
సాక్షి, న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో వాటర్ బాటిళ్లను గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే ఎక్కువకు అమ్ముకోవచ్చని సుప్రీంకోర్టు మంగళవారం చెప్పింది. నీటిసీసాల అమ్మకాలకు ‘న్యాయబద్ధమైన కొలతలు, తూనికల చట్టం’ వర్తించదని జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. హోటళ్లలో వస్తువుల అమ్మకంతోపాటు వినియోగదారులకు సేవలు కూడా అందుతాయనీ, ఎవ్వరూ కేవలం నీటిసీసాను కొనడానికే హోటళ్లకు వెళ్లరని వ్యాఖ్యానించింది. సేవలతోపాటు రెస్టారెంట్లలో ఉండే వాతావరణాన్ని ఆస్వాదించేందుకే వినియోగదారులు అక్కడకు వెళ్తారనీ, అందుకోసం యజమానులు పెట్టబుడి పెడుతుండటం వల్ల ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేటు తీసుకోవచ్చంది. భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య వేసిన ఓ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.