ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన విక్రయదారుగా ఉన్న హైదరాబాద్‌లోని హైపర్‌ప్యూర్‌ను డీలిస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇటీవల హైపర్‌ప్యూర్ గోదాములో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) తనిఖీ నిర్వహించింది. అందులో ఫుడ్ ప్యాక్‌పై తప్పుడు ప్యాకింగ్ తేదీ నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. దాంతో జొమాటో స్పందించింది. కంపెనీ విక్రయదారుగా ఉన్న హైపర్‌ప్యూర్‌ను డీలిస్ట్ చేసినట్లు తెలిపింది.
హైదరాబాద్‌లోని హైపర్‌ప్యూర్ గోదాములో పుట్టగొడుగుల ప్యాక్‌పై తప్పుడు ప్యాకింగ్ తేదీ నమోదు చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తించింది. ఈ వ్యవహారంపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ మాట్లాడుతూ..‘జొమాటో సర్వీసుల్లో భాగంగా హైపర్‌ప్యూర్‌తో కలిసి పని చేశాం. కానీ ఇటీవల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీల్లో గోదాములోని అవకతవకలను గుర్తించారు. బటన్ మష్రూమ్‌కు సంబంధించిన 90 ప్యాకెట్లపై ప్యాకేజింగ్ తేదీ తప్పుగా ముద్రించినట్లు కనుగొన్నారు. జొమాటో ప్రతినిధులు కూడా ఈ సమస్యను గుర్తించారు. ఇది మానవ తప్పిదంగా భావిస్తున్నాం. వెంటనే హైపర్‌ప్యూర్ సర్వీసులను మా డేటాబేస్ నుంచి తొలగిస్తున్నాం. ఈ లోపాన్ని సకాలంలో గుర్తించడంలో మా బృందాలకు సహాయపడే కఠినమైన మార్గదర్శకాలు, సాంకేతిక వ్యవస్థలు మా వద్ద ఉన్నాయి’ అని గోయల్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆర్‌బీఐలో ఉద్యోగానికి దరఖాస్తులు.. అర్హతలివే..
బిజినెస్-టు-బిజినెస్ (బి2బి) వ్యాపార విభాగమైన జొమాటో హైపర్‌ప్యూర్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కేటరర్స్‌కు మాంసం, చేపలు, ఇతర ఆహారపదార్థాలు సరఫరా చేస్తుంది. కస్టమర్లకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గోయల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment