సాక్షి, అమరావతి: ‘ఏ అంశంపై అయినా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది. సరైన ఫార్మాట్‌లో వస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజా సమస్యలపై చర్చ జరగకూడదన్న కుతంత్రం తప్ప మరో ఆలోచన వాళ్లకు లేదు. వాళ్లంతా పథకం ప్రకారమే వచ్చారు. ప్లకార్డులు పట్టుకుని గలాటా చేస్తున్నారు. ఎంత చెప్పినా వాళ్ల బుద్ధి మారడం లేద’ంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం శాసన మండలి సమావేశం ప్రారంభం కాగానే.. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు.
తగిన ఫార్మాట్‌లో వస్తే ప్రభుత్వం సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. అయినా వినిపించుకోకూండా టీడీపీ సభ్యులు ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి, పోడియం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలి చైర్మన్ కల్పించుకుని ‘మీరు ఏదో ప్రత్యేక అజెండాతో వచ్చినట్టు ఉందే తప్ప సమస్యలపై చర్చించేందుకు వచ్చినట్టు లేదు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. మీ అజెండా ఇక్కడ అమలు చేయాలంటే కుదరదని స్పష్టం చేశారు. క్వశ్చన్ అవర్‌లో సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు మంత్రులు సిద్ధంగా ఉన్నారని, క్వశ్చన్ అవర్‌ను అడ్డుకుని లైవ్ కవరేజ్ ద్వారా ఏదో సాధించాలన్న తపనతో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని, డైరెక్షన్, స్క్రీన్‌ప్లే అంతా బయట నుంచి వస్తోందని, ఆ ప్రకారమే సభలో టీడీపీ సభ్యులు యాక్షన్ చేస్తున్నారని మంత్రి బుగ్గన అన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఎంత చెప్పినా వాళ్ల బుద్ధి మారడం లేదన్నారు. కావాలనే గలాటా చేసేందుకు వచ్చారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు ఆగలేక పోతున్నారని, శవాలపై పేలాలు ఏరుకోవడమే తప్ప సమస్యలపై చర్చిద్దామన్న ఆలోచన వారికి లేదన్నారు. ఎమ్మెల్సీ గంగుల ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. మద్యపాన నిషేధం ఎత్తివేసింది మీ తండ్రేనని, ముందు దానిపై చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్సీ లోకేశ్‌ను నిలదీశారు. ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రభుత్వం తరçఫున స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ టీడీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. పలుమార్లు సభను వాయిదా వేసినా విపక్ష సభ్యుల తీరు మారకపోవడంతో సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని, ప్రభుత్వం తరఫున మంత్రి స్టేట్‌మెంట్ వద్దంటే మీ ఇష్టం అంటూ సభను చైర్మన్ మోషేన్‌రాజు మంగళవారం నాటికి వాయిదా వేశారు.
ముమ్మాటికీ ఇది కుతంత్రమే
Published Tue, Mar 15 2022 4:02 AM | Last Updated on Tue, Mar 15 2022 4:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment