legal metrology
-
ప్యాకేజ్డ్ కమోడిటీ: అంకెల మాయాజాలానికి చెక్
న్యూఢిల్లీ: బిస్కెట్ ప్యాకెట్‌పై బరువు ఎంత ఉందని చూస్తే.. 88 గ్రాములుగా కనిపిస్తుంది. అదే గోధుమ పిండి ప్యాకెట్ 3.5 కేజీలతో ఉంటుంది. ఈ తరహా అనుభవాలు వినియోగదారులకు సర్వ సాధారణం. ఉత్పత్తుల విక్రయంలో వివిధ కంపెనీల మధ్య ఏకరూపత కనిపించదు. దీనివల్ల ధరలను పోల్చుకోవడం వినియోగదారులకు సాధ్యపడదు. అందుకనే కంపెనీలు వ్యూహాత్మకంగా నిత్యావసరాల ప్యాకేజీ ఉత్పత్తులపై అంకెల ట్రిక్కులను అనుసరిస్తుంటాయి. కానీ, ఇకపై ఇవి కుదరవు. ప్రతీ ప్యాకెట్‌పై గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) ఉండాల్సిందే. అలాగే, యూనిట్ ధర ఎంతన్నదీ ముద్రించాల్సి ఉంటుంది. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీలు) నిబంధనలు, 2011కు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ సవరణలు తీసుకొచ్చింది. వచ్చే ఏప్రిల్ నుంచి ఇవి అమల్లోకి రానున్నట్టు సంబంధిత శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ధరలు ఇలా ముద్రించాలి.. కిలోకు మించిన బరువుతో ఉండే ప్యాకెట్లపై ఎంఆర్పీతోపాటు. ఒక కిలో ధర ఎంతన్నదీ ముద్రించాలి. కిలో కంటే తక్కువ బరువుతో ఉండే ఉత్పత్తులపై ఎంఆర్పీతోపాటు.. ఒక గ్రాము ధర ఎంతన్నదీ ప్రచురించాలి. ఏ పరిమాణంలో అయినా సరే.. షెడ్యూల్2 రద్దు కానుంది. కంపెనీలు 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, ఒక కిలో, 1.25 కిలో, 1.5 కిలో, 1.75 కిలో, 2 కిలోలు, 5కిలోల పరిమాణాల్లోనే 19 రకాల కమోడిటీలను విక్రయించాలని షెడ్యూల్2 నిర్ధేశిస్తోంది. వీటికి భిన్నమైన పరిమాణాల్లో విక్రయించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్ని కంపెనీలు అనుమతులు పొందడం లేదని గుర్తించడంతో.. కంపెనీలకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో షెడ్యూల్ 2ను రద్దు చేస్తూ సవరణ తీసుకొచ్చారు. రూపాయిల్లో పేర్కొంటే చాలు.. ప్రస్తుతం ఉత్పత్తులపై ఎంఆర్పీని పైసలతోపాటు పేర్కొనాల్సి ఉండగా.. ఇకమీదట రూపీల్లో పేర్కొంటే సరిపోతుందని నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చారు. అలాగే, ప్యాకెట్‌పై నంబర్లలో లేదా యూనిట్లో పరిమాణాన్ని పేర్కొంటే సరిపోతుంది. లేదంటే ఎన్ని పీసులు, ఎన్ని సెట్లు ఉన్నాయో కూడా పేర్కొనవచ్చు. ఇక దిగుమతి చేసుకునే కమోడిటీలపై ప్రస్తుతం కంపెనీలు దిగుమతి తేదీ లేదా తయారీ తేదీ లేదా తిరిగి ప్యాకేజీ చేసిన తేదీని పేర్కొనే ఆప్షన్ కలిగి ఉన్నాయి. దీని స్థానంలో ఇక మీదట తయారీ తేదీ ఒక్కటే తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు తయారీతేదీ ఒక్కటే ప్రామాణికం కనుక ఈ మార్పును తీసుకొచ్చారు. -
జప్తు చేసిన సామగ్రి మాయం..
కంచే చేను మేయడం అంటే ఇదే కావొచ్చు. తనిఖీల్లో జప్తు చేసిన తూనికలు, కొలతల సామగ్రిని భద్రంగా దాచాల్సిన అధికారే అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు గతంలో పనిచేసి న జిల్లాల్లోనూ పలు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పెద్దసంఖ్యలో బాధితులు ముందుకొస్తుండడంతోకొందరు ఏకంగా సదరు అధికారి అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. వరంగల్: వరంగల్ పోచమ్మమైదాన్‌లో తూనికలు, కొలతల శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం ఉండేది. ఈ కార్యాలయ ఆవరణ, గదులు అన్నీ సక్రమంగా.. సరిపడా ఉన్నా ఎందుకో తెలియదు కానీ ఆ కార్యాలయాన్ని కొత్తవాడకు మార్చారు. ఈ సమయాన్నే కార్యాలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మూడు, నాలుగేళ్లుగాఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న ఇత్తడి కొలతల పావులు, టన్నుల కొద్ది బాట్లు(తూకం రాళ్లు), ఎలక్ట్రానిక్, మాన్యువల్ కాంటాలు పాత కార్యాలయంలోని రెండు గదుల్లో ఉండేవి. వీటితో పాటు కార్యాలయంలోని మోడల్ కుర్చీలు, ఫ్యాన్లను సైతం కార్యాలయం మార్చే సమయంలో రహస్యంగా అమ్ముకున్నట్లు పలువురు ప్రభుత్వానికి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అ«ధికారులు స్వాధీనం చేసుకున్న సమయంలో పూర్తి వివరాలను జప్తు రిజిస్టర్‌తో పాటు అసెట్స్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఇవన్నీ కొత్త కార్యాలయంలో లేవని, నమోదు చేసిన పుస్తకాలు సైతం మాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయానికి చెందిన వాహనాలను సైతం ఆర్టీఏ అ««ధికారులతో తక్కువ ధరగా నిర్ణయించి తన బినామీలతో టెండర్లలో కొనుగోలు చేయించారని సమాచారం. పైసలు ఇస్తేనే పని సదరు అధికారి వద్దకు ఏదైనా పని నిమిత్తం వెళ్లే క్రమంలో ఖాళీ చేతులతో వెళ్తే నిరాశే ఎదురవుతుందని చెబుతారు. వేలాది రూపాయలు ముడుపులు సమర్పించుకుంటే తప్ప కొత్త లైసెన్సులు, రెన్యూవల్స్ కాని పరిస్థితి కార్యాలయంలో నెలకొన్నట్లు సమాచారం. ఆయన పరిధిలోని కరీంనగర్ జోన్ జగిత్యాల జిల్లాలో లైసెన్సుల జారీకి సవాలక్ష కొర్రీలు పెట్టి నిరాకరించడంతో బాధితులు రాష్ట్ర కంట్రోలర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ చేయి తడిపిన తర్వాతే ఈ ఏడాదికి లైసెన్సు జారీ చేసినట్లు చెబుతుండడం అక్రమాల విషయంలో ఆయన పట్టింపునకు నిదర్శనంగా చెప్పొచ్చు. నిర్మల్ జిల్లాలో పనిచేసే ఆ శాఖ ఇన్స్పెక్టర్ ఒకరు రూ.60వేలు ప్రభుత్వ ఖజానాలో జనవరి వరకు జమ చేయలేదు. ఈ విషయమై పత్రికల్లో కథనాలు రావడంతో మార్చిలో ఆ డబ్బు ఖజానాకు చేరింది. అయితే, ఈ విషయాన్ని ఇక్కడ పనిచేసే ఉన్నతాధికారి కంట్రోలర్ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉండేందుకు పెద్దమొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. జిల్లా మారినా.. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఉన్నతాధికారి వరంగల్ రూరల్ అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై వచ్చారు. అయినప్పటికీ పాత గుర్తింపు కార్డును సదరు జిల్లా వ్యాపారుల వద్దకు సిబ్బంది ద్వారా పంపించి వసూళ్లకు పాల్పడుతారని తెలుస్తోంది. కాగా, తూనికలు, కొలతల్లో తేడా వచ్చినప్పుడు అధికారులు కేసు నమోదు చేసి వెంటనే జరిమానా కట్టించుకునే విధానం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. కానీ వరంగల్‌లోని ఈ ఉన్నతాధికారి మాత్రం జరిమానా తానే విధిస్తానని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి సదరు వ్యాపారులను బెదిరించి రూ.వేలల్లో తీసుకుంటారని సమాచారం. ఈ విషయమై పూర్తి ఆధారాలతో పలువురు బాధితులు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే సదరు ఉన్నతాధికారి బాగోతం బయటపడుతుందని వారు కోరుతున్నారు. -
‘కుదరకపోతే మాన్యువల్‌గా కూడా రేషన్’
సాక్షి, హైదరాబాద్: బయోమెట్రిక్ పనిచేయకపోతే మాన్యువల్‌గా లేదంటే ఐరిష్‌తో వినియోగదారులకు సరుకులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆగస్టు 15 తర్వాత ఈ విధానం అమలులోకి తీసుకువస్తామన్నారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అర్హులకు ఎప్పుడంటే అప్పుడు కార్డు అందించి సరుకులను ఇచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. కల్తీకి ఆస్కారం లేకుండా సన్న బియ్యం సరఫరా చేస్తామని ఉద్ఘాటించారు. లాభదాయకమైన శాఖ కాకపోయినప్పటికీ సమాజ సేవలో ముందుండే శాఖ సివిల్ సప్లై అని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏ ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం లేదంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ప్రతి కిలో వరి ధాన్యాన్ని కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూశామని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామినిచ్చారు. సివిల్ సప్లై కార్పొరేషన్ తో పాటు నాలుగు శాఖల రాష్ట్ర, జిల్లా అధికారుల సమావేశం నిర్వహించామని అన్నారు. ఇకపై ప్రతినెలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతికి తావులేకుండా చేసి సివిల్ సప్లై శాఖను గొప్ప సంస్థగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఎన్నో దాడులు నిర్వహించారనీ, కల్తీలకు ఆస్కారం లేకుండా చేసి ప్రజలకు నాణ్యమైన సరుకులు అందేలా చూస్తామన్నారు. -
‘రేషన్ డీలర్లు చేసేది సామజిక సేవే’
సాక్షి, హైదరాబాద్: ‘రేషన్ డీలర్లు సామజిక సేవ చేస్తున్నారనే విషయం మరచిపోవద్దు. వారు సమ్మె చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. చర్చల ద్వారా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నామ’ని తెలంగాణ తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. తూనికలు, కొలతల్లో జరిగే మోసాలపై వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కొన్ని రోజుల క్రితం నగరంలోని ఒక స్కానింగ్ సెంటర్ తప్పుడు పరీక్షల వల్ల ఒక శిశువు, ఆమె కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురయిందని ఆయన తెలిపారు. పాప తల్లిదండ్రులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయిచడంతో.. సదరు స్కానింగ్ సెంటర్‌ను దోషిగా తేలుస్తూ ఫోరం 2 లక్షల జరిమానా విధించిందని అన్నారు. ఆ మొత్తాన్ని బాధిత కుంటుంబానికి చెక్కు రూపంలో గురువారం అందజేశారు. ఇటీవల నగరంలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి 12 కోట్ల రూపాయల వరకు జరిమానాలు విధించామని పేర్కొన్నారు. వస్తు, సేవల్లో మోసాలకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు వినియోగదారుల సేవా కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రతి వ్యాపారీ అతను అందించే వస్తు, సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడే వ్యాపారులపై వినియోగదారులు 180042500333 టోల్ ఫ్రీ నెంబర్, ఫేస్బుక్, ట్విటర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. దోషిగా తేలితే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ఉద్ఘాటించారు. -
నిఘా నిద్ర.. దగా ముద్ర
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు , గూడూరు : తూనికలు– కొలతల అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తుండడంతో దుకా ణదారులు విజృంభిస్తున్నారు. ఫలి తంగా వినియోగదారుల జేబులకు చిల్లుపడుతోంది. తూకం వేసేటప్పుడు వ్యాపారులు చేస్తున్న మాయల వల్ల నిత్యం వేలాది మంది సామాన్యులు మోసపోతున్నారు. ఇందుకు కారణం అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించడమే. సిబ్బంది కొరత జిల్లా కేంద్రమైన నెల్లూరులో డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టరే నెల్లూరు డివిజన్ లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన జిల్లాలోని అన్ని డివిజ¯Œన్లను పర్యవేక్షించడంతో పాటు జిల్లా కేంద్రం లో కూడా విధులు నిర్వహించాల్సి ఉంది. అదేవిధంగా గూడూరు డివిజన్లోని 16 మండలాల్లో సుమారు 5 వేల దుకా ణా లున్నాయి. వాటన్నింటినీ కూడా ఆ యనే తనిఖీలు చేయాల్సి ఉంది. అ లాగే ప్రస్తుతం గూడూరు లీగల్ మె ట్రాలజీ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్గా కందుకూరులో పనిచేస్తున్న రామచంద్రయ్య విధులు నిర్వహిస్తున్నారు. కాగా కందుకూరులో 18 మండలాలు, పలు పట్టణాలు ఉన్నాయి. దీంతో ఆయన 34 మండలాలతో పాటు, మరో 10 పట్టణాల్లో కూడా తనిఖీలు చేయాల్సి ఉంది. అలాగే గూడూరు లీగల్ మెట్రాలజీ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో తనిఖీలు నిర్వహించాక, నిర్వహించాల్సిన రికార్డు వర్క్ సకాలంలో జరగడం లేదు. నిబంధనల మేరకు జరగాల్సిన తనిఖీలు కూడా నామమాత్రంగానే జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఉండాలి దుకాణాల్లో విక్రయించే ప్రతి వస్తువుపై కూడా ఎమ్మార్పీ, ప్యాకింగ్ తేది, అడ్రస్, బరువు తదితర పూర్తి వివరాలు ఉండాలి. కానీ కొన్ని వస్తువులపై అలాంటి వివరాలు ఉండడం లేదు. అలాగే ఎలక్ట్రానిక్ కాటాలను ఏడాదికోసారి సర్టిఫైడ్ రిపేరల్‌లు వచ్చి తనిఖీ చేయాల్సి ఉంది. అనంతరం లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్లు సర్టిఫై చేస్తారు. అలాగే అడ్డకాటాలకు, వాటికి వినియోగించే కిలో నుంచి 50 గ్రాముల ఇనుప గుండ్లకు ప్రతి రెండేళ్లకోసారి ముద్రలు వేయించుకోవాల్సి ఉంది. కా నీ ఆ దిశగా చాలాచోట్ల జరిగిన దాఖలా లేదు. దీంతో వినియోగదారులు తూ కాల్లో దగాకు గురవుతూనే ఉన్నారు. వెంకటరమణయ్య మార్కెట్‌కు వచ్చి కిలో టమోటాలు కొనుగోలు చేశారు. అయితే అవి కిలో ఉండవని ఆయనకు అనుమానం వచ్చి, తనకు తెలిసిన దుకాణంలో కాటా వేయించాగా టమోటాలు 850 గ్రాములు మాత్రమే ఉండడంతో అవాక్కయ్యారు. అలాగే సుబ్రహ్మణ్యం పండ్ల దుకాణానికి వెళ్లి కేజీ ఆపిల్ కొన్నారు. ఈయన కూడా అనుమానంతో వాటిని పక్కనే ఉన్న మరో దుకాణంలో కాటా వేయించగా 750 గ్రాములే ఉన్నాయి. అలాగే బియ్యం బస్తాల కొనుగోలు విషయంలో కూడా వినియోగదారులను కొందరు వ్యాపారులు మోసం చేస్తున్నారు. 