుమ పిండి ప్యాకెట్ 3.5 కేజీలతో ఉంటుంది. ఈ తరహా అనుభవాలు వినియోగదారులకు సర్వ సాధారణం. ఉత్పత్తుల విక్రయంలో వివిధ కంపెనీల మధ్య ఏకరూపత కనిపించదు. దీనివల్ల ధరలను పోల్చుకోవడం వినియోగదారులకు సాధ్యపడదు. అందుకనే కంపెనీలు వ్యూహాత్మకంగా నిత్యావసరాల ప్యాకేజీ ఉత్పత్తులపై అంకెల ట్రిక్కులను అనుసరిస్తుంటాయి. కానీ, ఇకపై ఇవి కుదరవు. ప్రతీ ప్యాకెట్‌పై గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ) ఉండాల్సిందే. అలాగే, యూనిట్ ధర ఎంతన్నదీ ముద్రించాల్సి ఉంటుంది. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీలు) నిబంధనలు, 2011కు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ సవరణలు తీసుకొచ్చింది. వచ్చే ఏప్రిల్ నుంచి ఇవి అమల్లోకి రానున్నట్టు సంబంధిత శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ధరలు ఇలా ముద్రించాలి..
కిలోకు మించిన బరువుతో ఉండే ప్యాకెట్లపై ఎంఆర్‌పీతోపాటు. ఒక కిలో ధర ఎంతన్నదీ ముద్రించాలి. కిలో కంటే తక్కువ బరువుతో ఉండే ఉత్పత్తులపై ఎంఆర్‌పీతోపాటు.. ఒక గ్రాము ధర ఎంతన్నదీ ప్రచురించాలి.
ఏ పరిమాణంలో అయినా సరే..
షెడ్యూల్2 రద్దు కానుంది. కంపెనీలు 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, ఒక కిలో, 1.25 కిలో, 1.5 కిలో, 1.75 కిలో, 2 కిలోలు, 5కిలోల పరిమాణాల్లోనే 19 రకాల కమోడిటీలను విక్రయించాలని షెడ్యూల్2 నిర్ధేశిస్తోంది. వీటికి భిన్నమైన పరిమాణాల్లో విక్రయించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్ని కంపెనీలు అనుమతులు పొందడం లేదని గుర్తించడంతో.. కంపెనీలకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో షెడ్యూల్ 2ను రద్దు చేస్తూ సవరణ తీసుకొచ్చారు.
రూపాయిల్లో పేర్కొంటే చాలు..
ప్రస్తుతం ఉత్పత్తులపై ఎంఆర్‌పీని పైసలతోపాటు పేర్కొనాల్సి ఉండగా.. ఇకమీదట రూపీల్లో పేర్కొంటే సరిపోతుందని నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చారు. అలాగే, ప్యాకెట్‌పై నంబర్లలో లేదా యూనిట్‌లో పరిమాణాన్ని పేర్కొంటే సరిపోతుంది. లేదంటే ఎన్ని పీసులు, ఎన్ని సెట్లు ఉన్నాయో కూడా పేర్కొనవచ్చు. ఇక దిగుమతి చేసుకునే కమోడిటీలపై ప్రస్తుతం కంపెనీలు దిగుమతి తేదీ లేదా తయారీ తేదీ లేదా తిరిగి ప్యాకేజీ చేసిన తేదీని పేర్కొనే ఆప్షన్ కలిగి ఉన్నాయి. దీని స్థానంలో ఇక మీదట తయారీ తేదీ ఒక్కటే తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు తయారీతేదీ ఒక్కటే ప్రామాణికం కనుక ఈ మార్పును తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment