ఎమ్మార్పీకి మద్యం విక్రయం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగలనుంది. రాజమండ్రిలో మద్యం మామూళ్ల పంపకాల్లో అధికార, మిత్రపక్షం నేతల మధ్య సయోధ్య కుదరక పోవడంతో అధికారపార్టీ కీలకనేత ఒకరు సీఎంకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దాంతో మద్యం విక్రయాల్లో ఎమ్మార్పీ తెరపైకి తీసుకువచ్చారు. త్వరలో జిల్లా పర్యటనకు వచ్చే దీనిపై చర్చించి షరా ‘మాములు’గానే అమ్మకాలను పునరుద్ధరిస్తారని సిండికేట్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మండపేట :
జిల్లాలో దాదాపు 504 వరకు మద్యం దుకాణాలు, 34 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు సుమారు రూ. 1.85 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా లిప్టింగ్ (మునుపటి ఏడాది నెల ప్రామాణికంగా 10 శాతం అదనపు కొనుగోళ్లు చేయడం) విధానాన్ని తెరపైకి తెచ్చిన సర్కారు ప్రభుత్వ దుకాణాలను ప్రైవేటు పరం చేసింది. అమ్మకాలను పెంచేందుకు ఎమ్మార్పీ, బెల్టుషాపుల ఏర్పాటు విషయాల్లో వ్యాపారులకు అధికారులు స్వేచ్ఛ ఇస్తున్నారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఒక్కో మద్యం బాటిల్‌పై రూ. 15 వరకు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బెల్టుషాపులు ఎత్తివేస్తామంటూ సీఎం చేసిన రెండవ సంతకాన్ని నీరు గారుస్తూ జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా బెల్టుషాపులు ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నందుకు, బెల్టుషాపుల ఏర్పాటుకు అటు ఎక్సైజ్, పోలీసులకు సిండికేట్ వర్గాలు నెలవారీ మామూళ్లు సమర్పించుకుంటున్నాయి. అది కాకుండా వారు తాజాగా అధికారపార్టీ ఎమ్మెల్యేలకు లక్షలాది రూపాయలు ముడుపులు ముట్టచెప్పినట్టు తెలుస్తోంది.
విజయవాడ ఘటనతో..
ఐదు నెలల క్రితం విజయవాడలో చోటుచేసుకున్న కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు అప్పట్లో ప్రభుత్వం ఎమ్మార్పీని అమలులోకి తెచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత షరా మామూలుగానే ఎమ్మార్పీకి మించి అమ్మకాలు మొదలైపోయాయి. అయితే మద్యం మామూళ్ల విషయంలో రాజమండ్రిలో అధికార, మిత్ర పక్షాల మధ్య సయోధ్య కుదరలేదు. ఈ విషయం అధికారపార్టీకి చెందిన ముఖ్యనేత ఒకరు ఇటీవల సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం.
దాంతో ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలివ్వడంతో ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీకి విక్రయాలు మళ్లీ అమలులోకి వచ్చాయి. ఇప్పటికే జిల్లాలోని మద్యం సిండికేట్లు ఆ ముఖ్యనేతతో ఈ విషయమై సంప్రదించగా కొన్ని రోజుల పాటు ఎమ్మార్పీ కొనసాగించాలని సూచించినట్టు తెలుస్తోంది. త్వరలోనే జిల్లా పర్యటనకు వస్తున్న సీఎంతో ఈ విషయం మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో కొద్ది రోజుల్లో షరా మాములుగానే అమ్మకాలు జరుగుతాయన్న ఆశతో సిండికేట్ వర్గాలుఉన్నాయి.
మూణ్ణాళ్ల ముచ్చటే!
Published Fri, May 13 2016 1:56 AM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM
Advertisement
Advertisement