25 కిలోల బియ్యం ఉండాల్సిన బస్తాలో కొన్ని దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా 22 లేదా 23 కిలోలుగా ప్యాక్ చేసి, వాటినే 25 కిలోలుగా చూపుతూ ఘరానా మోసానికి పాల్పతున్నారు. ఫలితంగా వినియోగదారులు ఒక బస్తాపై రూ.120 వరకూ నష్టపోతున్నారు. కొంత ఇబ్బందిగానే ఉంది కందుకూరు లాంటి పెద్ద డివిజన్లో తనిఖీలు చేయడంతోపాటు గూడూరు డివిజన్లో ఇన్చార్జ్ బాధ్యతలతో కొంత ఇబ్బందిగానే ఉంది. అయినప్పటికీ తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఇక్కడ సిబ్బంది కూడా లేరు. – రామచంద్రయ్య, గూడూరు లీగల్ అండ్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ -
లీగల్ మెట్రాలజీ అధికారి సస్పెన్షన్
హైదరాబాద్ సిటీక్రైం: లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్‌గా పనిచేస్తున్న కె.భాస్కర్‌పై తెలంగాణ ప్రభుత్వం గురువారం సస్పెన్షన్ వేటు వేసింది. పెట్రోల్ బంక్‌ల్లో అక్రమాలకు ఊతమిస్తున్నారని, యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ మేరకు చర్య తీసుకుంది. -
పెట్రోలు బంకుల సమ్మె విరమణ
-
గవర్నర్ సీరియస్.. పెట్రోలు బంకుల సమ్మె విరమణ
పెట్రోలు బంకుల మూసివేతపై గవర్నర్ సీరియస్‌గా స్పందించారు. తక్షణం వాటిని తెరిపించేలా చర్యుల తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజాజీవితానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పౌరసరఫరాల శాఖకు ఆయన ఆదేశాలిచ్చారు. దీంతో బంకుల యాజమాన్యాలు దెబ్బకు దిగొచ్చాయి. సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు పెట్రోలు బంకుల డీలర్ల సంఘం తెలిపింది. మరోవైపు పెట్రోల్‌బంకుల్లో వాడుతున్న రెండు కంపెనీల తూనిక యంత్రాల కారణంగా అవకతవకలకు ఆస్కారం ఉందని తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ భాస్కర్ తెలిపారు. వాటిని రిమోట్‌తో ఆపరేట్ చేస్తున్నారని, రిమోట్ ఆధారంతో నేరుగా ధర, పరిమాణాన్ని కావాల్సిన విధంగా ఆపరేట్ చేస్తున్నారని వివరించారు. అనేక బంకులపై దాడులు చేసి కేసులు నమోదు చేశామని, రిమోట్లు వాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ట్రస్సర్‌వీన్ కంపెనీ తూనిక యంత్రాలు వాడుతున్న బంకులను సీజ్‌చేశామని, చైనా నుంచి ఈ యంత్రాలను దిగుమతిచేసుకుని వినియోగదారులను మోసం చేస్తున్నారని భాస్కర్ చెప్పారు. కంపెనీ పాస్‌వర్డ్‌ను అధికారులకు అందుబాటులో ఉంచడంలేదని, సికింద్రాబాద్‌లో ట్రస్సర్‌వీన్ కార్యాలయంపై దాడులు చేసినప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయని ఆయన తెలిపారు. -
బంకుల అక్రమాలపై 86 కేసులు
పెట్రోల్ బంకుల అవతవకలపై ఇప్పటి వరకు 86 కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రెస్సర్ వేన్ రిమోట్లను వాడుతున్న పంపులపై వంద కేసులు నమోదు చేశామన్నారు. పెట్రోల్ బంకుల యాజమాన్యాలు సమ్మె దిగడం సబబు కాదని, నిబంధనలకు విరుద్ధంగా బంకులు కొనసాగిస్తే మాత్రం తమ దాడులు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీల పేర్లు చెప్పి పెట్రోల్ డీలర్లు తప్పించుకోవడం సరైనది కాదని లీగల్ మెట్రాలజీ అధికారులు అన్నారు.