
ఈటల రాజేందర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: బయోమెట్రిక్ పనిచేయకపోతే మాన్యువల్‌గా లేదంటే ఐరిష్‌తో వినియోగదారులకు సరుకులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆగస్టు 15 తర్వాత ఈ విధానం అమలులోకి తీసుకువస్తామన్నారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అర్హులకు ఎప్పుడంటే అప్పుడు కార్డు అందించి సరుకులను ఇచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. కల్తీకి ఆస్కారం లేకుండా సన్న బియ్యం సరఫరా చేస్తామని ఉద్ఘాటించారు. లాభదాయకమైన శాఖ కాకపోయినప్పటికీ సమాజ సేవలో ముందుండే శాఖ సివిల్ సప్లై అని అన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏ ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం లేదంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ప్రతి కిలో వరి ధాన్యాన్ని కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూశామని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామినిచ్చారు. సివిల్ సప్లై కార్పొరేషన్ తో పాటు నాలుగు శాఖల రాష్ట్ర, జిల్లా అధికారుల సమావేశం నిర్వహించామని అన్నారు. ఇకపై ప్రతినెలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతికి తావులేకుండా చేసి సివిల్ సప్లై శాఖను గొప్ప సంస్థగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఎన్నో దాడులు నిర్వహించారనీ, కల్తీలకు ఆస్కారం లేకుండా చేసి ప్రజలకు నాణ్యమైన సరుకులు అందేలా చూస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment